– ఎ. కోటిరెడ్డి

ఈ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్థికాభివృద్ధి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ విధానాలు ఎటువంటి వినాశకర ఫలితాలకు దారితీస్తున్నాయో ఈ లెక్కలు విదితం చేస్తున్నాయి. కార్మికులు, రైతులు, వ్యవసాయ, వలస కార్మికులు, చిన్న ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారి స్థితిగతులను పట్టించుకోకపోవటం వలన వారు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

హోల్‌సేల్‌ ధరల తగ్గుదల
నిత్యావసరాల ధరల పెరుగుదల

హోల్‌సేల్‌ ధరలను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక్క తయారీ సరుకుల ధరలు మినహా మిగతా అన్ని సరుకుల ధరలు పడిపోయాయి. కాని మరోవైపున వినియోగదారీ ధరల సూచీని చూస్తే అన్ని సరుకుల ధరలు పెరిగి ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో స్పష్టమౌతుంది. వినియోగదారుల ధరల సూచి గత సంవత్సరం ఆగస్టులో 3.3 శాతం పెరగగా, ఈ సంవత్సరం అదే నెలలో 6.69 శాతం పెరిగింది. గత సంవత్సరం కన్నా 3.39 శాతం అదనంగా పెరిగింది. ఆహార సరుకుల ధరలు సంవత్సరం క్రితం 3.0 శాతం పెరగగా, ఆగస్టులో 9.1 శాతం పెరిగాయి. 6.1 శాతం అదనంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంత వినియోగదారుల ధరల సూచి సంవత్సరం క్రితం 2.2 శాతం ఉండగా, ఇపుడు 6.7 శాతానికి, 4.5 శాతం అదనంగా పెరిగింది. పట్టణ వినియోగదారుల ద్రవ్యోల్బణం 4.5 నుండి 6.8 శాతానికి, 2.3 శాతం అదనంగా పెరిగింది. హోల్‌సేల్‌ ధరల సూచీలో గత సంవత్సరం ఆగస్టు కన్నా ఈ సంవత్సరం ఆగస్టులో అన్ని సరుకుల ధరలు తగ్గగా, వినియోగదారుల ధరల సూచీలో అన్ని సరుకుల ధరలు పెరిగాయి. కోవిడ్‌-19 మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్నందున కనీస మాత్రంగా కూడా పనులు దొరకక అన్ని వర్గాల శ్రామిక ప్రజలు అలమటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ధరల పెరుగుదల రేటు రెండు నుండి మూడు రెట్లకు పైగా ఉండటంతో ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా ఆహారధాన్యాల ధరల పెరుగుదల మూడు రెట్లకు పైగా ఉండటం, గ్రామీణ ప్రాంత వినియోగదారుల ధరల సూచీ కూడా మూడు రెట్లకు పైగా పెరగటం వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. కాని విచిత్రంగా వ్యవసాయ కార్మికుల ధరల సూచి 6.3 శాతం తగ్గిందని లేబర్‌ బ్యూరో నివేదిక ఇచ్చింది. ఆహారధాన్యాల ధరలు, గ్రామీణ వినియోగదారుల ధరల సూచీ మూడు రెట్లకు పైగా పెరిగితే వ్యవసాయ కార్మికుల ధరల సూచి 6.3 శాతం ఎలా తగ్గుతుంది? గ్రామీణ వినియోగదారుల్లో వ్యవసాయ కార్మికులు 50 వరకు ఉంటారు. అటువంటపుడు గ్రామీణ వినియోగదారుల ధరల సూచి, ఆహారధరల సూచీలు పెరిగిపోతుంటే వ్యవసాయ కార్మికుల ధరల సూచి తగ్గటం ఏ విధంగా సాధ్యమౌతుంది? అందువవలన ఆహారధాన్యాల ధరలు, గ్రామీణ వినియోగదారుల ధరల సూచీ పెరుగుదల నేపథ్యంలో లేబర్‌బ్యూరో విడుదల చేసిన లెక్కలకు విశ్వసనీయత లేదని భావించాల్సి వస్తున్నది.

పారిశ్రామికోత్పత్తుల తగ్గుదల
పారిశ్రామిక సూచి లోని ఎనిమిది ప్రధాన రంగాలు గత సంవత్సరం జులైలో 2.6 శాతం వృద్ధిని సాధించగా, ఈ సంవత్సరం జులైలో 9.6 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. రిఫైనరి ఉత్పత్తులు సంవత్సరం క్రితం 0.9 శాతం తగ్గుదలను నమోదు చేయగా, ఈ జులైలో 13.9 శాతం, బొగ్గు ఉత్పత్తి 1.6 శాతం తగ్గగా, ఇపుడు 5.7 శాతం, ముడిచమురు 4.4 శాతం తగ్గగా ఇపుడు 4.9 శాతం, సహజవాయువు ఉత్పత్తి 0.5 శాతం పడిపోగా ఇపుడు 10.2 శాతం పడిపోయాయి. గత సంవత్సరం ఉక్కు ఉత్పత్తి 8.1 శాతం, సిమెంటు ఉత్పత్తిలో 7.7 శాతం పెరుగుదల ఉండగా, ఈ సంవత్సరం వరుసగా 16.4, 13.5 శాతం చొప్పున తగ్గాయి. గత సంవత్సరం విద్యుత్‌ ఉత్పత్తి 5.2 శాతం పెరగగా ఈ సంవత్సరం మైనస్‌ 2.3 శాతానికి పడిపోయింది. ఎరువుల ఉత్పత్తి మాత్రం గత సంవత్సరం జులైలో 1.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, ఈ సంవత్సరం 6.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఒక్క ఎరువుల ఉత్పత్తి మినహా మిగతా ఏ రంగం కూడా కోలుకొనే పరిస్థితి లేదని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి.

విదేశీ వాణిజ్యం
ఆగస్టు నెలలో కూడా విదేశీ వాణిజ్యం తగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 12.7 శాతం తగ్గి 22.7 బిలియన్‌ డాలర్లు వుండగా, దిగుమతులు 26.0 తగ్గి, 29.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2020 ఏప్రిల్‌-ఆగస్టు నెలలకు ఎగుమతులు 26.6 శాతం తగ్గి 97.7 బిలియన్‌ డాలర్లుగా, దిగుమతులు 43.7 శాతం తగ్గి 118.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి చమురు దిగుమతులు 41.6 శాతం తగ్గగా, ఇతర ముఖ్యమైన దిగుమతులు 20.1 శాతం తగ్గాయి. కీలక రంగాలలో తగ్గిన ఉత్పత్తి, విదేశీ వాణిజ్యంలో తగ్గుదల ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఎరువులు మినహా మిగతా రంగాలన్నింటిలో ఉత్పత్తి తగ్గుదల పారిశ్రామికోత్పత్తి పుంజుకోకపోవటాన్ని తెలుపుతున్నది. మే నెల చివరి నుండి ప్రభుత్వం ఆంక్షలను సడలింలించటం ప్రారంభించింది. ఆగస్టు చివరికొచ్చేసరికి అనేకరంగాలలో కార్యకలాపాలను పునరుద్ధరించటానికి అవకాశం కల్పించింది. అయినా ఉత్పత్తిలో తీవ్రమైన తగ్గుదల ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నది. దానితో పాటు ఎగుమతుల తగ్గుదల అంతర్జాతీయంగా ఆర్థికమాంద్యం, కోవిడ్‌-19 మహమ్మారి ఫలితంగా ఏర్పడిన ప్రతికూల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. విదేశాలలో కూడా కోవిడ్‌-19 మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రమై ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతున్న పరిస్థితులలో మన ఎగుమతులు పెరగటం కష్టమౌతుంది. వాణిజ్య లోటు తగ్గినా చెల్లింపులు చేయటం కూడా గతంలో లాగా తేలికగా ఉండదు. గతంలో విదేశాలలో పని చేస్తున్న భారతీయులు పంపే డబ్బు కూడా వాణిజ్య లోటును భర్తీ చేయటంలో ఒక ముఖ్యమైన వనరుగా ఉండేది. ఇపుడు కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఎక్కువ మంది స్వదేశానికి తిరిగివచ్చిన పరిస్థితులలో ఆ విధంగా వచ్చే నిధులు కూడా తగ్గిపోతాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, మార్కెట్లలో సంభవిస్తున్న ఒడిదుడుకుల కారణంగా విదేశీ పెట్టుబడుల రాకకు కూడా పరిమితులు ఏర్పడతాయి. ప్రభుత్వం వద్ద ఎక్కువ మొత్తంలో విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బందులు ఏర్పడకపోయినా రానున్న కాలంలో విదేశీ మారకం సమస్య ముందుకు వస్తుంది.

పారిశ్రామికోత్పత్తిలో 8.2 శాతం వెయిటేజి ఉన్న క్యాపిటల్‌ గూడ్స్‌ (భారీ యంత్ర పరికరాలు) ఉత్పత్తి 13.8 శాతం, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలకు 12.3 శాతం వెయిటేజి ఉండగా, 3.7 శాతం, వినియోగదారీ ఉత్పత్తులకు 12.8 శాతం వెయిటేజి ఉండగా, 8.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తిలో తగ్గుదల అంటే నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో తగ్గుదల ఉన్నదని స్పష్టం అవుతున్నది. కొత్త పరిశ్రమలు ఏర్పడకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఎలా సాధ్యపడుతుంది?

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నానాటికీ ముదురుతోంది. కోవిడ్‌-19 దీనికి తోడైంది. దాంతో అమెరికాతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఆర్థిక పతనం వైపు జారిపోతున్నాయి. అయితే దాదాపు 24 శాతం తరుగుదలతో మన దేశం తక్కిన దేశాలన్నిటికన్నా వేగంగా దిగజారుతోంది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అంతా బ్రహ్మాండంగా వుందని పిట్టలదొర కబుర్లు చెప్తోంది. మరోవైపు రైతుల మీద, కార్మికుల మీద, దోపిడీని వేగవంతం చేస్తోంది. ఇంకోవైపు తన హిందూత్వ ఎజండాను కూడా ముందుకు తెస్తోంది. ఈ విధానాలను తిప్పికొట్టే విస్త్రుత ప్రజా పోరాటాల ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు గుర్తుచేస్తున్నాయి.

Courtesy Prajashakti