– ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో కష్టాలు
– ఆదాయాలు పడిపోవడం ఆందోళనకరం : ఐఎఎన్‌ఎస్‌-సీ ఓటర్‌ సర్వే

న్యూఢిల్లీ : రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా కాకముందే ప్రజల్లో మోడీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావడంలో బీజేపీ సర్కారు దారుణంగా విఫలమైందనీ, ఆదాయాలు అంతకంతకూ పడిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సర్వే సంస్థ ఐఎఎన్‌ఎస్‌-సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. నేడు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సంస్థ.. బడ్జెట్‌పై ప్రజల అంచనాలు, రెండోసారి మోడీ పాలన, మెరుగైన జీవితం వంటి అంశాలపై ‘బడ్జెట్‌ ట్రాకర్‌ ఫైండింగ్స్‌’ పేరిట సర్వే చేసింది. ఈ ఏడాది జనవరి మూడు, నాలుగు వారాల్లో దీనిని చేపట్టారు. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం…

సర్వేలో పాల్గొన్నవారిలో (సుమారు 5 వేల మంది) దాదాపు 72.1 శాతం మంది దేశంలో ద్రవ్యోల్బణం గతంలో కంటే పెరిగిందనీ, అలాగే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరల పెరుగుదల ఎక్కువైందని తెలిపారు. 2015లో 17.1 శాతం మంది మాత్రమే ఎన్డీఏ సర్కారును వ్యతిరేకిస్తే.. ఇదే అంశంపై 2019లో 48.3 శాతం మంది వ్యతిరేకించ టం గమనార్హం. కేవలం నాలుగేండ్లలోనే మోడీ సర్కారు తీరుపై జనాగ్రహం వ్యక్తమవుతున్నట్టు సర్వేలో తేలింది.

దేశఆర్థిక విధానాలు, వాటిపై మోడీ సర్కారు ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు 48.4 శాతం మంది ప్రజలు (గతేడాది 32 శాతం మంది) అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక మోడీ పాలనలో రాబోయే రోజుల్లో మెరుగైన జీవితం ఆశిస్తు న్నారా..? అనే ప్రశ్నకు.. 63 శాతం మంది లేదని చెప్పడం గమనార్హం.

25 శాతం మందైతే ఇంకా అద్వాన్నంగా తయారయ్యే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే ఆదాయాల్లో పెరుగుదల లేదనీ, కానీ ఖర్చులు మాత్రం అంతకుముందు కంటే విపరీతంగా పెరిగాయని 43.7 శాతం మంది (గతేడాది 25.6 శాతం మంది) వివరించారు. మొత్తంగా మోడీ పాలన తాము ఆశించి నట్టుగా లేదని సుమారు 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమనం, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావస రాల ధరల పెరుగుదలను అరికట్టడంలో మోడీ సర్కారు దారుణంగా విఫలమైందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే పేర్కొన్నది.

Courtesy Nava Telangana