రాష్ట్రాల హక్కులు కబళిస్తున్న బిజెపి

C

– యం. కృష్ణమూర్తి

బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు సిద్ధాంతం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు పార్లమెంటులో ఉన్న మంద బలాన్ని ఉపయోగించి యధేచ్ఛగా రాష్ట్రాల హక్కులపై దాడులు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను రద్దు చేయడమేగాక యు.ఎ.పి.ఎ, ఎన్‌.ఐ.ఎ, మోటారు ట్రాన్స్‌పోర్టు, ఆర్‌.టి.ఐ, ఎన్‌.ఎం.సి, డి.ఆర్‌.పి.ఎ చట్టాలకు సవరణ బిల్లులు ప్రవేశ పెట్టింది. లోక్‌సభలో మందబలం, వివిధ పార్టీలను చీల్చి రాజ్యసభలో పెంచుకున్న బలంతో బిల్లులన్నింటిని మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. ఈ చట్ట సవరణలతో రాష్ట్రాల హక్కులను లాగేసుకుంది. 

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. రాష్ట్ర హోదాను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా దిగజార్చారు. లడఖ్‌కు శాసనసభ కూడా లేకుండా చేసి కేంద్రం పెత్తనం కిందికి తెచ్చారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను, స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రజల భూమికి, పౌరసత్వానికి రక్షణ ఇచ్చే 35 (ఎ) ఆర్టికల్‌ను కూడా రద్దు చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ఆ రాష్ట్ర ప్రజల ఆమోదం గానీ, అభిప్రాయం గానీ, ప్రమేయం గానీ లేకుండా చేశారు. ఇదంతా జమ్మూ కాశ్మీర్‌ను ఉద్ధరించడానికేనని మోడీ, షా ద్వయం నమ్మమంటున్నది.

జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరుగుతుందో దేశమంతా తెలుసుకోకుండా, చివరికి ఆ రాష్ట్ర ప్రజలకూ తెలియకుండా చేయడానికి ఇంటర్నెట్‌ ఆపేశారు. టెలివిజన్‌ ప్రసారాలు నిలిపివేశారు. 144 సెక్షన్‌ విధించి ప్రజల కదలికను కట్టడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధంలో పెట్టారు. జమ్మూ కాశ్మీర్‌ను ఉద్ధరించడానికైతే ఇంత నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని ప్రజల ఇంగితం ప్రశ్నిస్తున్నది. ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతున్న టిడిపి, వైసిపిలు రాజ్యాంగ విరుద్ధంగా, ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బదీసి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిరంకుశంగా జమ్మూ కాశ్మీర్‌ను ధ్వంసం చేసే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోగా మద్దతిస్తున్నాయి. ఈ రెండు పార్టీల తీరు భవిష్యత్తులో మన రాష్ట్రానికి నష్టమే.

రాష్ట్రాల హక్కుల కబళింపు భారత సమాఖ్య వ్యవస్థపై దాడి
బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు సిద్ధాంతం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు పార్లమెంటులో ఉన్న మంద బలాన్ని ఉపయోగించి యధేచ్ఛగా రాష్ట్రాల హక్కులపై దాడులు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను రద్దు చేయడమేగాక యు.ఎ.పి.ఎ, ఎన్‌.ఐ.ఎ, మోటారు ట్రాన్స్‌పోర్టు, ఆర్‌.టి.ఐ, ఎన్‌.ఎం.సి, డి.ఆర్‌.పి.ఎ చట్టాలకు సవరణ బిల్లులు ప్రవేశ పెట్టింది. సెలెక్టు కమిటీకి పంపించాలని సభ్యులు డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. లోక్‌సభలో మందబలం, వివిధ పార్టీలను చీల్చి రాజ్యసభలో పెంచుకున్న బలంతో బిల్లులన్నింటిని మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. ఈ చట్ట సవరణలతో రాష్ట్రాల హక్కులను లాగేసుకుంది. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో వున్నవే. ఈ బిల్లులన్నింటి లోనూ రాష్ట్రాల హక్కులను కాలరాయడంతో మన రాజ్యాంగం లోని ‘సమాఖ్య’ భావనకు గండి కొట్టింది.

చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్ట (సవరణ) బిల్లు  India government, Modi targeting States rights, centralized, Constitution, bjp, authoritarian
ఈ చట్ట సవరణతో ఏ రాష్ట్రంలోనైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అనుమానితుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు అధికారం ఇవ్వబడుతుంది. ఇంత వరకు రాష్ట్ర పోలీసు అనుమతితోనే జరిగేది. ఈ సవరణతో రాష్ట్ర పోలీసు అనుమతి అవసరం లేదు. అసలు చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్రం చొరబడిపోవడమే. ఇది రాష్ట్రం హక్కును కేంద్రం స్వాధీనం చేసుకోవడమే.
ఈ చట్ట సవరణ ప్రకారం ఏ వ్యక్తినైనా టెర్రరిస్టుగా ప్రకటించవచ్చు. కోర్టు ముందు హాజరు పర్చకుండా రెండు సంవత్సరాల పాటు జాతీయ నేర పరిశోధనా సంస్థ నిర్బంధించవచ్చు. టెర్రరిజాన్ని, విప్లవ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నా రనే నెపంతో టెర్రరిస్టుగా, అర్బన్‌ నక్సలైట్‌గా ప్రకటిస్తామని అమిత్‌షా పార్లమెంటులో ప్రకటించారు కూడా. ఇది భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను హరించి వేయడమే. బిజెపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వారినందరినీ భయపెట్టి లొంగదీసుకోవడానికి లేదంటే టెర్రరిస్టు ముద్ర వేసి జైళ్ళలో నిర్బంధించే కుట్రే ఈ సవరణకు మూలం.

మోటారు వాహన చట్ట (సవరణ) బిల్లు
ఈ సవరణతో మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌, లైసెన్సింగ్‌ ప్రక్రియలను రాష్ట్ర పరిధి నుండి కేంద్రం స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఏర్పరచేే ఒక సంస్థ రిజిస్ట్రేషన్‌, లైసెన్సింగ్‌ రెండు ప్రక్రియలనూ ఔట్‌సోర్సింగ్‌ చేస్తుంది. ఇందులో వాహనాలు నడిచే రూట్లను వేలం వేసే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారం కేంద్రానికి దఖలు పడుతుంది. లాభదాయకమైన రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేసి ఆర్‌.టి.సి.లను ధ్వంసం చేసే కుట్ర కూడా ఇందులో ఇమిడి ఉంది.

జాతీయ మెడికల్‌ కమిషన్‌ బిల్లు
ఇంతవరకు ఉన్న ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎం.సి.ఐ) బదులుగా మోడీ ప్రభుత్వం ‘నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బిలు’్ల (ఎన్‌.ఎం.సి) తెచ్చింది. ‘ఎం.సి.ఐ’లో 100 మంది ఉంటారు. అందరూ వైద్య రంగంలో నిష్ణాతులే. అందరూ రాష్ట్రాల ప్రతినిధులే. మోడీ తెస్తున్న ‘ఎన్‌.ఎం.సి’లో 26 మంది సభ్యులు ఉంటారు. అందులో 21 మందిని కేంద్రం నియమిస్తుంది. ఐదుగురు మాత్రమే రాష్ట్రాల నుండి ఉంటారు. 12 ఏళ్ళకు ఒకసారి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వస్తుంది. మొత్తం సీట్లలో 50 శాతం యాజమాన్యం కోటా కింద అమ్మేసుకోవచ్చు. మిగిలిన 50 శాతం చట్టం ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినా ఫీజు మాత్రం ప్రభుత్వం నిర్ణయించదు. యాజమాన్యం ఇష్టమే. పేదలు, దళితులు, గిరిజనులు కష్టపడి సీటు సంపాదించినా ఫీజు కట్టలేని వారికి సీటు లేనట్లే. మొత్తం సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కేయడమే. ఇందులో కూడా కేంద్రం పెత్తనమే. వైద్య విద్యార్థుల సమస్య మరింత తీవ్రమైనది.

సమాచార హక్కు చట్టం (సవరణ) బిల్లు
ఈ సవరణతో కేంద్ర సమాచార కమిషన్‌ చీఫ్‌, ఇతర కమిషనర్లతో పాటు రాష్ట్ర స్థాయి కమిషనర్ల పదవీ కాలం, వేతనాలు, ఇతర విధి విధానాలకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం కేంద్రానికి దఖలు పడుతుంది. దీంతో సమాచార కమిషనర్లకు ఎటువంటి స్వతంత్రత ఉండదు. కేంద్ర ప్రభుత్వం ముందు చేతులు కట్టుకు నిల్చోవడమే. సమాచార హక్కు చట్టానికి శిరచ్ఛేదం చేసేసింది. పౌరుల సమాచారం పొందే హక్కును మోడీ ప్రభుత్వం లాగేసుకుంది. ఇదీ రాష్ట్రాల హక్కులు కాలరాయడమే.
వినియోగదార్ల హక్కుల

పరిరక్షణ చట్టం (సవరణ) బిల్లు
కేంద్ర వినియోగదారుల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వినియోగదార్ల హక్కుల పరిరక్షణ, శిక్షలు, పెనాల్టీలు విధింపులో కేంద్ర వ్యవస్థదే తుది నిర్ణయం. ఈ చట్ట సవరణ ద్వారా రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఉన్న హక్కులు ఇక ముందు ఉండవు. వినియోగదార్ల హక్కు గల్లంతే. రాష్ట్ర స్థాయి వినియోగదార్ల ఫోరం నిర్వహణ రూపంలో అదనపు ఆర్థిక భారం రాష్ట్రాలపై పడుతుంది.
జాతీయ విద్యా విధానం ముసాయిదా
ప్రధాని నేతృత్వంలో ‘రాష్ట్రీయ శిక్షా అభియోగ్‌’ పేరుతో జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇది విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిలకు సంబంధించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ. ప్రాథమిక విద్య నుండి సిలబస్‌, మీడియం, యాజమాన్యం నిర్ణయం మొత్తం ప్రధాన మంత్రి చేతిలో ఉంటాయి. ఈ కమిటీలో విద్యావేత్తలు ఉండరు. ఇతర పరిపాలక అధికార్లు, ఆర్‌.ఎస్‌.ఎస్‌ మనుషులే ఉంటారు. రాష్ట్రాల అధికారం గోవిందా. కేంద్రం పెత్తనమే. మొత్తం విద్యను ప్రైవేటు పరం చేయడం, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం స్వాధీనం చేసుకుని కేంద్రీకృతం చేయడం, విద్యలోకి మతోన్మాదాన్ని జొప్పించడం ఈ ముసాయిదా ప్రాథమిక లక్షణం.

ఉమ్మడి జాబితా నుండి కేంద్రం పెత్తనం కిందకి
ఈ అంశాలన్నీ ఉమ్మడి జాబితాలో వున్నప్పటికీ కేంద్రం ఏకపక్షంగా రాష్ట్రాల హక్కులను హరించేసి తన చేతిలోకి తీసుకుంటున్నది. కేంద్రీకృతం చేయడమేగాక అన్ని వ్యవస్థలను నియంత్రించే అధికారం ప్రధాన మంత్రి చేతుల్లోకి తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ చట్ట సవరణలన్నీ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా లోని కేంద్రీకృత పాలన, నియంతృత్వ ధోరణికి దారి తీస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీల లొంగుబాటు
రాష్ట్రాల హక్కులను, వనరులను కబళించేసి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఈ చట్ట సవరణలకు వైసిపి, టిడిపిలు మద్దతునిచ్చాయి. ఆ పార్టీల వెనుక ఉన్న స్వార్థపర వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం, తమపై ఉన్న సి.బి.ఐ కేసులకు భయపడి ఈ పార్టీలు బిజెపి కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతున్నాయి. చివరికి కాశ్మీర్‌ ప్రత్యేక ప్రత్తిపత్తిని, ఆ రాష్ట్ర హోదాను రద్దు చేసి ముక్క ముక్కలు చేసి జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రం పెత్తనం కిందకి తెచ్చుకునే కుట్రలను కూడా బలపర్చడం వలన రేపు రాజ్యాంగం ఇతర రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులపై దాడి చేయడానికి కూడా అంగీకారం తెలిపినట్లే.
కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చేసి హక్కులను కుదిస్తున్న సమయంలో ఆనాడు వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న జ్యోతిబసు, ఎన్‌టి. రామారావు, కరుణానిధి, రామకృష్ణ హెగ్డే, ఫరూక్‌ అబ్దుల్లా, బిజూ పట్నాయక్‌ వంటి హేమా హేమీలంతా కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులకై సమైక్యంగా పోరాడారు. వారి పోరాట ఫలితమే నేడు రాష్ట్రాలకు కొన్ని హక్కులు సంతరించాయి. కాని నేడు బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను, ఆర్థిక వనరులను కబళించేస్తుంటే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీలు బంటుల్లా తలాడిస్తున్నాయి.

రాష్ట్రాల హక్కులకై పోరాడాలి
ఈ ధోరణి మన రాష్ట్రానికే కాదు దేశ ప్రజలకే కీడుగా దాపురిస్తున్నది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని వైసిపి, టిడిపిలు బలపరచడం సిగ్గు చేటు. ఏ నోటితో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడుగుతున్నారో అదే నోటితో కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను, ఆఖరుకు రాష్ట్ర హోదాను సైతం రద్దు చేయడాన్ని ఈ రెండు పార్టీలూ సమర్థించడం బట్టి కేంద్రం పట్ల వీటి లొంగుబాటు స్వభావం బైటపడుతోంది. ఫెడరల్‌ స్ఫూర్తి మన రాజ్యాంగపు మూల స్థంభాలలో ఒకటి. దీనిని కాపాడుకోవడానికి అందరమూ సిద్ధం కావాలి.

 ( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ) 

(Courtacy Prajashati)

 

Leave a Reply