పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ నీటి గోసే
.. కొన్నిచోట్ల ఇప్పటికీ ట్యాంకర్లే దిక్కు
మంచినీటి సరఫరాపై నెరవేరని ప్రభుత్వ హామీ
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం
పైసల్లేక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేత
అత్యధిక ప్రాంతాల్లో పూర్తికాని అంతర్గత పైప్‌లైన్లు

నిర్మల్‌ పట్టణానికి మిషన్‌ భగీరథ ద్వారా నీటిని అందజేయడానికి ప్రభుత్వం రూ.39 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పటి వరకూ ఒక్క కొత్త నల్లా కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు. పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

కాంట్రాక్టర్‌కు బిల్లు రాకపోవడమే ఇందుకు కారణం!
నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. ఇంకా ప్రధాన పైప్‌లైన్‌ పనులే పూర్తి కాలేదు. రైల్వేలైన్‌ కింద క్రాసింగ్‌ పనులు ఉన్నాయి. కొత్త ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం కొనసాగుతోంది.

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఇంకా భగీరథ నీళ్లు అందడం లేదు! కొన్నిచోట్ల పనులే పూర్తి కాలేదు. మరికొన్ని పట్టణాల్లో అయితే భగీరథ పనులను అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ‘‘అసెంబ్లీ ఎన్నికలనాటికి మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం. అలా ఇవ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన తొలి హయాం మొదట్లోనే ప్రకటించారు. ఇందుకు సుమారు రూ.40 వేల కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల బేసిన్‌ల నుంచి నీటిని లిప్టు చేసి, రాష్ట్రంలోని ప్రతి ఊరు, పట్టణానికి తాగునీటిని అందించాలని నిర్ణయించారు. పనులు త్వరగా పూర్తయిన గజ్వేల్‌లో 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు కూడా. ప్రభుత్వం పెట్టుకున్న అసెంబ్లీ ఎన్నికల గడువు కూడా ముగిసి ఏడాది పూర్తయింది. మహబూబ్‌నగర్‌ వంటి కొన్ని

పట్టణాల్లోనే భగీరథ నీటి సరఫరా జరుగుతోంది. కానీ, ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా పట్టణాలు, నగరాలకు మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. కొన్నిచోట్ల మెయిన్‌ పైపులైన్లు పూర్తి కాలేదు. మరి కొన్నిచోట్ల అంతర్గత పైపులైన్‌ పనులు జరుగుతున్నాయి.

ప్రధాన లైన్లు పూర్తయి.. నదుల నుంచి నీటిని ఆయా ప్రాంతాలకు తీసుకొచ్చినా.. సదరు నీటిని ఇంటింటికీ అందించడానికి వీలుగా చేపట్టిన అంతర్గత పనులు పూర్తి కాలేదు. దాంతో, ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. మిషన్‌ భగీరథ పథకం గ్రిడ్‌ను ఆయా ప్రాంతాలకు కలపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు భగీరథ ఇంజనీర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు, పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. అంతర్గత పనులను చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఆర్థిక భారంతో వాళ్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇక, ట్యాంకుల నిర్మాణాలు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. దాంతో, ఆయా మునిసిపాలిటీల్లో గతంలో మాదిరిగానే మళ్లీ నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరికొన్నిచోట్ల పాత పద్ధతిలోనే స్థానికంగా బోరు బావుల నుంచి నీటిని తీసి ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రచారానికి వెళ్లే నాయకులకు ప్రజల నుంచి వినిపించే ప్రధాన సమస్య ఇదే అవుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు ఈ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. నీటి సరఫరాపై ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇప్పుడు నాయకులకు సవాల్‌గా మారింది.

కొన్ని మునిసిపాలిటీల్లో పరిస్థితి ఇదీ..!

  • మెదక్‌ జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో తాగునీటి పథకం పనులు ప్రారంభించారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్‌ పలుమార్లు పనులు నిలిపివేశాడు. ఇటీవల మంత్రి హరీశ్‌ రావు ఆదేశాలతో మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. రామాయంపేటలో భగీరథ పనులు పూర్తయినా సింగూరులో నీళ్లు లేక అందించలేని పరిస్థితి నెలకొంది.
  • సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మినహా మిగతాచోట్ల భగీరథ పనులు సాగుతున్నాయి. సదాశివపేటలో బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2 నెలల కిందట ప్రభుత్వం కాంట్రాక్టు రద్దు చేసుకుంది. ఇక్కడ 8 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ఒకటే పూర్తయింది. 100 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ వేయాల్సి ఉండగా ఒక్క కిలోమీటరు కూడా వేయలేదు.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కురు, పోచంపల్లి, చౌటుప్పల్‌ పట్టణాల్లో ట్యాంకులు, మెయిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైన్‌ నిర్మాణాలు పూర్తి చేశారు.
  • భైంసాలో రెండేళ్ల కిందట భగీరథ పనులు ప్రారంభించారు. పంప్‌హౌస్‌ పూర్తయింది. కానీ, ఐదు ట్యాంకులు, 130 కిలోమీటర్ల పైపులైన్‌ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. చెల్లింపులు చేయకపోవడంతో పనులు నిలిచిపోయి 6 నెలలు దాటేసింది.
  • ఖానాపూర్‌ పట్టణంలో ఒక్క కాలనీకే భగీరథ నీళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం పనుల నిర్మాణం ఆగిపోయింది.
  • కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో భగీరథకు రూ.46 కోట్లను కేటాయించారు. 230కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు. ట్యాంకు ల నుంచి నీటి సరఫరాకు సంబంధించిన కనెక్షన్‌ ఇవ్వలేదు.
  • ఇల్లందు మునిసిపాలిటీకి రూ.25 కోట్లను కేటాయిస్తే.. ఇప్పటి వరకూ రూ.6 కోట్ల విలువైన పనులే చేశారు. ట్యాంక్‌ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.
  • సూర్యాపేట జిల్లా సూర్యాపేట, తిరుమలగిరిల్లో మాత్రమే భగీరథ నీరు సరఫరా అవుతోంది. కోదాడలో ఒక్క వార్డులో కూడా భగీరథ నీళ్లు రావడం లేదు.
  • వనపర్తి జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో అన్నిచోట్లా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.
  • కామారెడ్డి మునిసిపాలిటీలో 30 కిలోమీటర్ల పైపులైన్‌ వేయాల్సి ఉండగా 9 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ మాత్రమే పూర్తయింది. నిధులు విడుదల కాకపోవటంతో పనులు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు.

(Courtesy Andhrajyothi)