Image result for modi govt gdp graf down"సమర్థులైన ఆర్థిక వేత్తల సహాయం, సలహాలు లేకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం భారత ఆర్థికవ్యవస్థను నిర్వహిస్తోంది. ఒక ప్రొఫెసర్ లేకుండా డాక్టోరల్ కోర్సును బోధించడాన్ని, డాక్టర్ లేకుండా సంక్లిష్ట శస్త్ర చికిత్సను నిర్వహించడాన్ని ఊహించగలరా? అర్థశాస్త్ర పారంగతులైన ఆర్థికవేత్తలు లేకుండా అసమర్థులైన అధికారుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడమనేది అలాంటి వ్యవహారమే!
ప్రతి ఒక్కరూ ఒక ఆర్థికవేత్తే!- ఆదాయ వ్యయాలు సమంగా వుండేలా కుటుంబ బడ్జెట్‌ను అత్యంత నేర్పుతో రూపొందించే గృహిణి నుంచి పాడి పశవులను పోషించి పాలను సరఫరా చేసే డైయిరీ యజమాని దాకా; విడి భాగాలను తయారు చేసే ఒక చిన్న తరహా పరిశ్రమ నిర్వాహకుడు నుంచి గృహ సముదాయాలను నిర్మించి విక్రయించే నిర్మాణ రంగ బడా వ్యాపారి దాకా తమ తమ రీతుల్లో విశిష్ట ఆర్థిక వేత్తలే . వీరందరూ తమ తమ నిర్దిష్ట రంగాల కార్యకలాపాల ప్రత్యేక చట్టాలకు, కాంట్రాక్టుల, పన్నుల సాధారణ చట్టాలకు, వాణిజ్య సంప్రదాయాలకు, సహచర వ్యాపారులు/ ఖాతాదారులతో వ్యవహరించడంలో పాటించవలసిన రీతులు, రివాజులకు అవశ్యం కట్టుబడి వుండవల్సిందే. ఇవన్నీ తెలిసిన విషయాలే. వాస్తవంగా ప్రతి ఒక్కరికీ తేటతెల్లంగా తెలిసిన విషయాలే. బాగా సుపరిచితమైన విషయం డబ్బు. మన కథలోని ముఖ్య నాయకుడు ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన విషయాల ప్రాతిపదికనే సముచిత నిర్ణయాలు తీసుకుంటాడు.
అవశ్య నిర్ణయాలు తీసుకోవడంలో సదరు ముఖ్య నాయకుడు అర్హుడు కాదని నిర్థారితం కావచ్చు. ఇందుకు అవ్యక్త లేదా అజ్ఞాత, తెలిసిన, బాగా తెలిసిన విషయాలు రెండూ కారణమే. ఒక నిర్దిష్ట కాల పరిధిలో ఆ ముఖ్య నాయకుడు అజ్ఞాత విషయాలను బాగా ఆకళింపు చేసుకోవచ్చు. మన కథానాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై , రాష్ట్ర పాలనను సమర్థంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే అవకాశమున్నది. ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన విషయమైన డబ్బు వ్యవహారాలను అత్యంత దక్షతతో నిర్వహించడం ద్వారా మిగతా తెలిసిన, అజ్ఞాత అంశాలను కూడా ఒక క్రమపద్ధతిలో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. అయితే కథానాయకుడు తెలిసిన, అజ్ఞాత విషయాల పరిధి దాటినప్పుడు ఒక తీవ్ర సంకటంలో పడతాడు. ఆ కష్టాన్నే మార్కెట్ (విపణి) అంటారు. మరి ఆ మార్కెట్, ఒకరితో ఒకరికి సంబంధం లేని, భయం, ఆనిశ్చితి వాతావరణంలో, విభిన్న లక్ష్యాల ప్రేరణతో ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే కోట్లాది వ్యక్తుల సముదాయమయినప్పుడు ఆ మార్కెట్ ఒక తేలికపాటి కష్టం కాదు, అక్షరాలా ఒక మహా సంకటం.
మనుషుల మహా కట్టుదిట్టమైన ప్రణాళికలు మార్కెట్లో తరచు పూర్తిగా వక్రగతుల్లో పడతాయి, నిష్ఫలమవుతాయి. పరిమాణం, స్థాయి ముఖ్యం. ఒక సమతుల్య బడ్జెట్ పై ఒక పరీక్షను నిర్వహించడంలో అనేకానేక సమస్యలు, సవాళ్ళకు ఆస్కారం లేదు. అయితే ఒక ప్రభుత్వానికి ఒక బడ్జెట్‌ను రూపొందించడమనేది వేరే విషయం. చాలా కఠిన సవాళ్ళను ఎదుర్కోవలసివుంటుంది. ఒక దేశాన్ని పాలించడంలో ఎదురయినట్టుగా ఒక రాష్ట్రాన్ని పాలించడంలో అనేకానేక సవాళ్ళు ఉండబోవు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ కు పన్నెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వున్నారు. ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎమ్ ఏ పట్టా పొందారు. తామిరువురమూ సమర్థ ఆర్థికవేత్తలమని, భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థతతో నిర్వహించి, సర్వ సమగ్ర అభివృద్ధిని సాధించగల ఆర్థిక నిపుణలమని వారు భావిస్తున్నారు (సరే,వారలా ఎందుకు భావించకూడదు?). అయినా వారి ఆర్థిక విద్వత్తుకు అసూయపడేవారు ఎవరున్నారు?
సమస్యేమిటంటే మందగమనంలో పడిన, పతనం ఆసన్నమయిన భారత ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు. గత ఆరు త్రైమాసికాలలో (వీటికి అధికారిక గణాంకాలు లభ్యమవుతున్నాయి) భారతదేశపు స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) పెరుగుదల వరుసగా 8.0, 7.0, 6.6, 5.8, 5.5, 4.5 శాతంగా వున్నది. జీడీపీ వృద్ధిరేటు పడిపోతున్నదని ఈ సంఖ్యలు స్పష్టం చేయడం లేదూ? విశ్వసనీయ వర్గాల నుంచి మనం వింటున్న విషయాల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు ఇలా క్షీణించడంపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అమితంగా కలవరపడుతున్నారు. అయితే తమ వ్యాకులతను వారు ఎక్కడా ఏమాత్రం వ్యక్తంచేయడం లేదు-. కనీసం ఇప్పటి దాకా. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి మధ్య మంచి శ్రమ విభజన ఉన్నది సుమా. ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయాలు తీసుకుంటుంది; ఆ నిర్ణయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలుపరుస్తుంది. అన్నట్టు ఆ రెండు కార్యాలయాలలోని ఉన్నతాధికారుల మధ్య పరస్పర అనుమానాలు తక్కువేమీ కాదు. తరచూ ఒకరిపై మరొకరు నిందలు మోపుకోవడమూ పరిపాటిగా వున్నది.
మన కథలోని ముఖ్య వ్యక్తులు ఇరువురూ ఇప్పుడు ఉల్లిపాయ ధరలను అదుపు చేయడానికి మహా శ్రమ పడుతున్నారు. చాలా ప్రయాస పడుతున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.ఉల్లి లేని ఆహారం ఏమంత రుచిగా వుంటుంది? ప్రతి ఒక్కరికీ – నిరుపేద కార్మికులు, మధ్యతరగతి వారు, కుబేరులు- ఉల్లిపాయలు చాలా చాలా అవశ్యం. ఉల్లిపాయల విషయంలోనే ఏమిటి, ఈ క్రింది పేర్కొన్న వివిధ విషయాలను కూడా పరిశీలించండి. మన ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎంత ‘మోదం’గా వున్నదో మీకే అర్థమవుతుంది. వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలలో వివిధ రంగాలలో మన పురోగతి ఇలా వున్నది: వరుసగా సంవత్సరాలు- 2016–-17; 2017–-18; 2018-–19; 2019– 20 (కొంత భాగం). ఆయా సంవత్సరాలలో వివిధ రంగాలలో సిద్ధించిన వృద్ధి శాతం: వ్యవసాయం- 6.3, 5.0, 2.9, 2.1; పారిశ్రామిక ఉత్పత్తి సూచీ- 4.6, 4.4, 3.9, 2.4; కీలక రంగాలు- 4.8, 4.3, 4.4, 0.2; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పరపతి సదుపాయం- 0.9, -0.4, 2.3, 2.7; తయారీ రంగం- -1.2, 1.7, -1.4, 0.7; నిరుద్యోగం- 9.65, 4.03, 5.14, 7.05.
ఈ లెక్కలు చెప్పుతున్నదేమిటి? మన ఆర్థిక పురోగతి సజావుగా లేదనే కాదూ? సరే, కుటుంబాల స్థాయిలో వినియోగం ప్రభుత్వ సంస్థ ఎన్ ఎస్ ఎస్ సర్వే ప్రకారం తగ్గిపోయింది. గ్రామీణ వేతనాలు పడిపోయాయి ఉత్పత్తి దారులకు ముఖ్యంగా రైతులకు లభించే ధరలూ తగ్గిపోయాయి. దినసరి వేతనాలపై ఆధారపడినవారికి నెలకు 15 రోజులకు మించి పని లభించడం లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ పెరిగింది. మన్నికైన, మన్నిక కాని సరుకుల విక్రయాలు తగ్గిపోయాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం 1.92 శాతానికి పెరిగింది. అన్ని థర్మల్ విద్యుత్కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 49 శాతంగా మాత్రమే వున్నది.
ముంచుకొస్తున్న ముప్పును నివారించగలనని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే అందుకు సమర్థంగా వ్యవహరించగలదా? గతంలో తీసుకున్న సమర్థించలేని నిర్ణయాలను సమర్థించుకోవడం ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద తప్పు. అది ప్రభుత్వ బలహీనతకు ఒక తార్కాణం. ఇంతకూ ఆ సమర్థించలేని నిర్ణయాలు ఏమిటో మరి చెప్పనవసరం లేదు. అవి: పెద్ద నోట్ల రద్దు, లొసుగుల మయమైన వస్తు సేవల పన్నును హడావుడిగా అమలుపరచడం, పన్ను ఉగ్రవాదం, మితిమీరిన క్రమబద్ధీకరణ, సంరక్షణ వాదం, నిర్ణయాలను తీసుకునే అధికారాలను ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్రీకృతం చేయడం ఇత్యాదులు.
2016 నవంబర్ 6న డిమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) దుష్ప్రభావాలు, వినాశనకర పర్యవసానాలు ఇంకా సమసి పోలేదు. దేశ ప్రజలను అవి ఇంకా పలువిధాల వేధిస్తున్నాయి ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ ఈ పరిస్థితిని సమీక్షించి, నిష్పాక్షికంగా తర్కించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించడం లేదని ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు. సహేతుకమైన విమర్శలను ఎదుర్కోలేక మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. ఆర్థికాభివృద్ధి గురించి బడాయి మాటలు మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వుందని మోదీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ‘వ్యవస్థాగత’ సమస్యలను పరిష్కరించవలసిన అవసరాన్ని నిరాకరిస్తోంది. ఆ సమస్యలు ‘చక్రీయ’ సమస్యలని, ప్రతి ఆర్థిక వ్యవస్థకు అవి సహజమూ, అనివార్యమైనవని ప్రభుత్వం అంటోంది. ఇంకా నయం, ఆ సమస్యలకు కారణాలు ‘కాలిక’ (సీజనల్) మైనవిగా అధికార వర్గాలు గుర్తించలేదు! సమర్థులైన ఆర్థిక వేత్తల సహాయం, సలహాలు లేకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తోంది. సుప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ గతంలో మోదీ సర్కార్‌కు ఆర్థిక సలహాదారుగా ఉండేవారు.. ఒక ప్రొఫెసర్ లేకుండా ఒక డాక్టోరల్ కోర్సును బోధించడాన్ని, డాక్టర్ లేకుండా చికిత్స నిర్వహించడాన్ని ఊహించగలరా? ఆర్థికవేత్తలు లేకుండా అసమర్థులైన అధికారుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడమనేది అలాంటి వ్యవహారమే సుమా!
Image result for chidambaram"

 

 

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)