లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ప్రమాదాల్లో 150 మందికి పైగా వలస కార్మికుల మృతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కట్టడి చర్యలో భాగంగా లాక్‌డౌన్‌ విధించటంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వద్ద ఉన్న డబ్బులు ఉన్నంత వరకూ ఏలాగోలా బతుకిడ్చుకొచ్చారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను కేంద్రం మరింత కాలం పెంచుతూపోవడం.. ఉపాధి లేకపోవడంతో దేశంలోని లక్షలాది మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఢిల్లీ, ముంబయి, జైపూర్‌, భోపాల్‌ వంటి నగరాల నుంచి వందలాది కుటుంబాలు ఇంటికి చేరుకున్నాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో వందల కీలోమీటర్లు కాలినడకనే బయలుదేరారు. ఈ నేపథ్యంలో 150 మందికి పైగా వలస కార్మికులు ప్రమాదాలకు గురై స్వస్థలాలకు చేరకుండానే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలలో సడలింపులు ప్రకటించడంతో వలస కార్మికులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థలాలకు తరలిస్తున్నాయి. ఈ సౌకర్యాల పొందలేనీ, రవాణా ఖర్చులు భరించలేని వలస కార్మికుల పరిస్థితులు వర్ణనాతీతం. తమకు తినడానికి తిండిలేక.. చేతిలో చిల్లిగవ్వలేకుండా మార్గమధ్యలో ఉన్న కార్మికులు సైతం అనేక మంది ఉన్నారు.

వీరిలో స్వస్థలాలకు చేరుకుంటామో లేదోనంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేసే అభాగ్యులు ఉన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గూడ్స్‌ రైలు ఢ కొనడంతో 16 మంది వలస కార్మికులు కోల్పోవడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో కార్మికులతో వెళ్తున్న ట్రక్‌ ప్రమాదానికి గురవడంతో 8 మంది మరణించారు. 55 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వీరందరూ ఉన్నావో, రారుబరేలి ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు. ఈ నెల 16న యూపీలో జరిగిన ఓ ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు మరణించారు. ఈ ఘటనలో 37 మంది గాయపడ్డారు. అలాగే, బీహార్‌లోని భాగల్పూర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 9 మంది వలస కార్మికులు మరణించారు. ఈ ఘటనలన్ని అధికారికంగా నివేదించినవి.

అయితే, కాలినడకన వెళ్తున్న అనేక మంది వలస కార్మికులు మార్గమధ్యలోనే కుప్పకూలిన ఘటనలు లెక్కలోకి తీసుకుంటే మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ”సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌” విశ్లేషణ ప్రకారం.. మార్చి 24 నుంచి మే 18 మధ్య కాలంలో స్వస్థలాలకు వెళ్లున్న సమయంలో ప్రమాదాలు జరిగి 159 మంది వలస కార్మికులు చనిపోయారనీ, 630 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం వలస కార్మికులను తరలించడానికి రైళ్లు ప్రారంభించిన తర్వాత సైతం… రైళ్లలో వెళ్లడానికి అవకాశం దొరక్క, టిక్కెట్లకు డబ్బులు చెల్లించే స్తోమత లేని చాల మంది వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్తూ ప్రమాదాలకు గురికావడం అందరిని కలచివేస్తున్నది.

Courtesy Nava Telangana