* పార్టీ నేతలకే పెద్ద పీట
             న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోసహా నలుగురు గవర్నర్లను నియమించడం ద్వారా బిజెపి రాజ్యాంగ సూత్రాలు, కమిషన్ల సిఫార్సుల కన్నా తన సొంత పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యం అని స్పష్టం చేసినట్లయింది. రాజస్థాన్‌కు గవర్నర్‌గా బదిలీ అయిన కల్‌రాజ్‌మిశ్రా, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ గత మోడీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే. భగత్‌సింగ్‌ కొషియారి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 16వ లోక్‌సభలో బిజెపి ఎంపిగా వ్యవహరించారు. ఇక ఆరిఫ్‌ మొహమ్మద్‌ఖాన్‌ గాని, తమిళిసై సొందరరాజన్‌ గాని బిజెపి టిక్కెట్టుపై 2004, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు. రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో గవర్నర్‌ నియామకానికి సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఒక పానెల్‌ను సూచిస్తే రాష్ట్రపతి ఆ పానెల్‌లోని ఒకరిని ఎంపిక చేయాలని సూచన వచ్చింది. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ రాష్ట్ర క్యాబినెట్‌ సలహా మేరకు కేంద్రం గవర్నర్‌ నియామకాన్ని పరిశీలించాలన్నారు. గవర్నర్‌ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్న అభిప్రాయాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ బలపరుస్తూ, గవర్నర్‌ సదరు రాష్ట్రానికి ఆమోద యోగ్యు డుగా ఉండాలని, అయితే ఆ రాష్ట్రానికి చెందినవాడైతే మంచిదని అన్నారు. సర్కారియా కమిషన్‌ గవర్నరు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించకుండా ఉన్నవారైతే మంచిదని, మరీ ముఖ్యంగా ఇటీవలి వరకూ రాజకీయాల్లో చురుకుగా ఉన్నవారిని వెంటనే గవర్నరుగా నియమించ రాదని సిఫార్సు చేసింది. సర్కారియా కమిషన్‌ సిఫార్సులను పార్లమెంటు ఆమోదించింది. గవర్నరు కేంద్రప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేసే ఉద్యోగి వంటివాడు కాదని, ఆయా పార్టీల చెప్పుచేతల్లో పనిచేసే వ్యక్తి అయివుండకూడదని, సుప్రీంకోర్టు 2010లో బిసి సింఘాల్‌ వర్సెస్‌ కేంద్రప్రభుత్వం కేసులో చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే తటస్థంగా అంపైర్‌ మాదిరిగా గవర్నర్‌ వ్యవహరించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. అన్నింటినీ పక్కనబెట్టి బిజెపి ఇప్పుడు గవర్నర్లుగా తన విధేయులనే నియమిస్తోంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమూ ఇదే తీరున వ్యవహరించిన సంగతి కూడా మనకు ఎరికే. కాంగ్రెస్‌ సంస్కృతికి తాను పూర్తిగా భిన్నమని ప్రకటించుకున్న బిజెపి ఇప్పుడేం చేసింది! ఏమైనప్పటికీ గవర్నర్‌ వ్యవస్థపైన, నియామకాల ప్రమాణాలపైన మరల చర్చ జరగవలసిన అవసరాన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

Courtesy Prajashakthi…