మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ
ఐజ్వాల్‌ : కేంద్రం తీసుకురావాలనుకుంటున్న పౌరసత్వ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ కేంద్రం హోంమంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే మిజోరాంలో అక్రమ వలసదారులకు గేట్లు ఎత్తినట్లుగా ఉంటుందని తెలిపారు. హోమ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మిజోరాం పర్యటనకు వచ్చిన అమిత్‌షాను ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం కలిసి, పలు అంశాలపై సిఎం చర్చించారు. అంతకుముందు రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు పౌరసత్వ సవరణ బిల్లును విరమించుకోవాలని వారు కోరారు. ఒకవేళ ఈ బిల్లును ఆమోదిస్తే మిజోరాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలను ఆ బిల్లు పరిధి నుంచి తొలగించాలని స్వచ్ఛంద సంస్థల సమన్వయ కమిటీ పేర్కొంది. ఈ బిల్లుపై అమిత్‌షా ఈనెల 1వ తేదీన మాట్లాడుతూ ‘బిల్లు పార్లమెంట్‌లో అమోదం పొందితే ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బుద్ధ, జైన్‌, పార్సీ, క్రిస్టియన్‌ మతాలను చెందిన వారు దేశంలో ఏడు సంవత్సరాల పాటు నివసిస్తే వారికి పౌరసత్వం లభిస్తుంది. ఇందుకు ఎటువంటి పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. అయితే ఈ ప్రతిపాదిత బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది.

Courtesy Prajashakthi…