పి.అశోకబాబు ( వ్యాసకర్త బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి )

ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించటం, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌లను విలీనం చేయటం, ప్రభుత్వ ఖర్చుతో ఉద్యోగులను తగ్గించటం, స్పెక్ట్రమ్‌ కేటాయించటం ఇవన్నీ ఆ సంస్థలను ప్రభుత్వ ఖర్చుతో ముస్తాబు చేసి, ఆ తరువాత ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకే. 27.10.2019 ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రకారం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ లను వ్యూహాత్మక భాగస్వామ్యం పద్ధతిలో డిజిన్వెస్ట్‌ చేసే అవకాశం వున్నది. కాబట్టి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ల ఉద్ధరణకే ప్రభుత్వం పని చేస్తున్నదనే భ్రమలో వుండాల్సిన అవసరం లేదు.

కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అక్టోబరు 23న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ లను పునరుద్ధరిస్తామని, విలీనం చేస్తామని, ఈ విలీనం జరిగేలోగా ఎం.టి.ఎన్‌.ఎల్‌ను బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌కు సబ్సిడీయరి కంపెనీగా మారుస్తామని అన్నారు. ఇప్పటికే ఎం.టి.ఎన్‌.ఎల్‌లో 43 శాతం వాటాలు అమ్మేశారు. కాబట్టి ఈ రెండింటినీ విలీనం చేయాలంటే ఎం.టి.ఎన్‌.ఎల్‌ను స్టాక్‌ మార్కెట్‌ నుండి తప్పించాలి (డి లిస్టింగ్‌ చేయాలి). లేదా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ను డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి వీలుగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టాలి (లిస్టింగ్‌ చేయాలి). ఉద్యోగుల సర్వీసు కండిషన్లలో వున్న తేడాలను పరిష్కరించాలి. ఎం.టి.ఎన్‌.ఎల్‌కి వున్న అప్పులు తీర్చాలి. వీటన్నింటిపై ఒక స్పష్టత లేనందున సూత్ర రీత్యా ఈ రెండు కంపెనీల విలీనానికి ఆమోదించామని, విలీనం జరిగేలోగా ఎం.టి.ఎన్‌.ఎల్‌ ను బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు సబ్సిడీయరీ కంపెనీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు సంస్థల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 4జి స్పెక్ట్రమ్‌ను 2016 నాటి ధరల ప్రకారం కేటాయిస్తుంది. ఇందుకయ్యే రూ.20,140 కోట్లను ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడిగా చూపిస్తుంది. దీనిపై చెల్లించాల్సిన జిఎస్‌టి రూ.3,674 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వ హామీతో వెలువడే సావరిన్‌ బాండ్ల అమ్మకం ద్వారా ఈ రెండు కంపెనీలు రూ.15,000 కోట్లు సేకరించుకోవాలి. దీనిని పెట్టుబడి, నిర్వహణ ఖర్చులకు, అప్పుల పునర్నిర్మాణానికి వినియోగించుకోవాలి. ఖాళీ స్థలాలు, భవనాల ద్రవ్యీకరణ ద్వారా రాబోయే 4 సంవత్సరాలలో ఈ రెండు కంపెనీలు రూ.30,000 కోట్లు సమీకరించుకోవాలి. ఈ నిధులను అప్పులు తీర్చేందుకు, బాండ్ల సర్వీసింగ్‌కు, నెట్‌ వర్క్‌ అప్‌ గ్రెడేషన్‌కు, నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవాలి. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో వున్న 1,60,000 మంది ఉద్యోగులలో 80,000 మందిని, ఎం.టి.ఎన్‌.ఎల్‌ లలో వున్న 20,000 మంది ఉద్యోగులలో 10,000 మందిని, అంటే సగం మంది ఉద్యోగులను వి.ఆర్‌.ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపించటం ఈ పునరుద్ధరణ పథకంలో ఒక ముఖ్యమైన అంశం.
వి.ఆర్‌.ఎస్‌ లో అదనంగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఆకర్షణీయంగా వుంటుందని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా అది ఆ విధంగా లేదు. మిగిలిన సర్వీసుకు వచ్చే జీతాన్ని (పే ప్లస్‌ డి.ఎ) 25 శాతం పెంచి దాని నుండి మిగిలిన సర్వీసుకు ఇచ్చే పూర్తి పెన్షన్‌ను తీసి వేసి మిగతాది మాత్రమే ఇస్తారు. కానీ 1.1.2017 నుండి జరగాల్సిన వేతన సవరణ ప్రస్తావనే ఈ పునరుద్ధరణ పథకంలో లేదు. వేతన సవరణ గురించి డి.ఓ.టి సెక్రటరీని అడిగితే ఇప్పట్లో లేదని, ఆర్థిక పరిస్థితి మెరుగై ఆపరేటింగ్‌ ప్రాఫిట్లు వచ్చే దశకు, మార్కెట్‌ లో ఇప్పుడున్న 10 శాతం నుండి 17 శాతం వాటా సాధించే దశకు చేరుకున్నప్పుడే వేతన సవరణని పరిశీలిస్తామని అన్నారు. 1.1.2017 నుండి వేతన సవరణ జరగక పోతే అంతకి ముందు రిటైరైన వారికి, ఆ తరువాత వేతన సవరణ అమలు లోకి వచ్చే తేదీ లోగా రిటైరయ్యే వారికి పెన్షన్‌ సవరణ జరగదు. వేతన సవరణ, పెన్షన్‌ సవరణ జరుగుతాయా లేదా అనేది పెద్ద సమస్యగా తయారవుతున్నది. పే రివిజన్‌కి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఆర్థిక పరిస్థితికి సంబంధం వున్నది. కానీ పెన్షన్‌ ఇవ్వటం, దానిని రివైజ్‌ చేయటం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి పే రివిజన్‌ కు సంబంధం లేకుండా పెన్షన్‌ రివైజ్‌ చేయాలని ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం వున్నది. ఎక్స్‌గ్రేషియాకి తన ఖజానా నుండి రూ.17,169 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్న ప్రభుత్వం అంతకన్నా తక్కువకే పే రివిజన్‌ అయ్యే అవకాశం వున్నప్పటికీ ఎందుకు ఆ పని చేయటం లేదు? పైగా ఎక్స్‌గ్రేషియా ఒకే సారిగా ఖర్చు అయ్యే పెద్ద మొత్తం. పే రివిజన్‌కు అయ్యే ఖర్చు ఒకేసారి అయ్యేది కాదు. పైగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్‌ అవుతున్నందున వి.ఆర్‌.ఎస్‌ అవసరం కూడా అంతగా లేదు.
బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ లో 1.9.2018 నాటికి 1,74,312గా వున్న ఉద్యోగుల సంఖ్య రిటైర్మెంట్ల వలన 2023-24 నాటికి 92,963, 2024-25 నాటికి 79,381 మందికి తగ్గుతుంది. ఈ పరిస్థితిలో 1.1.2020 నాటికల్లా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ లో ఇప్పుడున్న 1,60,000 ఉద్యోగులలో సగాన్ని తగ్గించి కేవలం 80,000 మంది మాత్రమే మిగిలేలా చూడాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? అందుకు భారీ స్థాయిలో ప్రభుత్వం తన ఖజానా నుండి ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటి? వి.ఆర్‌.ఎస్‌ తీసుకోవాల్సిందిగా ఎవరినీ ఒత్తిడి చేయబోమని, అది స్వచ్ఛందంగా వుంటుందని మంత్రి ప్రకటించినప్పటికి ఆచరణ అందుకు భిన్నంగా వుంటోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో జీతాల చెల్లింపు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించిన ప్రభుత్వం ఎన్నికల తరువాత ఆలస్యమైనా పట్టించుకోవటం లేదు. ఆగస్టు జీతం సెప్టెంబరు 18న ఇచ్చారు. సెప్టెంబరు జీతం అక్టోబరు 23న ఇచ్చారు. అక్టోబరు జీతం ఎప్పుడిస్తారో తెలియదు. జీతాల చెల్లింపులో జాప్యం అనేది కూడా వి.ఆర్‌.ఎస్‌ తీసుకునేలా ఉద్యోగులను ఒత్తిడి చేసే ప్రక్రియలో ఒక భాగమే. ఇంతేగాక 50 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఇప్పుడు చేసే దానికన్నా రెట్టింపు పని చేయాలని, బదిలీలకు సిద్ధపడాలని, జీతాల చెల్లింపు సకాలంలో జరగదని వీటన్నింటికీ సిద్ధపడాలని లేకుంటే వి.ఆర్‌.ఎస్‌ తీసుకోవటం మంచిదని బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ సి.ఎం.డి బెదిరించారు. ఉద్యోగుల సంఖ్య ఎక్కువైనందున ఈ కంపెనీలకు నష్టాలొస్తున్నాయనే వాదన సమంజసం కాదు. ఇప్పటికన్నా లక్ష మంది ఎక్కువగా వున్నప్పటికి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ కు 2004-05 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్లు లాభం వచ్చింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలలో కేవలం 20,000 లేదా అంతకు తక్కువ మంది ఉద్యోగులే వున్నప్పటికీ, ఇటీవల వాటికి నష్టాలు వచ్చాయి. అసలు సమస్య ఆదాయం పెరగటం. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ ల ఆదాయం భారీగా తగ్గేలా చేసింది కేంద్రంలో వరుసగా అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాల ఆర్థిక విధానాలే. ప్రత్యేకించి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆ తరువాత వచ్చిన మోడీ ప్రభుత్వాలు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీలు, అనేక అక్రమ పద్ధతులలో రిలయన్స్‌ జియోకి ఇచ్చిన ప్రోత్సాహం వలన బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ల ఆదాయాలు విపరీతంగా తగ్గుముఖం పట్టాయి. అందుకే అవి ఆర్థిక దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. 2016 సెప్టెంబరులో సర్వీసులు ప్రారంభించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు మార్కెట్‌లో మొదటి స్థానం సాధించిందంటే దానికి అనుకూలంగా ఎన్ని అక్రమాలు జరిగాయో ఊహించుకోవచ్చు. ఇంతేగాక ఈ విధానాల వలన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అన్ని టెలికాం కంపెనీలు తీవ్ర రుణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక్కొక్కటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులతో వున్నాయి. గతంలో అనేక రాయితీలిచ్చినా ఇంకా రాయితీలిస్తేనే తాము గట్టెక్కుతామని అంటున్నాయి. ఈ లోగా సుప్రీం కోర్టు ఇటీవలే ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ప్రయివేటు టెలికాం కంపెనీలు తాము చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు తక్కువ చెల్లించేందుకు అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూని తప్పుడు లెక్కలతో తక్కువగా చూపించాయని, లెక్క ప్రకారం చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ.92,000 కోట్లు చెల్లించాలి. అయితే తాము చెల్లించే పరిస్థితిలో లేమని, చెల్లించాల్సి వస్తే 5జి స్పెక్ట్రమ్‌ను వేలంలో కొనటం సాధ్యం కాదని, దాని వలన టెలికాం రంగంలో దేశ అభివృద్ధి ఆగి పోతుందని టెలికాం కంపెనీలు వాదిస్తున్నాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రయివేటు కంపెనీలకు రాయితీలు, మళ్ళీ సంక్షోభం, మళ్ళీ రాయితీలు. ఇదీ టెలికాం రంగం లో ప్రభుత్వ విధానాలు. అన్ని రంగాలలో ఇవే విధానాలు అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బ తీసి ప్రయివేటు పరం చేయటం ఈ విధానాలలో ముఖ్యమైన అంశం. కాబట్టి తాము బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ లను ఉద్ధరిస్తామని, ప్రయివేటు పరం చేయబోమని కమ్యూనికేషన్ల మంత్రి చెప్పిన మాటలను నమ్మగలిగే పరిస్థితి లేదు.
ప్రస్తుతం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ ఉద్యోగుల, అధికారుల సంఘాల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయి. పైగా టెలికాం రంగం పరిస్థితి అంతగా బాగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రంగాన్ని అమ్మినా, కొనే వాడు లేనందున, దేశ రక్షణ అవసరాల కోసం ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేందుకు బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఉండాల్సిందేననే అభిప్రాయం బలంగా వుంది. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం ఈ మాట చెపుతున్నది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించటం, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌లను విలీనం చేయటం, ప్రభుత్వ ఖర్చుతో ఉద్యోగులను తగ్గించటం, స్పెక్ట్రమ్‌ కేటాయించటం ఇవన్నీ ఆ సంస్థలను ప్రభుత్వ ఖర్చుతో ముస్తాబు చేసి, ఆ తరువాత ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకే. 27.10.2019 ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రకారం బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ లను వ్యూహాత్మక భాగస్వామ్యం పద్ధతిలో డిజిన్వెస్ట్‌ చేసే అవకాశం వున్నది. కాబట్టి బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌ల ఉద్ధరణకే ప్రభుత్వం పని చేస్తున్నదనే భ్రమలో వుండాల్సిన అవసరం లేదు. మన దేశ కార్మికోద్యమం, ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని కొనసాగించాల్సి వుంది.