‘రాజ్‌ గృహ’ గ పిలువబడుతున్న అంబేద్కర్‌ ఇంటిపై.. మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు దాడికి దిగారు. రాత్రిపూట ఇంట్లోకి ప్రవేశించిన ఆ దుండగులు.. ఇంటి ఆవరణ లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలన్నింటినీ చెల్లా చెదురుగా పడేశారు. పై అంతస్థులో ఉన్న కిటికీలపై రాళ్లు విసిరి, వరండాలో నానా బీభత్సం సృష్టించారు. ఘటన జరిగిన సమయంలో అంబేద్కర్‌ మనవడు, వంచిత్‌ బహుజన్‌ అఘాడి (వీబీఏ) అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఉన్నారు. బుధవారం ఉదయం ఆయనే ఈ విషయాన్ని ప్రజలకు తెలిపారు.

దాడిని ఖండించిన రాజకీయ పార్టీలు
దాడి ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, భీం ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ లు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. థాక్రే స్పందిస్తూ.. ‘ఆ ప్రాంగణం ఒక్క అంబేద్కర్‌ వాదులకే కాదు.. మొత్తం సమాజానికే ఆథ్యాత్మిక స్థలం. అంబేద్కర్‌ తన రచనలన్నింటిని ఇక్కడ భద్రపరిచారు. ఇది మహారాష్ట్ర సమాజానికి తీర్థయాత్ర వంటి ప్రదేశం. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠినచర్యల్ని తీసుకోవాలని నేను పోలీసులను ఆదేశించాను’ అని అన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి కఠిన శిక్ష విధించాలని ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దుండగులను త్వరలోనే గుర్తిస్తామని రాష్ట్ర హౌం శాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ అన్నారు. ఇక ఈ దాడి రాజ్‌ గృహ మీద జరిగినట్టు కాదనీ, అంబేద్కర్‌ వాదుల మీద చేసిందని చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సహనం పాటించండి : ప్రకాశ్‌ అంబేద్కర్‌
రాజ్‌ గృహ మీద జరిగిన దాడి దురదృష్టకరం. ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్‌ వాదులకు స్ఫూర్తివంతకమైనది. ప్రజలంతా సహనం పాటించాలి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎవరూ రాజ్‌ గృహ వైపు రావొద్దు. ఇది సంఘటితంగా ఉండాల్సిన సమయం. నమ్మకం కోల్పోవొద్దు. ధైర్యంగా ఉండండి.

Courtesy Nava Telangana