-కట్టపై నిద్రిస్తుండగా టిప్పర్‌తో మట్టిపోసిన వైనం
– ”కాళేశ్వరం” ప్యాకేజీ పనుల్లో విషాదం
కోనరావుపేట :
కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యం ఓ వలస జీవిని సజీవ సమాధి చేసింది. కట్టపై నిద్రిస్తున్న ఓ కార్మికుడిపై టిప్పర్‌తో మట్టి పోసారు. ఉదయం మట్టిని చదును చేస్తుండగా అతని మృతదేహం బయటపడింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ పనుల్లో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాళేశ్వరం 9వ ప్యాకేజీలోని మల్కపేట రిజర్వాయర్‌ బండ్‌(కట్ట)-6లో తమిళనాడు లోని తుచిపూడికి చెందిన సెల్వరాజ్‌(38) కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన పని ముగించుకుని కట్టపైనే నిద్రపోయాడు. అతన్ని గమనించక టిప్పర్లు కట్టపై మట్టిని పోస్తూ వచ్చాయి. ఉదయం అదే మట్టిని చదును చేస్తుండగా సెల్వరాజ్‌ మృతదేహం బయటపడింది. గమనించిన కాంట్రాక్టర్‌ హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాత్రి పని జరుగుతుండగా అధికారులు లేకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించడంతోనే వలస కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

Courtesy Nava telangana