దేశంలోని ఒక్క శాతం ధనవంతుల చేతిలో 52 శాతం సంపద..!!!
అధికారిక గణాంకాల పరిశీలనలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ అనుసరించిన నయా ఉదార ఆర్థిక విధానాల వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయాలు బాగా తగ్గిపోయాయని, అదే సమయంలో బడా కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాల ఆస్తులు అంతకంతకూ పెరిగిపోయాయని ప్రభుత్వ గణాంకాల్లోనూ స్పష్టమవుతోంది. దేశంలోని ఉద్యోగులు, నిరుద్యోగితపై నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఎస్‌వో).. (ప్రస్తుతం నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌, ఎన్‌ఎస్‌వోగా పేరు మార్చారు) 2004-05 నుంచి 2017-18 వరకు వెల్లడించిన ఇంటింటి సర్వే నివేదికలను పరిశీలిస్తే ఇది అర్థమవుతోంది. 2011-12 నుంచి 2017-18 వరకు ఏడేండ్ల డేటాను పరిశీలిస్తే వివిధ రంగాల కార్మికుల వేతనాలు సగటున ఏడాదికి 1.05 శాతం మాత్రమే పెరిగాయి. అంతకుముందు యూపీఏ హయాంలో చూస్తే 2004-05 నుంచి 2011-12 వరకు 5.52 శాతం చొప్పున పెరిగాయి. అంటే.. దేశంలోని కార్మికుల పరిస్థితి యూపీఏ హయాంకన్నా మోడీ హయాంలోనే అధ్వాన్నంగా ఉన్నదని అర్థం. 2011 నుంచి 2018 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాల్లో సగటు పెరుగుదల 2.9 శాతం కాగా, పట్టణాల్లో మైనస్‌ 1.49 శాతం నమోదైంది. మైనస్‌ అంటే.. ఏటేటా సగటున ఆమేరకు ఆదాయాలు తగ్గాయని అర్థం.

మోడీ సర్కార్‌ అధికారం చేపట్టిన తర్వాత జీడీపీ వృద్ధిరేట్‌ను 2018 వరకూ ఘనంగానే చూపించారు. అది ఎలా సాధ్యమని ఆలోచిస్తే ఆ సంపద అంతా కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు పోగేసుకున్నదని అర్థం చేసుకోవాలి. 2018లో లెక్కేసి చూస్తే దేశం మొత్తం సంపదలో ఒక్క శాతం ధనవంతుల సంపద 52 శాతంమేర ఉన్నట్టు తేలింది. అంటే దేశ సంపదలోని సగానికిపైగా ఒక్క శాతం ధనవంతుల చేతుల్లోనే పోగుపడిందని స్పష్టమవుతోంది.

2011 నుంచి 2018 వరకూ వేతనాల్లో వృద్ధిని రంగాలవారీగా చూస్తే..వ్యవసాయంలో 1.36 శాతం, గనుల్లో మైనస్‌ 2.28 శాతం, తయారీ రంగంలో 1.02, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా రంగాల్లో మైనస్‌ 1.02, నిర్మాణ రంగంలో 1.86, వాణిజ్యం, హౌటళ్లు, రెస్టారెంట్లు మైనస్‌ 0.26 శాతం, రవాణా, నిల్వలు, సమాచార రంగాల్లో మైనస్‌ 2.23, ఆర్థిక, స్థిరాస్థి రంగాల్లో మైనస్‌ 4.3 శాతం, ప్రజా పాలనలో మైనస్‌ 0.82 శాతం, ప్రయివేట్‌ హౌజ్‌హౌల్డ్‌ ఉద్యోగుల్లో 0.99, ఇతర సర్వీసుల్లో మైనస్‌ 0.76 శాతం నమోదైంది.
ఇదే కాలంలో ప్రయివేట్‌ సంస్థల్లోని కార్మికుల వేతనాలకు భారీగా కోత పడినట్టు గణాంకాల్లో స్పష్టమవుతోంది. ప్రయివేట్‌ ఉద్యోగుల వేతనాల్లో మైనస్‌ 3.02 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు మైనస్‌ 0.85 శాతం, ఇతర ఉద్యోగులకు 0.81 శాతం వృద్ధి నమోదైంది. మైనస్‌ వృద్ధి అంటే సగటున ఏడాదికి ఆమేరకు కోత పడినట్టు అర్థం.

ఇదే కాలంలో దేశ పౌరుల వినియోగం(ఖర్చులు) కూడా తగ్గినట్టు లీకైన ఎన్‌ఎస్‌వో నివేదిక స్పష్టం చేసింది. 2011-12లో సగటు వినియోగం నెలకు రూ.1501 కాగా, 2017-18కి రూ.1446కు తగ్గింది. అంటే సగటు వినియోగం గతంకన్నా 3.7 శాతం తగ్గిందని అర్థం. ఇదే కాలంలో(2017-18లో) దేశంలోని నిరుద్యోగిత 45 ఏండ్ల గరిష్టానికి(6.2 శాతానికి) చేరినట్టు ఇప్పటికే ప్రభుత్వ అధికారిక నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana