Image result for 15th finance commissionరాష్ట్రాలను సంపద్రించకుండా, వాటి సమ్మతి లేకుండా ఆర్థిక సంఘం విధి విధానాలు, నిబంధనలలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన, స్పష్టమైన దాడిలో భాగమే. దేశ అంతర్గత భద్రతకు నిధుల కేటాయింపు అన్న అదనపు నిబంధన విషయమై 15వ ఆర్ధిక సంఘం అధ్యక్షులు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటిని సంప్రదించి సరైన నిర్ణయానికి రావాలి.

రాజ్యాంగంలోని 280(1) అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి 2020–-25 సంవత్సరాల కాలానికి 2017 నవంబర్ 27న 15వ ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర. ప్రభుత్వాల మధ్య రాబడి, పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేస్తుంది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసులు 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2025, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. సంఘం విధి విధానాలు, నిబంధనలు (టర్మ్స్ ఆఫ్‌ రిఫరెన్స్‌- టీఓఆర్‌) దాని లక్ష్యాలను తెలియ జేస్తాయి. 15వ ఆర్ధిక సంఘం లక్ష్యాలు, నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, సాధారణ ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించారు. ఇప్పటికే 15వ ఆర్ధిక సంఘం లక్ష్యాలు, నిబంధనల పట్ల దేశవ్యాప్తంగా అసంతృప్తులు, విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రాష్ట్రాలు తమ అధికారాలను ఆర్ధిక సంఘం హరిస్తోందన్న ఆందోళనను వ్యక్తం చేశాయి.

కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటా నిర్ణయించడంలో జనాభా ఒక అతి ముఖ్యమైన అంశం. 15వ ఆర్ధిక సంఘం నిధుల పంపిణీలో అంటే పన్నులు, విధులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను రాష్ట్రాల మధ్య విభజనకు ఇన్నాళ్లూ అనుసరిస్తున్న 1971 జనాభా గణాంకాలను ఆధారంగా తీసుకోకుండా 2011 జనాభా గణాంకాలను లెక్కలోకి తీసుకుంటోంది. ఈ విధానాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి దిశగా, వేగంగా పయనిస్తున్న రాష్ట్రాలు తాము నష్టపోతామని భావిస్తున్నాయి. జనాభా నియంత్రణపై దృష్టి సారించిన రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడిలో లభించే వాటాలు తగ్గే ప్రమాదం ఉంది. 2011 జనాభా ప్రాతిపదికన, కేంద్ర పన్నుల రాబడిని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలనుకునే పద్ధతినే పార్లమెంటు సభ్యుల సంఖ్యతో అమలు చేస్తే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది. పార్లమెంటులో రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుంది. ఈ పరిణామాలన్నీ భారత సహకార సమాఖ్య తత్వానికి వ్యతిరేకమైనవి.

2019 జూలై 17న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 15 ఆర్ధిక సంఘం విధి విధానాలకు అదనంగా మరో అంశాన్ని (అడిషనల్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) చేర్చడానికి నిర్ణయించారు. దీని ప్రకారం దేశ అంతర్గత భద్రత, రక్షణకు మురిగిపోని విధంగా నిధులు కేటాయించడానికి మార్గం సుగమం చేసేందుకు ఏదేని ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటును, అది పని చేసే విధానాన్ని 15వ ఆర్ధిక సంఘం సూచించాలి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాల పరిమితిని పెంచింది. నవంబర్‌ 30 వరకు అంటే నెల రోజుల పాటు గడువు పొడిగించింది. ఈ మేరకు జులై 29న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశ అంతర్గత భద్రత, రక్షణ అంశాలు అత్యంత జాతీయ ప్రాముఖ్యం గల అంశాలు అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆర్ధిక సంఘానికి అప్పచెప్పిన అదనపు బాధ్యత అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దీని వల్ల, ముఖ్యంగా రాష్ట్రాలపై ఆర్ధిక పరంగా చూపే ప్రభావం ఏమటన్నది విశ్లేషించుకోవాల్సి ఉంది. 15వ ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సూచించిన విధి విధానాల్లో కేంద్ర వనరులకు సంబంధించిన డిమాండ్లకు, ముఖ్యంగా రక్షణ, దేశ అంతర్గత భద్రత, మౌలిక వసతులు, రైల్వేలు. వాతావరణ మార్పు, చట్ట సభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పాలనకు, ఇంకా ఇతర అటువంటి అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇమ్మని స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని గత (14వ) ఆర్ధిక సంఘం కూడా తన విధి విధానాల్లో పేర్కొంది. అందువల్లే రక్షణ, అంతర్గత భద్రతలకు ఖర్చు చేయాల్సిన అంశాలను పన్నుల పంపిణీలో రాష్ట్రాల వాటాను నిర్ణయించక ముందే సంఘాలు పరిగణనలోకి తీసుకుంటాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరగడం అనేది సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణం. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనకు సంబంధించి మూడు జాబితాలను వివరిస్తుంది. అధికరణం 246 కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించింది, రక్షణ అనేది కేంద్ర జాబితాలోని అంశం కాబట్టి కేంద్రం పరిధిలోకి వస్తుంది. ఈ అంశానికి అవసరమైన నిధుల కోసం సంచిత నిధి నుంచి ఒక రక్షణ నిధిని ఏర్పాటు చేసే వెసులుబాటు కేంద్రానికి ఉంది. ఈ విధంగా రక్షణ నిధిని ఏర్పాటు చేసే వీలు ఉన్నప్పుడు, నిధులు కోసం ప్రత్యేకంగా వేరే యంత్రాంగం ఏర్పాటు చేయాలని 15వ ఆర్ధిక సంఘానికి కేంద్రం సూచించడంలో అర్ధం లేదు. ఒక వేళ కేంద్రం రక్షణ పై మరింత ఖర్చు చేయాలనుకున్నప్పుడు సంచిత నిధికి మరింత ఎక్కువ వనరులను కేటాయించ వచ్చు. అయినప్పటికీ కేంద్రం అదనపు నిబంధనను (అడిషనల్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)ను సూచించడం గమనిస్తే కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాల వాటాను నిర్ధారించక ముందే రక్షణకు ఒక నిధిని ఏర్పాటు చేయడం కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది.

అందుకే, కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాను తగ్గించే విధంగా ఆర్ధిక సంఘం చేత సిఫార్సు చేయించడమే కేంద్రం ఉద్దేశంగా కనపడుతోందని ఆర్ధిక సంఘం మాజీ సభ్యుడు డాక్టర్‌ ఎమ్‌. గోవిందరావు అభిప్రాయపడ్డారు. గత ఆర్ధిక సంఘాలు ఏవీ కూడా కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాల వాటాను తగ్గించలేదు. అందువల్ల ప్రస్తుతం ఉన్న 42 శాతం రాష్ట్రాల వాటాలో ఎటువంటి మార్పు చేయకుండా ముందుగానే కేంద్ర పన్నుల రాబడి నుంచి రక్షణ నిధిని ఏర్పాటు చేసి మిగిలిన (లేదా తగ్గిన) నిధుల నుంచి రాష్ట్రాలకు వాటా కల్పించడం వ్యూహంగా కనిపిస్తోంది. దీని వల్ల రాష్ట్రలకు పంపిణీ అయ్యే నిధులు తగ్గుతాయి.

అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో అంతర్గత భద్రతను చేర్చడం మరో వింత పోకడ. సరిహద్దు భద్రత తప్ప అంతర్గత భద్రత అనేది పూర్తిగా రాష్ట్ర జాబితాకు చెందిన అంశం. ఏ రాష్ట్రానికైనా కేంద్రం నుంచి అదనపు భద్రతా దళాల అవసరం ఏర్పడితే, సదరు దళాల తరలింపునకు అయ్యే ఖర్చును సంబంధిత రాష్ట్రమే భరిస్తుంది.

ఎలా చూసినా అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌ దేశ సహకార సమాఖ్య తత్వానికి, రాష్ట్రాల సాధికారత సాధనకు వ్యతిరేకమైనది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేది. ఆర్ధిక సంఘం ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రాలకు నిధుల పంపిణీ గణనీయంగా తగ్గుతుందనడంలో సందేహం లేదు. గతంలో ఆర్ధిక సంఘాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేని నిబంధనలను, సూచనలను పరిగణనలోకి తీసుకునేవి కావు. అందుకే ‘ఆర్ధిక సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అది కేంద్ర, రాష్ట్రాల అవసరాలను నిష్పాక్షికంగా నిర్ధారించాలి. అదనపు టర్మ్స్‌ ఆఫ్ రిఫరెన్స్‌ను ఏ మాత్రం పట్టించుకోనసరం లేదు’ అని డాక్టర్‌ గోవిందరావు వ్యాఖ్యానించారు.

మాజీ ప్రధాని, ఆర్ధిక నిపుణుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కూడా కేంద్ర వైఖరిని తప్పు పడుతూ ‘ కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘానికి సంబంధించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి ముందుకు పోవడం మంచిది. లేకపోతే రాష్ట్రాలకు అందాల్సిన వనరులను కేంద్రం దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని వారు గట్టిగా నమ్మే అవకాశం ఉంది. ఈ విధానం మన దేశ సమాఖ్య రాజకీయానికి, అందరూ కోరుకునే సహకార సమాఖ్య నిర్మాణానికి ఏ మాత్రం దోహదం చేయదు’ అన్నారు.

రాష్ట్రాలను సంపద్రించకుండా, వాటి సమ్మతి లేకుండా అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను అమలులోకి తీసుకురావాలనే ప్రయత్నం సాదా సీదా చర్యగా నేను భావించడం లేదు. ఇది సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన, స్పష్టమైన దాడిలో భాగం. కనీసం ఇప్పటికైనా 15వ ఆర్ధిక సంఘం అధ్యక్షులు ఆదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ పై రాష్ట్ర ప్రభుత్వాలన్నిటిని సంప్రదించి సరి చేసుకోవాలని కోరుతున్నాను.

 

Image result for mp vinod kumar
బి.వినోద్‌ కుమార్‌
మాజీ ఎం.పి.,
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

(Courtesy Andhrajyothi)