• ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌,
  • ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రకంపనలు
  • కృష్ణానదీ తీరంలో భూకంప కేంద్రం
  • ఆదివారం తెల్లవారుజామున 2.37కు ఘటన
  • 4.6గా నమోదు.. 30 ఏళ్లలో అత్యధిక తీవ్రత
  • ఆదివారం రాత్రి సైతం ప్రకంపనలు

సూర్యాపేట, హుజూర్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, కంచికచర్ల : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూ కంపం కలకలం రేపింది. అంతా ఆదమరిచి నిద్రపోతుండగా ఆదివారం తెల్లవారుజామున ఒకసారి.. నిద్రకు ఉపక్రమిస్తుండగా రాత్రివేళ మరోసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కలవరపాటుతో..ఏ జరుగుతోందో అర్థం కాక ఇళ్లను వీడి బయటకు వచ్చారు. ఆదివారం రాత్రి మరోసారి ప్రకంపనలు సంభవించడంతో సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం వాసులు వణికిపోయారు.

పిల్లా పెద్ద అంతా ఇళ్లను వదిలి వీధుల్లోకి వచ్చారు. అక్కడే మంచాలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. మరికొందరు నెగళ్లు రాజేసి జాగారం చేశారు. అంతకుముందు తెల్లవారుజామున ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూమి కపించింది. భూకంప కేంద్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం చింతలపాలెం మండలం పాత వెల్లటూరు కేంద్రంగా.. భూమి నుంచి 7 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సరిగ్గా 2.37 గంటలకు భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా నమోదైందని వివరించారు.

గత 30 ఏళ్లల్లో ఈ స్థాయి ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా నమోదు కాలేదని భూగర్భ శాస్త్రవేత్త శ్రీ నగేష్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పాత వెల్లటూరు ప్రాంత భూ పొరల్లో ‘వీక్‌ జోన్‌’ ఉందని, మొత్తం 4 సెకన్ల పాటు కంపించగా, రెండు సెకన్లు శబ్దం వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్‌ నగరంలోని ఎల్‌బీనగర్‌, కరీమాబాద్‌, కాశిబుగ్గ, సుబేదారి, కాజీపేట, కే సముద్రం మండలంలో భూమి కంపించింది. జనగామ జిల్లా కేంద్రంలో ఆందోళనతో బయటకు వచ్చిన ప్రజలు చాలాసేపు రోడ్లపైనే గడిపారు.

ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలతో పాటు చింతకాని మండలం నాగులవంచ, తిమ్మినేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు, ముదిగొండ, మధిర పట్టణం, దేశినేనిపాలెం, ఖమ్మంపాడు, ఇల్లెందులపాడు, సత్తుపల్లి, నేలపట్ల, జీళ్లచెర్వు, మునిగేపల్లి, అగ్రహారం, ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు గ్రామాల్లోనూ భూమి కంపించింది. ఏపీలోని పశ్చిమ కృష్ణా పరిధి జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో 3 నుంచి 8 సెకన్ల పాటు తలుపులు, కిటికీలు ఊగాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని అచ్చంపేట, సత్తెనపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రాజుపాలెం, నాదెండ్ల, నకరికల్లు, క్రోసూరు, పెదకూరపాడు, దాచేపల్లి, మాచవరం మండలం పోతుపాలెంలో ప్రకంపనలు వచ్చాయి. వెల్లటూరులో ఇళ్లు పగుళ్లివ్వడం మినహా.. మిగతా ఎక్కడా ఆస్తి నష్టం జరుగలేదు.

13 రోజుల్లో 300 సార్లు : పాత వెల్లటూరు ప్రాంతంలో జనవరి 10న ప్రకంపనలు రాగా 12న ఎన్‌ఆర్‌జీఐ శాస్త్రవేత్తలు పర్యటించి దొండపాడు ప్రాథమిక పాఠశాలలో రిక్టర్‌ స్కేల్‌ ఏర్పాటు చేశారు. అనంతరం 13న ఒకసారి, 20న రిక్టర్‌ స్కేల్‌పై 2.6 భూకంపం నమోదైంది. 13 నుంచి ఆదివారం వరకు సుమారు 300 సార్లు చిన్న చిన్న ప్రకంపనలు గుర్తించారు. కృష్ణపట్టిలోని సున్నపురాయి, ఇసుక రాయి ప్రాంతాల్లోని భూమి లోతుల్లో ఈ స్థాయి భూకంపం ఇదే ప్రథమం కావడంతో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. భూమిలోని రాళ్ల పొరలు బలహీనంగా ఉండటమే ప్రకంపనలకు కారణమని, పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని, పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని శాస్త్రవేత్త శ్రీ నగేష్‌ తెలిపారు.

Courtesy Andhrajyothi