Mithali Raj becomes First Woman to Complete 20 Years In International Cricket - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దశాబ్దాల కెరీర్‌ను పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్‌

ఇరవై ఏళ్ల కాలం అంటే ఒక తరం మారిపోతుంది… తరాల మధ్య ఆలోచనలో, ఆచరణలో అంతరం కూడా చాలా ఉంటుంది… కానీ మిథాలీ రాజ్‌ నిరంతర ప్రవాహంగా కొనసాగిపోతూనే ఉంది. రెండు దశాబ్దాలుగా తన ఆటతో అలరిస్తూనే ఉంది. ఇన్నేళ్లలో మహిళల క్రికెట్‌ రూపు మార్చుకుంది, ఫార్మాట్‌లు మారాయి, ఆటగాళ్లూ మారారు… కానీ మారనిది మిథాలీ ఆట మాత్రమే! సగంకంటే ఎక్కువ జీవితం ఆమె క్రికెట్‌ మైదానాల్లోనే గడిపింది. రికార్డులు కొల్లగొడుతూ పరుగుల వరద పారించినా ఆటపై ఆమెకు మమకారం చెక్కుచెదరలేదు. మహిళల క్రికెట్‌ అంటే అసలు ఆటే కాదు అంటూ ఎవరూ పట్టించుకోని రోజుల్లో మిథాలీ ఏటికి ఎదురీదింది. కోట్లాది కాంట్రాక్ట్‌లు, మ్యాచ్‌ ఫీజులు కాదు కదా… కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆమె ఆటను అభిమానించింది.

రెండు తరాలకు వారధిగా నిలుస్తూ అనేక ఘనతలు తన ఖాతాలో వేసుకున్న మిథాలీ కొందరు అభిమానంతో ‘లేడీ సచిన్‌’ అని పిలుచుకున్నా… సుదీర్ఘ సమయం పాటు భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచి స్థాయిని పెంచిన మిథాలీని చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. ఒకప్పుడు తాను ఇష్టపడిన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్‌ వైపు కదిలిన ఆ పాదాలు అలసట లేకుండా క్రికెట్‌ పిచ్‌పై పరుగెడుతూనే ఉన్నాయి. 303 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 9758 పరుగులతో ఆమె సాగుతూనే ఉంది.   1997 ప్రపంచకప్‌లోనే 15 ఏళ్ల మిథాలీ భారత జట్టులోకి ఎంపికైంది. అయితే ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు సెంచరీతో చెలరేగి తనేంటో నిరూపించింది. తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్‌ సెంచరీ (214)తో ఆమె మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొని రికార్డుల మోత మోగించింది. ఇందులో రెండు సార్లు మిథాలీ సారథ్యంలోనే భారత జట్టు ఫైనల్‌ చేరుకోవడం విశేషం. మధ్యలో కొంత విరామం తప్ప దశాబ్దానికి పైగా భారత కెపె్టన్‌ అంటే మిథాలీరాజ్‌ మాత్రమే. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీ టైటిల్స్‌తో ఆమె నాయకత్వంలో విజయాల జాబితా కూడా చాలా పెద్దదే. ఒక అమ్మాయి తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ, నాయకురాలిగా అదనపు బాధ్యతలతో ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగడం అసాధారణం. కానీ 37 ఏళ్ల మిథాలీ పయనం ఇంకా ఆగలేదు. 2021 వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఈ హైదరాబాదీకి హ్యాట్సాఫ్‌!

ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను: మిథాలీ
‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాను. అన్నింటికి మించి మహిళల సిరీస్‌ల మధ్య సుదీర్ఘ విరామం ఉండటం పెద్ద సమస్యగా కనిపించేది. ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా ఆడి గెలిచిన తర్వాత మరో ఏడు–ఎనిమిది నెలల వరకు మరో సిరీస్‌ ఉండకపోయేది. విజయాల జోరును కొనసాగించాలని భావించే సమయంలో ఇలాంటి షెడ్యూల్‌ మా ఉత్సాహాన్ని చంపేసేది. ఇప్పుడున్న తరహాలో పద్ధతిగా మ్యాచ్‌లు జరిగి ఉంటే నేను మరిన్ని మ్యాచ్‌లు ఆడి మరిన్ని ఘనతలు సాధించగలిగేదాన్ని. ఒకప్పుడు కనీస మీడియా కవరేజి కూడా లేని రోజులనుంచి వచి్చన ప్లేయర్‌ను నేను. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మహిళల క్రికెట్‌ను అనుసరిస్తున్నారు. ఈ రకంగా మహిళల క్రికెట్‌ ఎదగడం, అందులో నేను భాగం కావడం చాలా సంతృప్తినిచ్చే విషయం.  రెండు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగడం గర్వించే విషయం.’అంటూ మిథాలీ పేర్కొంది.

సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లు

►సచిన్‌ – 22 ఏళ్ల 91 రోజులు
►జయసూర్య – 21 ఏళ్ల 184 రోజులు
►మియాందాద్‌ – 20 ఏళ్ల 272 రోజులు
►మిథాలీ రాజ్‌ – 20 ఏళ్ల 105 రోజులు
►26 – 06 –1999అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ తొలి మ్యాచ్‌ ఆడిన రోజు

Courtesy SakShi..