ఆర్‌. సుధాభాస్కర్‌

‘ఆ ప్రయాణం’ అక్కడికే చేరుస్తుందని 1991 నుంచి సీఐటీయూ నెత్తీ, నోరూ కొట్టుకుంటూనే ఉంది. నేడు దాదాపు చేరినట్టే కనిపిస్తోంది. దాని ప్రారంభ రూపమే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం. దేశాన్నిది మాంద్యం లోకి నెడ్తుందని కొందరు, ‘అబ్బే! అదేంలేదు, నాల్రోజుల్లో సర్దుకుంటుంద’ని సర్కారీ రాతగాళ్ళు వాదించుకుంటున్నారు. రైల్వే మంత్రి పియుష్‌ గోయల్‌’ ఇది వలయంలో వచ్చిన (సైక్లికల్‌) సంక్షోభమేనని చప్పరించేశారు.
మన దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పదికోట్ల మందికి ఉపాధి చూపే టెక్స్‌టైల్‌ రంగం మూడు లక్షల మందిని ఇళ్ళకు పంపింది. ఆటోమొబైల్‌ రంగంలో 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలు అవుతోంది. చివరికి రూ.5 పార్లే బిస్కట్లు కూడ గిరాకి లేక ఆ కార్మికులు రోడ్డున పడ్తున్నారు. పెద్ద హోటళ్ళు, లాడ్జీలు వంటి హాస్పిటాలిటి పరిశ్రమపైన తీవ్రంగా ఈ ప్రభావం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం చూపుతోంది. అమ్ముడుపోని ఫ్లాట్ల కోసం వినూత్న పద్ధతులు ఎంచుకున్న బిల్డర్లను ఇటీవల చెన్నైలో చూశాం. ఏ మధ్యతరగతి మార్కెట్లను చూపి 1991-92 నుండి మన్మోహన్‌ సింగ్‌, ఆ తర్వాత చిదంబరం తాజాగా నిర్మలా సీతారామన్‌ వరకూ పెట్టుబడిదార్లను ఊరించారో ఆ మధ్యతరగతి డిమాండు చల్లబడింది. ముఖ్యంగా వ్యవసాయం దివాళా అంచుకు చేరుకోవడంతో గ్రామీణ డిమాండు తగ్గింది. ప్రభుత్వ, ప్రయివేటురంగ పరిశ్రమల్లో శాశ్వత కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు 30:70 స్థాయికి చేరారు. దేశంలో చాలాచోట్ల ఈ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేవు. ఇక పారిశ్రామిక సరుకులకు గిరాకీ ఎక్కడ్నించి వస్తుంది?
అందుకే నేడు దేశంలో ఏర్పడిన / ఏర్పడనున్న సంక్షోభం వ్యవస్థీకృతమైంది. ఇటీవల మన్మోహన్‌సింగ్‌ చెప్పినట్టు నోట్లరద్దు ‘హడావుడి’ గా ప్రవేశపెట్టిన జీఎస్టీలు మాత్రమే కాదు. ఆ రెండే కారణమనుకునే వారు సరళీకృత ఆర్ధిక విధానాల లోతులను అర్ధం చేసుకోలేరు. పైన చెప్పినట్టు వ్యవస్థలో డిమాండు తగ్గిపోవడం వల్లే నేటి సంక్షోభం వచ్చినట్టు ఈ వాదన మనకు కన్పడనివ్వదు. ఇది అసలు సమస్యను దాచిపెడ్తుంది. సరళీకృత ఆర్ధిక విధానాల మద్దతుదారుల వాదన ఇది.
ఈ సరళీకృత ఆర్ధిక విధానం వల్లనే సమాజంలో అంతరాలు పెరిగాయి. ఒకవైపు సంపద గుట్టలు పడింది. దాని ఫలితమే తాజాగా ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ సంస్థ సర్వేలో బయటపడ్డ వివరాలు. వరసగా 8వ సం|| ముఖేష్‌ అంబానీ సంపద ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అంబానీ ఆస్తుల విలువ రూ.3,80,700కోట్లు. వెయ్యికోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వారు మన దేశంలో 2018 లో 831 మంది ఉంటే 2019కి ఆ సంఖ్య 953కి పెరిగింది. దీన్నే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు చెందిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక మరింత స్పష్టంగా పేర్కొంది. 2017లో మన దేశంలో సృష్టించబడ్డ సంపదలో 73శాతం కేవలం ఒక్క శాతం పరంకాగా, దేశంలోని సగం జనాభా (67కోట్లు) తమ సంపద ఒక్క శాతం పెంచుకున్నారు. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2000 సం||లో 9 కాగా 2017లో 101.
కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమల్లో కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పెరిగారు. కనీస వేతనాలు, సాంఘిక భద్రత వీరికి లేవు. 2000 సం|| తర్వాత వచ్చిన ప్రైవేటు పరిశ్రమల్లో దాదాపు మొత్తం కాంట్రాక్టు కార్మికులే. వీరికి కనీస వేతనాలు కూడా అందవు. 2018లో మోడీ ప్రభుత్వం వేసిన ‘నిపుణుల కమిటి’ దేశంలో కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.8892 – 11622 మధ్య ఉండవచ్చని (రోజుకు రూ. 342 – 447) ఉండవచ్చని 2018లో సిఫార్సు చేస్తే మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు రూ.178/- కనీసవేతనంగా నిర్ణయించారు. అంటే నెలకు రూ.4628/- వచ్చే కార్మికుడు ఏ సరుకులు కొనగలడు? తమ కుటుంబానెలా పోషించుకోగలడు? తమ పిల్లల చదువుల, కుటుంబ సభ్యుల వైద్యఖర్చుల కోసం దాదాపు అతితక్కువ వేతనాలు పొందే కార్మికులంతా రూ.70వేల నుంచి 2 లక్షల రూ||ల వరకు అప్పుల్లో వున్నారు. (ఆక్స్‌ఫామ్‌ నివేదిక వీటిని నెగెటివ్‌ ఆదాయాలుగా లెక్కిస్తుంది). ఇప్పటికే దేశంలో అమల్లో కొచ్చిన ఫిక్స్‌డ్‌టర్మ్‌ ఉద్యోగాలు, నీమ్‌ (నేషనల్‌ ఎంప్లాయబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్‌ స్కీం) వంటి ఉపాధి అనేక భారీ పరిశ్రమల్లోకి వచ్చింది. 2014లోనే మోడీ ప్రభుత్వం అప్రంటీస్‌ చట్ట సవరణతో అనేక ఆటోమొబైల్‌ పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమల్లో చివరికి కాంట్రాక్టు కార్మికుల్ని కూడా తొలగించి అతితక్కువ స్టైఫండ్‌ ఇచ్చి అప్రంటీస్‌లతో పని చేయించుకుంటున్నారు.
దేశంలోని శ్రామికుల్లో 44శాతం వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్నారు. గ్రామీణ శ్రామికుల వేతనాలు ఈ కాలంలో పెరగకపోవడమే కాదు. పైన పేర్కొన్నట్టు వారి వేతనాలు నెగెటివ్‌ పెరుగుదల్లో వున్నాయని ఇటీవల ఒక సర్వే పేర్కొంది (అంటే ఆదాయాల కంటే అప్పులు ఎక్కువ). పేద, మధ్య తరగతి రైతుల పరిస్థితి కూడా నానాటికీ ‘తీసికట్టు నాగంబొట్టు’ లాగా తయారైంది. 1990-91లో సాగయింది 40.87కోట్ల ఎకరాలైతే 2018-19లో 38.97 కోట్ల ఎకరాలు. ఇదే కాలంలో రోజుకు తలసరి ఆహార ధాన్యాల లభ్యతే 478 గ్రాముల నుంచి 407 గ్రాములకు తగ్గింది. ఇది ప్రజల కొనుగోలుశక్తి పడిపోతోంద నేందుకు చిహ్నం. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్క ప్రకారం దేశంలో 61,333 వ్యవసాయాధార పరిశ్రమలు 2012-16 మధ్య మూతపడ్డాయి. వీటిలో పని చేసే వేలాది కార్మికులు నిరుద్యోగులైతే వారి కొనుగోలు శక్తి పడిపోదా?!
ఉదాహరణకు ఏపీలో 105 జ్యూట్‌మిల్స్‌ మూతపడి 38,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తెలంగాణాలోని మొత్తం 4500 రైల్‌మిల్స్‌లో 500 మిల్సే ఆడుతున్నాయి. 2500 అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా వాటికి రెండు మూడు నెలలే ఫీడింగ్‌ ఉంటోంది. కార్పొరేట్‌ పరిశ్రమల వల్ల జిన్నింగ్‌, ఆయిల్‌ మిల్స్‌లో 80శాతం మూతపడ్డాయి. ప్రభుత్వాలు అవలంబించే విధానాల వల్ల ఆహారధాన్యాల దిగుమతి పెరిగింది. పామాయిల్‌ 1.30 లక్షల టన్నులు, పప్పుధాన్యాలు 50 లక్షల టన్నులు, పంచదార 40లక్షల టన్నులు, పత్తి 25 లక్షల బేళ్ళు (ఒక బేలు 165 కిలోలు) దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా పంటల విస్తీర్ణం దేశంలో తగ్గింది. ఆ మేరకు దిగుబడి తగ్గుతోంది. రైతాంగం దివాళా ఎత్తి పట్టణాలకు వలసలు పెరిగాయి. ఆ విధంగా కోట్లాది ప్రజల ఆదాయాలు అడుగంటి పోయాయి.
చివరికి ఇలా మిగిలాం !
ప్రపంచమంతా చిన్న కుగ్రామమైపోతోందని, మనం మడికట్టుకుని కూచుంటే ఎలా? అని 1991 లో డా|| మన్మోహన్‌ సింగ్‌ ఐఎంఎఫ్‌ వేదాంతాన్ని చెప్తే మధ్యతరగతి, ఆ పై జనం తలలూపింది నిజమే కదా! సోవియట్‌ విచ్ఛిన్నం, సోషలిస్టు శిబిరం దెబ్బతిన్న తర్వాత ప్రభుత్వ రంగం ‘తెల్ల ఏనుగ’న్న నాణెం బాగా చెల్లుబాటైంది. అనేకమంది సిన్సియర్‌ కార్మికులు ‘అవును కదా మనం పని చేయకపోవడం వల్లే మన సంస్థ నష్టపోతోంద’ని అనుకోవడం లేదా? తమ సంస్థకు అసలు ఆర్డర్లే లేవని, దానికి సుమారు 7వ పంచవర్ష ప్రణాళికా కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానమే కారణమని వారికి ఎవరు చెప్పాలి? అంటే సమస్య రాజీవ్‌గాంధీ పాలనలో (1985-90) ప్రారంభమైంది. దీని పరాకాష్ట నేడు మోడీ పాలనలో చూస్తున్నాం.
ఇప్పటివరకు ప్రతి బడ్జెట్‌లోనూ ప్రభుత్వరంగ వాటాల విక్రయం టార్గెట్లుండేవి. సెప్టెంబర్‌ 28 ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక వేడి వేడి వార్త మోసుకొచ్చింది. గత పద్ధతులకు మంగళం పాడుతూ మోడీ సర్కార్‌ రూ.1.45 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్నులు తాజాగా తగ్గించారు. కాబట్టి (ఈ తాయిలాల్నే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘7 నెలల్లో మూడవ బడ్జెట్‌’ అని బ్యానర్‌ హెడ్‌ లైన్‌ పెట్టింది) పైగా జీఎస్టీ వసూళ్ళు నెలకు 85-90 వేల కోట్ల రూపాయలు దాటట్లేదు. ఇప్పటికే 2019-20 బడ్జెట్‌లో ప్రకటించిన రూ.105 లక్షల కోట్ల ప్రభుత్వరంగ వాటాల అమ్మకాన్ని ఇంకా పెంచాలని నిర్ణయించారట. కొన్నింటిని వ్యూహాత్మక అమ్మకాల పేర తెగనమ్మాలని నిర్ణయించారట! కీలకం కానీ ఆస్తుల్ని (నాన్‌కోర్‌ అసెట్స్‌ని) అమ్మేస్తారట! ఇవేంటో తెల్సా? (సెల్‌ఫోన్‌) టవర్లు, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ టవర్లు, రిఫెనరీల పైప్‌లైన్‌ లట! ఇవన్నీ నాన్‌కోరా? ఇవి లేకపోతే బీఎస్‌ఎన్‌ఎల్‌, పీజీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ మనగలవా? వీటన్నింటిని తెగ నమ్మడానికి రైట్స్‌, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌, ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌, డెల్లాయిట్‌, కెపిఎంజి వంటి 11 సంస్థల్ని సిద్ధం చేశారు. కార్పొరేట్లకిచ్చిన సుమారు లక్షన్నర కోట్ల రూపాయల రాయితీలు కోసం ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతున్నారని స్పష్టం కావడం లేదా?!
దాదాపు 2008-09 బడ్జెట్‌ మొదలు ప్రతి బడ్జెట్‌లోను సుమారు రూ.60/70 వేల కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా వసూలు చేయాల్సిన పన్నులను వదులుకోవడం (టాక్స్‌ఫోర్‌గాన్‌) అని బడ్జెట్లోనే చూపెడుతున్నారు. ఇవిగాక వసూలు కావాల్సిన ప్రత్యక్ష పరోక్ష పన్నులు లక్షల కోట్లలో వున్నాయి. దీనికితోడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కార్పొరేట్‌ బకాయిలు సుమారు రూ.8లక్షల కోట్లున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమై బీజేపీ హయాంలో నిర్విఘ్నంగా సాగుతున్న ఈ ప్రక్రియ పేరు ‘త్రిబుల్‌ దోపిడి’.
సరళీకృత ఆర్థిక విధానమే అసలు శత్రువు
1991, 92ల్లో ఐఎంఎఫ్‌ ప్రాయోజిత ఈ ఆర్ధిక విధానం దేశంలోని ప్రభుత్వరంగానికి వ్యతిరేకం. ఆ విధంగా దేశ సమగ్రతకు వ్యతిరేకం అని 1991 నవంబర్‌ 29న జరిగిన మొట్టమొదటి దేశవ్యాపిత సమ్మె సందర్భంగానే సీఐటీయూ చెప్పింది. తర్వాత ప్రారంభమైన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ, విశాఖలో హిందుస్థాన్‌ జింక్‌ ప్రయివేటీకరణ, ఛత్తీస్‌గడ్‌లో బాల్కో ప్రయివేటీకరణ, విదేశీ సంచార్‌ నిగమ్‌ లి. ప్రయివేటీకరణ మొ||నవి అంశంపై అన్ని కార్మిక సంఘాలు ఒక్కటయ్యేందుకు దోహదపడ్డాయి. సరళీకృత ఆర్ధిక విధానం దేశీయ పరిశ్రమలను దెబ్బతీస్తుందని, ఆ రకంగా ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తుందని సీఐటీయూ చెప్పిన విషయం 2009 లో అన్ని కార్మిక సంఘాలు ఆమోదించి 2010 సెప్టెంబర్‌ 7 సమ్మెలో అదో ప్రధాన డిమాండ్‌ అయ్యింది. 2014లో సం||నికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ వాగ్దానం గాలికి పోయింది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం గత 50 ఏండ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం ద్వారా గ్రామీణ పేదలకు ఉండే ఆ కాస్త ఆసరా మోడీ సర్కార్‌ తొలగించింది. 2019 జులై 1వ తేదీ నాటికి దేశంలో 6.8 లక్షల కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ అంగీకరించారు. దేశ వ్యాపిత సమ్మెల్లో ‘ఉపాధి’ రక్షణ ఒక కీలక అంశమైంది.
ఉదారవాద ఆర్ధిక విధానం కేవలం ‘పెట్టుబడి’ని మాత్రమే రక్షిస్తూ దేశంలో మిగిలిన 90శాతం ప్రజానీకాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే ఆ విధానాలను నిలవరించాలి. ఓడించాలి. గత ఆరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలని, ముఖ్యంగా కష్టజీవుల్ని అసలు సమస్యల వైపు మళ్ళకుండా ముందు గోరక్ష అన్నారు. ఇప్పుడు నేరుగా ‘జైశ్రీరాం’ నినాదం ఇవ్వని వారిని చావగొట్టే స్థితి వచ్చింది. ఈ ఆర్ధిక విధానాలపై పోరాడకుండా సామాజిక సమస్యల్లో బీజేపీని నిలువరించలేము. అందుకు సన్నద్ధమవుదాం.