అతివల భాగస్వామ్యం అధికం 
89 శాతంతో కేరళ టాప్‌ 
బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో 35శాతమే..!

ఒక్కరి సంపాదనతో పూట గడవటం గగనమవుతున్న రోజులివి. పెరుగుతున్న ధరలు.. ఇంటిఅద్దెలు వెరసి సామాన్యజనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు తోడుగా భార్య కూడా పనికివెళ్లకపోతే పస్తులుండాల్సి వస్తున్నది. ఇది పేదబతుకుల దైన్యస్థితి. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పథకాలను ప్రవేశపెట్టడంతోనే సరిపెట్టకుండా.. ఉపాధి కల్పించటంలో కేరళ రాష్ట్రం ముందంజలో నిలుస్తున్నది. మహిళాశక్తి ఉత్సాహంగా కదం తొక్కుతూ.. తమ జీవనవిధానంలో మార్పు తెచ్చుకుంటున్నది. న్యూఢిల్లీ : దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పాధిని కల్పించే ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌)’ లో మహిళల భాగస్వామ్యం ఏటికేడు గణనీయంగా పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఉపాధి హామీ కింద ఎక్కువగా పనిని పొందుతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో 57.2శాతం మంది మహిళా లబ్దిదారులు ఉపాధి హామీలో భాగస్వామ్యమయ్యారు. ఈ విషయంలో కేరళ అగ్ర స్థానంలో ఉన్నది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ, కాంగ్రెస్‌ పాలిత మధ్యప్రదేశ్‌లు మాత్రం వెనుకబడి ఉన్నాయి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. దేశంలో 2019-20 ఏడాదికి సంబంధించి ఉపాధి హామీలో మహిళా భాగస్వామ్యం సగటున 57.2శాతంగా ఉన్నది. 2011-12 లో ఇది 48శాతంగా ఉండటం గమనించాల్సిన అంశం. ఉపాధి హామీలో 89శాతం మహిళా భాగస్వామ్యంతో కేరళ అగ్రస్థానంలో ఉన్నది. ఇక 86శాతంతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. అత్యధిక జనాభా కలిగిన, బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ కేవలం 35శాతంతో వెనకబడిపోయింది. ఇక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌(40శాతం) పేలవప్రదర్శన చూపగా.. రాజస్థాన్‌(68శాతం) పర్వాలేదనిపించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 60శాతం మహిళా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నది. అయితే ఉపాధి హామీ చట్టం ప్రకారం ఉపాధి పనుల్లో సగం వరకు మహిళలకు అవకాశం కల్పించాలనే నిబంధనను యూపీ, మధ్యప్రదేశ్‌లో పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి.
మోడీ సొంతరాష్ట్రంలోనూ వెనుకంజ.. 

2019-20 ఏడాదికి సంబంధించి.. రాజస్థాన్‌లో 71.50 లక్షల మంది ఉపాధిని పొందారు. ఆంధ్రప్రదేశ్‌(71.40 లక్షలు), తమిళనాడు(55.40 లక్షలు), కేరళ(12.80)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో మాత్రం 10.05 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించడం గమనార్హం. అయితే కేంద్రంలో బీజేపీ పాలనలో ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ.. 5.42 కోట్ల మంది మాత్రమే ఉపాధికి నోచుకున్నారు. ఉపాధి హామీ కింద 2018-19 ఏడాదికి సంబంధించి 90.4శాతం, 2017-18లో 90.7శాతం మహిళా భాగస్వామ్యంతో కేరళ ముందున్నది. ఆ తర్వాత 85.4శాతం, 85.7శాతంతో తమిళనాడు తర్వాతి స్థానంలో ఉన్నది.

ప్రధానంగా కేరళలోని పురుషులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పశ్చిమాసియా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని ఇతర ప్రాంతాల వైపు వెళ్తున్నారు. ఇది పరోక్షంగా ఉపాధి హామీలో మహిళా శ్రామికశక్తి పెరగడానికి దోహదం చేస్తోందని సంబంధిత మంత్రిత్వశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా తమిళనాడులో పురుషులు పరిశ్రమల్లో పనిచేయడంపై దృష్టిని సారించడంతో అక్కడి మహిళలకు అవకాశాలు మరింత మెరుగవతున్నాయని భావిస్తున్నారు. మిగతా ఉద్యోగాల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలు తక్కువ జీతంతో వివక్షను ఎదుర్కొంటారనీ, ఉపాధి హామీలో అలాంటి తారతమ్యాలు వారికి ఉండవని ఆర్థికవేత్త నళిని గులాటి అభిప్రాయం వ్యక్తం చేశారు.

(Courtacy Nava Telangana)