ఇప్పుడుకావాల్సింది మౌలిక సౌకర్యాలకై పెట్టుబడులను పెంచడం, విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెంచడం జరగాలి. ప్రజా ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమవడం వల్లనే కరోనా విజంభించగలిగింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థను కాపాడుకొన్న కేరళ ఈ రోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలచింది. కేరళ మోడల్‌ను దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఈ రోజు మునెన్నడూ లేనంతగా ఉన్నది.

కరోనా వైరస్‌ దేశంలో ఒక ఆరోగ్య సంక్షోభాన్నే కాక ఆర్థిక సంక్షోభాన్ని కూడా సష్టించింది. వ్యవసాయం, రవాణా, పర్యాటకం, ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ, సర్వీస్‌ రంగాలలో ఎన్నడూలేని విపరీత పరిస్థితులను చూస్తున్నాం. బారకలెస్‌ కంపనీ అంచనా ప్రకారం లాక్‌డౌన్‌ వల్ల సుమారు 235 బిలియన్‌ డాలర్లను మన దేశ ఆర్థిక వ్యవస్థ కోల్పోయింది. చికాగోకి చెందిన బూథ్స్‌ రస్తాండి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ అనే సంస్థ సీఏంఐఇ వెల్లడించిన సమాచారాన్ని విశ్లేషించి భారత దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాలను కోల్పోయాయని తెలియ చేసింది.

ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి పేదలను, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఏ మాత్రం ప్రజలకు ఉపయోగకరంగా లేదు. ఉద్దీపన పేరు మీద ఆర్థిక, పారిశ్రామిక, ఇతర ఆన్ని రంగాలలో సంస్కరణలను వేగవంతంగా అమలు చేసే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలను మరింత దూకుడుగా అమలు చేయాలనేది ప్రభుత్వ ముఖ్యమైన విధానంగా ఉన్నది. వీటితో పాటు కార్మిక చట్టాల సవరణ ఎన్‌డీఏ ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజండాగా ఉన్నది. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే వేతనాల కోడ్‌ బిల్లును ఆమోదింపచేసుకున్నది. పారిశ్రామిక సంబంధాల కోడ్‌ను ఆమోదింపచేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. రాజ్యసభలో బలం పెరగడంతో ఈ చట్టాలను సులభంగానే ఆమోదింప చేసుకోవచ్చని ప్రభుత్వ ఆలోచన.

ఇప్పుడున్న కార్మిక చట్టాలు పాతబడి పోయాయని, సంక్లిష్టంగా ఉన్నాయని, అర్థికాభివద్దికి అవరోధకంగా ఉన్నాయని ప్రభుత్వాలు చెపుతున్నాయి. కాబట్టి పాత చట్టాలకు సవరణలు తీసుకురావాలని, వాటిని నూతనంగా క్రోడీకరించి కొత్త చట్టాలు తీసుకురావాలసిన అవసరముందని నయా ఉదార విధాన ఆర్థికవేత్తలు వాదిస్తుంటారు. సులభతర వాణిజ్య ప్రక్రియ (ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కొరకై పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉండే విధానాల అమలు, అలాగే వారికి ఇన్సెపెక్టర్‌ రాజ్‌ నుంచి విముక్తి చాలా అవసరమని వీరు చెబుతుంటారు. దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు రావాలంటే కూడా కార్మిక చట్టాలలో మార్పులు అవసరమని చెప్తారు. ఈ చట్టాల మార్పుల పట్ల తీవ్ర వ్యతిరేకత రావటంతో కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపించిన ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్‌-19 సష్టించిన సంక్షోభాన్ని వాడుకొని కార్మిక సంస్కరణలను వేగ వంతంగా అమలు చేయాలని చూస్తున్నది. పని గంటలను పెంచడం, వేతనాలను అతి తక్కువ స్థాయిలో ఉంచడం, సాంఘిక భద్రత సౌకర్యాలను గణనీయంగా తగ్గించడం, కాంట్రాక్ట్‌ లేబర్‌ను ఎక్కువగా వినియోగించుకోవడం, కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేయడానికి ఉన్న నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంఘాలను పెట్టుకోవడానికి ఉన్న హక్కులను నిర్వీర్యపరచడం, కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించడానికి ఉన్న చట్టాలను బలహీనపరచడం లాంటి అనేక చర్యలను ఈ రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.

ఫాక్టరీ ఏక్ట్‌లోని సెక్షన్‌ 5ను ఉపయోగించుకొని గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు ఫాక్టరీ కార్మికుల పని గంటలను రోజుకు 12గంటలకు అలాగే వారానికి 72గంటలకు పెంచాయి. పంజాబ్‌ ప్రభుత్వం ఫాక్టరీ ఏక్ట్‌లోని సెక్షన్‌ 65 ద్వారా పని గంటలపై ఉన్న 8గంటల పరిమితిని ఎత్తివేసింది. ఒరిస్సా, మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలు కూడా పనిగంటలను పెంచాయి. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న అర్థిక వ్యవస్థను బాగు చేయడానికి ఈ చర్యలు చేపట్టాల్సి వస్తున్నదని చెబుతున్న ప్రభుత్వాలకు ఎక్కువ గంటలు పనిచేయడం ద్వారా కార్మికుల ఆరోగ్యాలు పాడైపోతాయన్న స్పహ మాత్రం లేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమైతే ఒక మెట్టు ముందుకు వెళ్ళి కొన్ని చట్టాలు మినహా మిగతా ఆన్ని కీలక చట్టాల అమలును మూడేండ్ల వరకు రద్దు చేసింది. పని గంటలను 12గంటలకు పెంచింది. కొత్తగా కార్మిక సంఘాలను వచ్చే మూడేండ్ల వరకు పెట్టుకోవడానికి వీల్లేదు. కార్మికులు తమకున్న సమస్యలను చెప్పుకోవడానికి, పిర్యాదులు చేయడానికి ఎలాంటి అవకాశాలు మూడేండ్ల వరకు ఉండవు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్ని పరిశ్రమలకు ఫాక్టరీ ఏక్ట్‌ నుంచి మినహాయింపు నిచ్చింది. కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు పారిశ్రామిక వివాదాల చట్టం నుంచి కూడా మినహాయింపు నిచ్చింది. కొత్త ఫాక్టరీలలో వెయ్యి రోజుల వరకు కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఉమ్మడి బేరసారాల హక్కుల గూర్చి మర్చిపోవాల్సి ఉంటుంది. 11రకాల పరిశ్రమలకు పారిశ్రామిక సంబంధాల ఏక్ట్‌ నుంచి మినహాయింపునిచ్చారు. దీనితో ఆ పరిశ్రమలలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రశ్నార్థకమై పోయింది. కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పర్చే పరిశ్రమలకు ఇదే రకమైన మినహాయింపులను ఇచ్చాయి. ఈ రకమైన మినహాయింపుల వల్ల కార్మికులు న్యాయమైన, నాణ్యత గల వేతనాలు, మంచి పని పరిస్థితులు, కార్మిక సంఘాలను ఏర్పర్చుకొనే హక్కులను, అలాగే ఉమ్మడి బేర సారాల హక్కులను కోల్పోయే ప్రమాదం వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో అలాగే కార్మికుల నిరసనలతో ఇందులో కొన్ని మార్పులను ప్రభుత్వాలు తాత్కాలికంగా విరమించు కున్నాయి.

ఈ చట్టాలలోని మార్పులు మూడేండ్ల వరకేననీ, కరోనా నేపథ్యంలో ఇలాంటి మార్పులు అవసరమనీ ఇది దేశ ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున కార్మికులు దేశ ప్రయోజనాలకై కొంత త్యాగం చేయాలని అంటున్నారు. కార్మికులకు ఆదాయాలు తగ్గించి, పని భారాన్ని పెంచి, వారి జీవనాలను అస్థిరం చేసి కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీలు, కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపులు, చట్టాల నుంచి మినహాయింపులు ఇచ్చి వారి లాభాలను పెంచి దేశ సేవలో వారిని భాగ్యస్వాములను చేస్తున్నారు. ప్రభుత్వాల ఈ విధానాలు శతాబ్ధాలుగా కార్మికులు పోరాడి సాదించుకున్న ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి. వారి మానవహాక్కు లకు, వారి అస్తిత్వాలకు భంగం కలిగిస్తున్నాయి. కార్మికహక్కులను కొల్లగొడుతున్న ప్రభుత్వాలు కరోనా ముగిసిన తర్వాత ఈ హక్కులను పునురుద్దరిస్తాయన్న నమ్మకం కానీ, గ్యారంటీ కానీ ఏమిలేదు. పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి కల్పన కొరకై అవలంబిస్తున్న ఈ విధానాలు పెట్టుబడులను ఆకర్శింపగలగుతాయన్న ఉపాధిని, ఉద్యోగాలను సష్టింపగలగుతాయన్న హామీ కూడా ఏమి లేదు. కార్మికులకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తుంగలో తొక్కుతూ, అలాగే అంతర్జాతీయంగా భారతదేశం భాగ్యస్వామిగా ఉన్న పౌర, రాజకీయ హక్కుల నియమాలను (కోవెనన్ట్స్‌), ఆర్థిక, సామాజిక, సాంస్కతిక హక్కులకు సంబందించిన కోవెనన్ట్స్‌, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) కన్వెన్షన్స్‌కి విరుద్దంగా ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నాయి.

పెట్టబడిదారి ఆర్థిక వ్యవస్థ అభివద్దికి, నూతన ఆర్థిక విదానాల అమలులో భాగంగా ఈ సంస్కరణలను ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. వామపక్ష ప్రభుత్వాలు మినహా, అన్ని రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఈ విధానాలను ఉత్సాహంగా అమలు చేస్తున్నాయని కార్మికవర్గం గమనంలో పెట్టుకోవాలి. పదికి పైగా కేంద్ర కార్మిక సంఘాలు ఐఎల్‌వోకి కార్మిక చట్టాల మార్పుల గురించి లేఖ రాసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఐఎల్‌వో డైరెక్టర్‌ జనరల్‌ కేంద్ర ప్రభుత్వానికి ఐఎల్‌వో కన్వెన్షన్స్‌కి విరుద్దంగా కార్మికల చట్టాలలో మార్పులు తీసుకురావద్దని కోరడం జరిగింది. అంతర్జాతీయ వేదికలలో సామజిక భద్రత, పేదల, కార్మికుల ప్రయోజల గురించి గొప్పగా మాట్లాడే మన ప్రభుత్వాలు ఐఎల్‌వో విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తాయని ఆశించలేము.

ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడానికే సంస్కరణలని అంటున్నారు. పడిపోతున్న వేతనాలు, వ్యవసాయ సంక్షోభం, పెరుగుతున్న అసమానతలు భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణం. ఉత్పత్తి అయిన వినియోగ వస్తువులకు డిమాండ్‌ లేకపోవడంతో కార్పొరేట్ల అమ్మకాలు తగ్గి వారి లాభాలు కుచించుకపోయాయి. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గించినా వినియోగ దారులకు ధరలు మాత్రం తగ్గలేదు. పెట్టుబడులను కూడా కార్పొరేట్లు పెంచలేదు. కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీల వల్ల ఆర్థిక వ్యవస్థకు సమకూరిన లాభం ఏమిలేదు. వేతనాలు తగ్గించడం, పనిదినాలు పెంచడం వల్ల ఆర్థిక సంక్షోభాలను నివారించలేం. ఉత్పత్తులకు వినియోగ వస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ పెరగాలి. డిమాండ్‌ పెరగాలంటే అత్యధిక ప్రజల చేతుల్లో పైసలు ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన ఈ సమయంలో ప్రజల దగ్గర డబ్బు లేదు. ప్రభుత్వ నౌకరీలో ఉన్న వారి జీతాల్లో కోత పెట్టడం తో వారు కూడా ఎప్పటిలాగా ఖర్చు పెట్టలేకపోతున్నారు.

కాబట్టి ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కరోనా సష్టించిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పేదలను, కార్మికులను అదుకోవాలి. గ్రామీణ ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఉపాధిని కల్పించాలి. వ్యవసాయ పనులకు కూడా ఉపాధి పథకాన్ని వర్తింప చేయాలి. కార్మికసంఘాలు కోరుతున్నట్టుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికలకు, పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు రానున్న ఆరు నెలల వరకు నెలకు రూ.7500 నగదును నేరుగా అందించాలి. అలాగే ఆరు నెలల వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలి. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధిని కలిగిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణసదుపాయమే కాక ఆర్థిక సహాయాన్ని, మరిన్ని రాయితీలను ఇవ్వాలి. ”ఆత్మ నిర్భర భారత్‌” అని ఒక వైపు చెపుతూ విదేశీ పెట్టుబడుల ఆకర్షణకై కార్మిక చట్టాల సవరణ అవసరమని చెపుతున్న ప్రభుత్వం నిజమైన ఆత్మ నిర్భర ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దేశీయ మార్కెట్లను విస్తరించుకోవడమే సరైన మార్గమని గమనించాలి.

పబ్లిక్‌రంగం దేశ ఆర్థిక స్వావలంబనను నిలబెట్టింది. కానీ పబ్లిక్‌రంగ సంస్థల ప్రయివేటీకరణ దేశ ఆత్మ నిర్భరతను ఎలా కాపాడుతుందో పాలకులకే తెలియాలి. పోర్ట్‌లు, గనులు, విమానయానం, రక్షణ, ఇతర అన్ని కీలక రంగాలలో ప్రయివేటు పెట్టుబడిని, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు స్వస్థతను ఇస్తున్న ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ దేశ ఆత్మను దుర్బలం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడుకావాల్సింది మౌలిక సౌకర్యాలకై పెట్టుబడులను పెంచడం, విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెంచడం జరగాలి. ప్రజా ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమవడం వల్లనే కరోనా విజంభించగలిగింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థను కాపాడుకొన్న కేరళ ఈ రోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలచింది. కేరళ మోడల్‌ను దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఈ రోజు మునెన్నడూ లేనంతగా ఉన్నది.

కే. వేణుగోపాల్‌

Courtesy Nava Telangana