చల్లపల్లి స్వరూపరాణి

నిజమే, మహనీయుల విగ్రహాలూ, వారు జీవించిన నివాస గృహాలూ, ఇతర స్మ్రుతి చిహ్నాలూ నిరంతరం వివాదాస్పదం అవుతాయి. ఎందుకంటే అవి ఆయా నాయకులతో తమ జీవితాలు పెనవేసుకున్న సమూహాలకు ఒక సెంటిమెంట్ లేదా మనోభావాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు వాటిని చూసినా, చేతితో తాకినా గొప్ప స్పూర్తిని పొందే పరిస్థితి ఇంకా వుంది.

అంబేడ్కర్ విగ్రహం దళితుల నిలువెత్తు ఆత్మగౌరవ ప్రతీక...

అది ఊరికీ వాడకీ మధ్యలో నిలబడి సమాజ వైరుధ్యాలను వేలెత్తి చూపిస్తున్నట్టే వుంటుంది…

దళితులకు ఆబొమ్మని చూస్తే కొండంత ధైర్యం, కులాన్ని పెద్ద పెట్టుబడిగా ఇబ్బడి ముబ్బడిగా వాడుకునే దోపిడీ కుల కామందులకు అదే బొమ్మని చూస్తే కడుపులో దేవినట్టుండే అసహనం…

ఆధునిక భారతంలో ఏ నాయకుడి విగ్రహానికి లేనంత పాపులారిటీ అంబేడ్కర్ విగ్రహానికి వుంది…

విచిత్రంగా మొదటిసారి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఆయన భావాలతో నిరంతరం విభేదించిన ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆవిధంగా అంబేడ్కర్ విగ్రహం అనేక వైరుధ్యాలకు నెలవుగా ఉంటూ వస్తుంది.

1967 లో మొదటిసారి అంబేడ్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ భవనం వద్ద ఏర్పాటు చేసిననాటి నుంచి ఆయన విగ్రహం ఆధునిక భారతంలో అనేక వాద వివాదాలకు కేంద్రబిందువుగా ఉంటూ వస్తుంది.

అందుకే కొంతమంది దళితుల వోటు బ్యాంకుని కాపాడుకోడానికి విగ్రహాలు నిర్మిస్తే, మరికొందరు వాటిని కూల్చి వారి మనోభావాలను కించబరిచాం అనుకుంటారు. ఆయనకి ఈరెండు విషయాలతో సంబంధంలేదు. నిజానికి ఆయన జీవించిన కాలంలోనే కొన్నిచోట్ల అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటికీ అంబేడ్కర్ ఇటువంటి క్రతువులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు.

అంబేడ్కర్ బొంబాయిలో నివసించిన ఇల్లు ‘రాజగృహ, ఆయన సమాధి ఉన్న ‘చైత్యభూమి’కి రోజూ వివిధ ప్రాంతాలనుంచి సందర్శకులు రావడమేకాక అనేక రకాలుగా ఆయన స్ఫూర్తి పరివ్యాప్తమవ్వడాన్ని సహించలేని మనువాద మూక అనేక రకాల దుశ్చర్యలకు పాల్పడుతూనే వుంది. ఇప్పుడు వారు రాజగృహపై దాడి చేయడం సూర్యుడిమీద వుమ్మాలనుకోవడమే!

అంబేడ్కర్ వాదులు రాడికల్ అంబేడ్కర్ ని ఆవాహన చేసుకోకపోతే ఇలాంటి చిల్లర దాడులను తిప్పి కొట్టడానికి వారి సమయం, శక్తి వృధా అవుతూనే వుంటాయి. ఆయన విగ్రహ మాత్రుడు కాదు, అన్ని రకాల విగ్రహాలను ధ్వంసం చేసే పలుగూ, పారా ఆయన సిద్ధాంతంలో, కార్యాచరణలో వున్నాయి…

అంబేడ్కర్ ఒక భవనం కంటే, విగ్రహం కంటే చాలా ఎత్తులో నిలిచిన మేరునగ ధీరుడు…