• పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లెలి కుటుంబం జలసమాధి
  • గత 27న హైదరాబాద్‌కు బయలుదేరిన దంపతులు, కూతురు
  • అదేరోజు అల్గునూర్‌ వద్ద కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • 21 రోజులుగా నీళ్ల లోపలే.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు లభ్యం
  • మరో ప్రమాదంలో గల్లంతైన వివాహితకై గాలిస్తుండగా వెలికి…
  • మూడేళ్ల క్రితమే కొడుకు మృతి..ఇప్పుడు కుటుంబమే అంతం
  • అనుమానాలెన్నో… ఇన్నాళ్లయినా ఎవరూ ఫిర్యాదు చేయలేదేం!

తిమ్మాపూర్‌ : అది కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాకతీయ ప్రధాన కాలువ! అప్పటిదాకా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలో వరద ఆగిపోయింది.  కాలువలోకి ఓ బైక్‌ దూసుకెళ్లడంతో గల్లంతైన వివాహిత ఆచూకీ కనుగొనేందకు ఎగువ నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. ఆదివారం అర్ధరాత్రి ఓ చోట ఆమె మృతదేహం లభ్యమైతే, సోమవారంప్రవాహం తగ్గిన మరోచోట తిరగబడి ఉన్న స్థితిలో ఓ కారు కనిపించింది. ఆ కారులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు బయటపడ్డాయి.

ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి చిన్న చెల్లెలు రాధ (45), ఆమె భర్త నారెడ్డి సత్యనారాయణ రెడ్డి (50), ఈ దంపతుల కూతురు వినయశ్రీ (23)గా గుర్తించారు. సత్యనారాయణరెడ్డి కుటుంబం స్వస్థలం కరీంనగర్‌. గత నెల 27 నుంచి సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఆచూకీ లేకుండా పోయింది. అదే రోజు ముగ్గురు హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే వీరి వాహనం ప్రమాదవశాత్తు అల్గునూర్‌ వద్ద కాకతీయ కాలువలో పడిపోయినట్లుగా భావిస్తున్నారు. తరచూ విహార యాత్రలకు వెళ్లే అలవాటు ఉండటంతో ఏదో టూర్‌కు వెళ్లివుంటారని బంధువులు భావించారు.

ఆ కారణంగా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్యనారాయణ రెడ్డి కుటుంబం బ్యాంక్‌ ఏరియాలో ఉంటోంది. ఆయన కరీంనగర్‌ మార్కెట్‌ ఏరియాలో ఎరువుల దుకాణం నడుపుతూనే, భాగస్వామ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. భార్య రాధ మల్కాపూర్‌ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయురాలు. వీరి కూతురు వినయశ్రీ నిజామాబాద్‌ జిల్లాలో బీడీఎస్‌ చదువుతోంది.

ఆ రోజు ఏం జరిగింది?
వినయశ్రీ ఇంటర్న్‌షిప్‌ కోసం గత నెల 26న హైదరాబాద్‌కు వెళ్లిన సత్యనారాయణరెడ్డి అదే రోజు కరీంనగర్‌లోని తమ ఇంటికి చేరుకున్నాడు. జనవరి 27న షాపునకు వెళ్లి  మధ్యాహ్నం 3గంటలకు ఇంటికొచ్చారు. బెడ్‌షీట్స్‌, ఇతర సామగ్రి కారులో సర్దాడు. తర్వాత తన ఫోన్‌కు రీచార్జి చేయించాడు. సాయంత్రం 4గంటలకు భార్య, కూతురుతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఏ సమయంలో కారు, కాకతీయ కాలువలో పడిందనేది స్పష్టంగా తెలియటం లేదు.

కెనాల్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, 21 రోజులుగా జలసమాధి అయిన ముగ్గురి గురించి బయటి ప్రపంచానికి ఎప్పుడు తెలిసేదో గానీ.. కాలువలో ఓ వివాహిత గల్లంతవడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆదివారం బైక్‌పై వెళ్తున్న దంపతులు అదుపుతప్పి కాకతీయ కాలువలో పడిపోయారు. గమనించిన ఎల్‌ఎండీ పోలీసులు భర్తను కాపాడి, భార్య ఆచూకీ కోసం నీటి ప్రవాహాన్ని నిలిపివేయించారు.

ఆ వివాహిత మృతదేహం, ఆదివారం అర్ధరాత్రి మానకొండూర్‌ మండలం ముంజంపల్లి శివారులో దొరికింది. కాగా.. ప్రవాహం తగ్గడంతో సోమవారం ఉదయం రాజీవ్‌ రహదారికి కిలోమీటర్‌ దూరంలోని యాదవులపల్లి వద్ద కాల్వలో కారును స్థానికులు గుర్తించారు. పోలీసులు, ఎమ్మెల్యేకు సమాచారం అందించారు.

మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు
సత్యనారాయణ రెడ్డి కుమారుడు, ఇంజనీరింగ్‌ విద్యార్థి  శ్రీనివాస్‌ రెడ్డి.. మూడేళ్ల క్రితం సిరిసిల్ల జిల్లా రగుడు వద్ద కారు బోల్తా పడి మరణించాడు. స్నేహితులతో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొడుకు దుర్మరణంతో రాధ అనారోగ్యం పాలయ్యారు. అప్పటినుంచి మెడికల్‌ లీవ్‌లోనే ఉంటున్నారు. ఆమెకు కేరళలో వైద్యం చేయించేవారు. తేరుకునేందుకు విహార యాత్రలకు తీసుకెళ్లేవారు. అప్పట్లో శ్రీనివాస్‌ రెడ్డి.. ఇప్పుడు వీరు మరణించడంతో కుటుంబమే కనుమరుగైందని బంధువులు కంటతడి పెడుతున్నారు.

అనుమానాలెన్నో!
కరీంనగర్‌ క్రైం : ఇరవై ఒక్క రోజులుగా సత్యనారాయణ రెడ్డి కుటుంబం కనిపించకుండా పోయింది. దీనిపై రాధ సోదరుడు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, బంధువులు, స్నేహితులు ఎవరూ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. జనవరి 27న సాయంత్రం 5 తర్వాత సత్యనారాయణరెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారు, కాలువలోకి దూసుకెళ్లిందని భావిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్లే వాహనదారుల్లో ఎవరూ ప్రమాదాన్ని పసిగట్టక పోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, వీరు రాత్రి వరకు ఇతర ప్రాంతాల్లో తిరిగి, చీకటి వేళ హైదరాబాద్‌ బయల్దేరారా? అందుకే ప్రమాదాన్ని ఎవరూ గమనించలేకపోయారా? అని అనుమానిస్తున్నారు. సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు పనిచేయడంలేదని, ఆచూకీ లభించడం లేదనే విషయం ఎమ్మెల్యేకు 15రోజుల కిందటే తెలిసింది. ఆయన కరీంనగర్‌ మూడో ఠాణా పోలీసుల వద్దకు ఒక బంధువును పంపించి.. చెల్లెలు, బావ, మేనకోడలి సెల్‌ఫోన్‌ నంబర్ల టవర్‌ లొకేషన్‌ను కనుక్కోవాలని అడిగించారు.

పెద్దపల్లి పరిధి పోలీసు అధికారులను కూడా ఇదే విధంగా కోరారు. అయితే, మిస్సింగ్‌ అంటూ ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని కరీంనగర్‌ మూడో ఠాణా సీఐ విజ్ఞాన్‌రావు తెలిపారు. కాగా సత్యనారాయణరెడ్డి కేరళ వెళ్లారన్న ప్రచారం జరగడంతో మనోహర్‌ రెడ్డి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూడా విచారించారని సమాచారం.

Courtesy Andhrajyothi