సీతారాం ఏచూరి

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్నప్పటికీ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన దిశగా నడక బాగానే సాగుతున్నదని పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్టుగా కల్పిత కథనాలకు ఇస్తున్నప్పటికీ వాస్తవం అందుకు భిన్నంగా వుంది. ఇప్పుడున్న వృద్ధి రేటు ప్రకారం చూస్తే భారత్‌ వృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది.

దేశ వృద్ధి రేటు ప్రస్తుతం 5 శాతం లోపలే (4.9 శాతం) వుందని ఎన్‌సిఎఇఆర్‌ తెలిపింది. అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌’ అంచనాలను నివేదిస్తూ భారత్‌లో వృద్ధి సానుకూల దిశలో లేనేలేదని పిటిఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇతర ప్రధాన రేటింగ్‌ సంస్థలు కూడా మన దేశ వృద్ధి రేటును 5 శాతం లోపు గానే చెప్పాయి. ఐసిఆర్‌ఎ 4.7 శాతం గాను, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4.2 శాతంగాను పేర్కొన్నాయి. వృద్ధి రేటు క్షీణత ప్రజల సంక్షేమం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచుతోంది.

పారిశ్రామిక రంగం
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన 8 కీలక రంగాల వృద్ధి రేటు ఒక్క ఏడాదిలోనే 7.3 శాతం నుంచి (2018 జులై) 2.1 శాతానికి (2019 జులై) పడిపోయిందని వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రిత్వ శాఖ అంగీకరించింది. తయారీ రంగ వృద్ధి 6.9 శాతం (2018 జూన్‌) నుంచి 1.2 శాతానికి (2019 జూన్‌) క్షీణించింది. తత్ఫలితంగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు కూడా భారీగా పతనమైంది.
ఈ 19 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం వెనకబడిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 300 డీలర్‌షిప్పులు మూతబడ్డాయి. దాంతో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు పోయాయి. 2018 నుంచి వాహన కొనుగోళ్లు బాగా తగ్గిపోవడంతో వాహన రంగం 23.55 శాతం క్షీణించింది. గ్రామీణ డిమాండ్‌కు కొలబద్దగా వుండే ట్రాక్టర్‌ అమ్మకాలు ఏప్రిల్‌/జూన్‌లో 14.11 శాతం పడిపోయాయి.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో 35 లక్షల మంది కార్మికులు పని కోల్పోయారు. వ్యాపారులు దారుణంగా దెబ్బ తిన్నారు. పెద్ద నోట్ల రద్దు తాలూకు ప్రత్యక్ష ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 43 శాతం వీరే. లఘు పరిశ్రమలకు సంబంధించి 35 శాతం, సూక్ష్మ సంస్థలలో 32 శాతం, మధ్య తరహా సంస్థలలో 24 శాతం ఉద్యోగాలు పోయాయి. చిన్న, మధ్య తరహా సంస్థలు తీసుకునే రుణాలు 50-80 శాతం పడిపోయాయి. ఎంఎస్‌ఎంఇ లకు, స్వయం సహాయక బృందాలకు, గ్రామ స్థాయి సంస్థలకు ఆర్థికంగా సహాయం చేసేందుకే ముద్రా రుణ పథకమని మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. 2018-19 కాలంలో ఈ పథకం కింద 126 శాతం నిరర్థక ఆస్తులు పోగయ్యాయి. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఇఎస్‌ రంగం ఈ విధంగా చితికిపోయింది.

తగ్గిన డిమాండ్‌
భారతీయులలో అత్యధిక జనబాహుళ్యం కొనుగోలు శక్తి ఘోరంగా పడిపోవడమే ఆర్థిక మాంద్యానికి మూల కారణం. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు కారణంగా ఇటీవలి కొన్నేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగింది.
వ్యక్తిగత వినిమయ వ్యయం దేశ జిడిపి కి వెన్నెముక లాంటిది. దీనివల్ల జిడిపి లో 57 శాతం ఒనగూరుతుంది. అటువంటి వినిమయ వ్యయం (మార్చి 2019 త్రైమాసికం) 7.2 శాతం నుంచి 3.1 శాతానికి (జూన్‌ 2019 త్రైమాసికం) తగ్గింది. ఆర్థిక క్షీణతకు ఇదే ప్రధానమైన కారణం. ప్రధాన వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎంసిజి)తో సహా అన్ని రంగాలలోను అమ్మకాలు అత్యంత తక్కువగా వున్నాయి. గత సంవత్సర కాలంలో హిందూస్థాన్‌ లీవర్‌ అమ్మకాలు 12 నుంచి 5 శాతానికి, బ్రిటానియా అమ్మకాలు 13 నుంచి 6 శాతానికి, డాబర్‌ ఇండియా అమ్మకాలు 21 నుంచి 6 శాతానికి క్షీణించాయి. చారు బిస్కట్‌ దేశంలో ఆఖరికి రూ.5 బిస్కెట్‌ ప్యాకెట్లు కూడా అమ్ముడుపోని అధ్వాన్న స్థితి దాపురించింది.

తీవ్రమైన నిరుద్యోగం
గత అర్ధ శతాబ్దిలో ఎన్నడూ లేనరత ఎక్కువగా నిరుద్యోగ రేటు నమోదైంది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2018 సంవత్సరం లోనే 1.1 కోట్ల ఉద్యోగాలు పోయాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగానే 35 లక్షల ఉద్యోగాలు పోయాయని అంచనా (సిఎంఐఇ గణాంకాలు).
ప్రతి సంవత్సరం 50 లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగార్థులుగా శ్రామిక మార్కెట్లో చేరుతున్నారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల భాగస్వామ్యం 43 శాతం నుంచి (2004-2005) 36.9 శాతానికి (2017-2018) పడిపోయింది. ఈ కాలంలో మహిళా కార్మికుల వాటా 29.4 నుంచి 17.5 శాతానికి క్షీణించింది.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పనతో అచ్ఛేదిన్‌ (మంచి రోజులు) తీసుకొస్తానన్నది మోడీ వాగ్దానం. అయితే జరిగింది వేరు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులైన నిరుద్యోగ యువత 2004-05లో ఏడు కోట్లు వుంటే, 2017-18 నాటికి వారి సంఖ్య 11.56 కోట్లకు పెరిగింది. 2011-12 నుంచి 2015-16 నాటికి ఉద్యోగ కల్పన 106 లక్షల (589 లక్షల నుంచి 483 లక్షలకు) మేర పడిపోయింది.

పడిపోతున్న నిజవేతనాలు
పట్టణ కార్మికుల నిజ వేతనం (2012-18) రూ.226 నుంచి రూ.205కు పడిపోయింది. 8.9 శాతం క్షీణత ఇది. ఉపాధి హామీ పథకం పుణ్యాన గ్రామీణ దినసరి కార్మికుల వేతనం 2012కు ముందు 44.5 శాతం పెరిగింది. కాని మోడీ ప్రభుత్వం ఈ పథకానికి తిలోదకాలిచ్చిన కారణంగా 2012-18 కాలంలో ఇదే వేతనం కనాకష్టంగా 6 శాతం మాత్రమే పెరిగింది.

వృద్ధి లేని వ్యవసాయం
వ్యవసాయ రంగ దుస్థితి మరింతగా తీవ్రమౌతోంది. వ్యవసాయ వృద్ధి రేటు సగటు 3.37 శాతం నుంచి (2004-14) 2.7 శాతానికి (2014-19) పడిపోయింది. వాస్తవానికి గ్రామీణ వేతన పెరుగుదల రేటు (2017 జనవరి) 6.5 శాతం నుంచి 3.9 (2018 జనవరి)కి తగ్గింది. 2019లో అది మరింతగా క్షీణించింది.
12.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకంటూ మోడీ ‘పి.ఎం కిసాన్‌ పథకం’ ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఉపయోగించుకొని బిజెపి, మోడీ ఎన్నికలలో బాగానే ప్రయోజనం పొందారు. ఊహించినట్టే ఎన్నికల అనంతరం ఆ పథకాన్ని పక్కన పెట్టేశారు. 2019 జులై 15 నాటికి కేవలం 3.97 కోట్ల మంది (అర్హులలో 32 శాతం) మాత్రమే తొలి విడత కిస్తీని అందుకున్నారు. ఆ తరువాత రెండవ కిస్తీ కూడా కేవలం 3.5 కోట్ల మందికి మాత్రమే అందింది.

క్షీణించిన ప్రభుత్వ వసూళ్లు
ఈ ప్రభుత్వ హయాంలో పన్ను వసూళ్లు బాగా పడిపోయాయి. పరోక్ష పన్నుల ఆదాయం 21.33 (2016-17) శాతం నుంచి (2017-18) 5.8 శాతానికి మందగించింది. సేవారంగం నుంచి కూడా వేసిన అంచనా కంటే తక్కువగానే 10 శాతం మాత్రమే సమకూర్చి పెట్టింది. ప్రధానంగా ఐ.టి రంగం కుదించుకుపోవడం ఇందుకు కారణమైంది. ప్రభుత్వం 2019-20 నాటికి రూ.13.35 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. అయితే తొలి ఆరు మాసాలలో రూ.5.5 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే…తదుపరి ఆరు నెలల్లో రూ.7.8 లక్షల కోట్లు వసూలు చేయాల్సి వుంటుంది! ఇక జిఎస్‌టి వసూళ్లు 20 శాతం పడిపోయాయి.

బ్యాంకింగ్‌ సంక్షోభం
బ్యాంకుల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు-ఎన్‌పిఎ) 3.8 శాతం (2014) నుంచి 9.3 శాతానికి (2018) పెరిగాయి. నిరర్థక ఆస్తుల రద్దు 2014 ముందుతో పోలిస్తే 8 రెట్లు పెరిగింది. అయితే రద్దు చేసిన ఈ బాకీల ఎగవేతదార్ల, మోసగాళ్ల పేర్లను మాత్రం బయిట పెట్టలేదు. అటువంటి మోసగాళ్లను మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాపాడుతోందన్న మాట.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం
ఎన్‌పిఎ రద్దు ద్వారా అస్మదీయ కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదార్లకు లాభించేలా పెద్ద ఎత్తున ప్రయివేటీకరణ మొదలెట్టింది.

ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణ
రైల్వే, ఎయిర్‌ ఇండియా, ఎంటిఎన్‌ఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, బిపిసిఎల్‌ వంటి ప్రధాన ప్రభుత్వ సంస్థలతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించ పూనుకుంది. దీనివల్ల ఉద్యోగాల నుంచి తొలగించే రిట్రించిమెంట్‌ భారీగా సాగుతుంది. నిరుద్యోగం దారుణంగా పెరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఈ తతంగం భారత ఆర్థిక సార్వభౌమత్వానికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని బలహీన పరుస్తుంది. అది దేశానికి, దేశ ప్రజల సంక్షేమానికీ కూడా నష్టదాయకం.

ప్రజల సొమ్ము మళ్లింపు
పన్ను వసూళ్లలో తగ్గుదల ఒకవైపు వుండగా…మరో వైపు ఎన్‌పిఎల ద్వారా ఆర్థిక వ్యవస్థ లూటీ కారణంగా మున్నెన్నడూ లేని విధంగా బ్యాంకింగ్‌ రంగం సంక్షోభంలో పడిపోయింది. ఈ గండిని భర్తీ చేసుకోవడం కోసం రూ.1.76 లక్షల కోట్లను ఆర్‌బిఐ నుండి మిగులు నిధులను మోడీ ప్రభుత్వం లాగేసుకుంది. అంతేగాక ప్రభుత్వ రంగ బ్యాంకుల బెయిలవుట్ల కోసం, ప్రభుత్వ ఆదాయం కొరతను తీర్చుకోవడం కోసం ఎల్‌ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ప్రజల సొమ్మును, ప్రజల జీవిత కాల పొదుపు నిధులను దారి మళ్లించాలని ఒత్తిడి పెట్టింది. అప్పుల్లో మునిగిపోయిన ‘ఐడిబిఐ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు బెయిలవుట్‌ కోసం రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టమని ఎల్‌ఐసిని నిర్బంధించింది. లక్షలాది మంది ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌, పింఛను, ఇన్సూరెన్సు పథకాల నిధులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇపిఎఫ్‌ దగ్గర సుమారు రూ.10 లక్షల కోట్ల కార్పస్‌ నిధి వుంది. ప్రభుత్వం ఈ డబ్బును కూడా వాడుకోవడం మొదలెడితే దేశంలో కోట్లాది మంది ఉద్యోగుల భద్రతకు మునుపెన్నడూ లేనంత ముప్పు వాటిల్లుతుంది.

అంతర్జాతీయంగా భారత దేశ స్థానం
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ స్థానం స్వాతంత్య్రం వచ్చాక మున్నెన్నడూ లేనంత గొప్పగా వుందని మోడీ ప్రభుత్వం టముకు వేసుకొంది. అయితే వాస్తవ గణాంకాలు అందుకు విరుద్ధంగా వున్నాయి.
ఈ ప్రభుత్వం వచ్చాక అమెరికా డాలర్‌ ముందు భారత్‌ రూపాయి బక్కచిక్కిపోయింది. 2018-19లో డాలరు విలువ రూ.74 చేరుకుంది. 2004-2014 మధ్య ఎఫ్‌డిఐల సగటు వృద్ధి 31.1 శాతం నుంచి 11.1 శాతానికి పడిపోయింది. 2014-15 నుంచి 2018-19 నాటికి ఎఫ్‌డిఐల రాక 23 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది.
విదేశీ పెట్టుబడులకు ఎన్నెన్నో ప్రోత్సాహకాలను ఇచ్చినప్పటికీ ఇలా జరుగుతోందంటే ఒడుదుడుకుల మయంగా వున్న భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కొరవడడమే కారణమని అర్థమవుతోంది. పర్యవసానంగా ప్రపంచ స్థాయిలో భారత రేటింగ్‌, వేగంగా పడిపోతోంది. 2017 నవంబరులో అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు భారత రేటింగ్‌ను పెంచాయి. అయితే రెండేళ్లలో మూడీస్‌ సంస్థ భారత రేటింగ్‌ను మూడుసార్లు తగ్గించింది. 2014 ముందు ఎగుమతుల వృద్ధి రేటు 18.4 శాతం నుండి ప్రస్తుతం 0.89 శాతానికి పడిపోయింది. 2018-19 మధ్య కాలంలో రెడీమేడ్‌ వస్త్రాల ఎగుమతులు మైనస్‌ 9.18 శాతానికి, రసాయనాలు మైనస్‌ 8.17 శాతానికి, ఇంజనీరింగ్‌ సేవలు మైనస్‌ 2.65 శాతానికి తగ్గిపోయాయి.

పరిష్కార మార్గం
అత్యధిక ప్రజానీకం కొనుగోలు శక్తి ఘోరంగా పడిపోవడం వల్ల ఈ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కనుక ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. దేశీయ గిరాకీ పెరిగితే మూతపడిన పరిశ్రమలు కోలుకుంటాయి. పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలను కల్పించడం ద్వారా కార్పొరేట్లకు రెండు విడతల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని ఆశించింది. అయితే పెట్టుబడులు పెరిగినా, తద్వారా ఉత్పత్తి పెరిగినా, ప్రజల కొనుగోలుశక్తి పెరగనప్పుడు వాటి వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకోదు. ప్రభుత్వం పరిష్కారాలుగా చెప్పే వాటి వల్ల ఈ కొనుగోలు శక్తి మరింతగా కుంచించుకుపోవడమే జరుగుతుంది.
కనుక పెట్టుబడుల పేరిట వారికిచ్చే బదులుగా, ఆ రూ.2.15 లక్షల కోట్లను అత్యవసరమైన మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు, సామాజిక ఆర్థిక వృద్ధికి ఉపయోగించితే దారిద్య్రంలో వున్న యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలను కల్పించవచ్చు. వారు తమ ఆదాయాన్ని ఖర్చు చేయడం మొదలెడితే దేశీయ గిరాకీ పెరిగి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం ఒక్కసారిగా ఊపందుకునే వీలుంటుంది. కాని జరిగిందేమంటే ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం దరఖాస్తు చేసుకున్న 13 కోట్ల మందిలో 2 కోట్ల మందిని ప్రభుత్వం అత్యంత నిర్దయగా వెనక్కి పంపింది.
ఏమైనప్పటికీ మోడీ ప్రభుత్వం దేశ విదేశీ కార్పొరేట్ల లాభాలను గరిష్టంగా పెంచేందుకుగాను, రాయితీల ద్వారా అద్భుతమైన అవకాశాలను కల్పించే పనిలో వుంది. అత్యధిక శాతం ప్రజలను కష్టాల పాల్జేస్తున్నది.

పోరాటాలు తీవ్రతరం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మోడీ ప్రభుత్వాన్ని దారికి తెచ్చి…పైన చెప్పుకున్న సూచనలను చేపట్టేలా చూడాలంటే పోరాటాలను తీవ్రతరం చేయడం ఒక్కటే మార్గం. ప్రస్తుత ఆర్థిక విధానాలను వ్యతిరేకించే వారందరూ శక్తివంతమైన పోరాటాలు, ప్రచారాలు చేపట్టేందుకు 2020 జనవరి 8వ తేదీన సిఐటియు చేపట్టిన అఖిల భారత పారిశ్రామిక సమ్మె ఒక అవకాశంగా వుంటుంది. ఈ సమ్మెకు ముందు కూడా బలమైన ఉద్యమాలు, పోరాటాలు అవసరం. ప్రభుత్వం తన దిశను మార్చుకోవడం తప్ప గత్యంతరం లేని స్థితి లోకి నెట్టేంత శక్తివంతంగా ఆ పోరాటాలు, ఉద్యమాలు సాగించాల్సి వుంటుంది.