-భారీ మొత్తంలో మధ్యాహ్న భోజన బకాయిలు
– లాక్‌డౌన్‌లో ఉపాధి లేక కార్మికుల అవస్థలు
– బువ్వ పెట్టే అవ్వకు బతుకు దయనీయం

వరంగల్‌: అప్పో సప్పో చేసి పిల్లల కడుపులు నింపిన తల్లులకు తమ కష్టానికి పైసలందక సతమత మవుతున్నారు. నాలుగు నెలలుగా పనుల్లేక పోషణకు భారమవుతున్నవారికి గత మూడు నెలల బిల్లులు చేతికందక అప్పులు తీర్చలేకపోతున్నారు. ఉన్నతాధికారులు బిల్లులు విడుదల చేశామని చెబుతున్నా ఎంఈఓ జాప్యం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పటికీ పైసల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా సుమారు పది కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

మార్చిలో లాక్‌డౌన్‌కు ముందే పాఠశాలలు బంద్‌ చేసినా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం పెట్టిన కార్మికులకు డబ్బులందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వేతనాలు సహా కోడి గుడ్ల బిల్లులు కూడా నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. జనగామ జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 42వేల 677 మంది విద్యార్థులుండగా వారికి రోజుకు 2 లక్షలా 56 వేలా 532 రూపాయలు మధ్యాహ్న భోజనానికి ఖర్చవుతోంది. ఆ లెక్కన నెలకు 76 లక్షలా 95 వేలా 960 రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా బకాయిలు పడటంతో మొత్తం 2 కోట్లా 30 లక్షలా 87వేలా 880 రూపాయల చెల్లింపు నిలిచిపోయాయి.

అదేవిధంగా జనగామ జిల్లావ్యాప్తంగా 970 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తుండగా నెలకు 9లక్షలా 70 వేలు పారితోషికం అందాలి. అవీ మూణ్నెల్లుగా ఆగిపోవడంతో 29 లక్షలా 10వేల రూపాయలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విధంగా ఆ ఒక్క జిల్లాల్లో భోజన బిల్లులు, కార్మికుల వేతనాలు కలిపి 2 కోట్లా 59 లక్షలా 97వేల 880 రూపాయలు అందాల్సి ఉంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 4972 పాఠశాలల్లో మూడు లక్షల మందివరకు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 5600 మంది వరకు మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులు సుమారు 10 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు రెండురోజులకు ఒకసారి కోడిగుడ్డు పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చేది నాలుగు రూపాయలే అయినా బయట మార్కెట్‌లో రూ.4.50కు కొని విద్యార్థులకు వడ్డించారు. వాటికి సంబంధించిన బిల్లులు సైతం ఏడు నెలలుగా నిలిచిపోయాయి.

బిల్లులు విడుదలైనా ఇవ్వని స్థితి..
లాక్‌డౌన్‌ ముందే అందాల్సిన బిల్లుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఏడు నెలలుగా కార్మికులు నానాయాతన పడుతున్నారు. ఇటీవలే నిధులు మంజూరైనట్టు ఉన్నతాధికారులు అంటున్నా ఎంఈఓలు బిల్లులు సబ్‌మిట్‌ చేయలేదని తెలుస్తోంది. దీంతో పెండింగ్‌లో ఉన్నాయని ఓ ఉన్నతాధికారి ‘నవతెలంగాణ’కు తెలిపారు. అయితే మధ్యాహ్న భోజన కార్మికుల్లో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే అత్యధికం. లాక్‌డౌన్‌లో ఉపాధి, ఆదాయం లేక ఆ కుటుంబాలు తిండికీ తిప్పలు పడ్డాయి. అయినప్పటికీ బిల్లులు చెల్లించే విషయంలో అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో కిరణా షాపుల్లో అప్పులు చేసినవారు ప్రస్తుతం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక పాఠశాలలో గుండెబోయిన శారద 55మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో కట్ట మల్లమ్మ 32 మంది విద్యార్థులకు వంటచేసి పెట్టారు. ఒక్కొక్కరికి రూ.లక్షకుపైగా బిల్లులు రావాలి. మూడు నెలల పారితోషికం అందాలి. బిల్లులందక కిరాణా యజమానులు అందరి ముందు నిలదీస్తున్నట్టు కార్మికులు వాపోతున్నారు.

అప్పుల బాధ ఎక్కువైంది : దాసరి దేవి
శాయంపేట మండల కేంద్రంలో 130మంది విద్యార్థులకు వంట చేసి పెట్టాం. సామాన్ల కోసం అప్పులు చేశాం. కిరాణాషాపు వారు ఒత్తిడి చేస్తున్నారు. భోజనం, కోడిగుడ్ల బిల్లులు, పారితోషికం గురించి అధికారుల్ని అడిగితే సరియైన సమాధానం ఇవ్వడం లేదు. జనవరి నుంచి మార్చి 23 వరకు రావాల్సిన బిల్లులను వెంటనే ఇవ్వాలి.

ఎప్పుడూ ఇదే పరిస్థితి : స్వరూప
మధ్యాహ్న భోజనం బిల్లుల డబ్బులు ఎప్పుడూ సకాలంలో ఇస్తలేరు. మూడు, నాలుగు మాసాలై తేనే ఇస్తుండ్రు. ధరలు పెరిగినరు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎటూ సరిపోవు. ఒక ఆడ మనిషి రోజు కూలీకి వెళ్తే రూ.500 వస్తున్నరు. వంట చేస్తే రూ.200 కూడా వస్తలేవు. జనవరి నుంచి బిల్లులు ఇంకా ఇవ్వకుంటే ఎట్లా?

ఎంఈఓలకు పంపించాం
పెండింగ్‌ బిల్లులు ఇటీవల విడుదలయ్యాయి. డీఈఓ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులకు పంపించాం. బిల్లులు సబ్మిట్‌ చేస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు అందజేస్తారు. ఎలాంటి పెండింగ్‌ లేకుండా మార్చి 16 వరకు బిల్లులు చేసి ఇవ్వాలని ఎంఈఓలకు చెప్పాం.
– యాదయ్య, జనగామ డీఈఓ

Courtesy Nava Telangana