నల్లగొండ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.. ప్రొఫెసర్‌ రాజీనామా! 

నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థినులను ఓ అధ్యాపకుడు లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగుచూసింది.  జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు మూడు రోజుల క్రితం విచారించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ ప్రొఫెసర్‌, ఓ విద్యార్థినిని మచ్చిక చేసుకొని లైంగిక దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె ద్వారా మరో ముగ్గురు విద్యార్థినులను లోబర్చుకునేందుకు ప్రయత్నించగా; వారు చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ రంగనాథ్‌ విచారణలో సదరు ప్రొఫెసర్‌ తాను చేసిన తప్పును అంగీకరించడంతో పోలీసులు, ఆయన తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలేసినట్లు సమాచారం.

ఇతనొక్కడే కాకుండా ఇంజనీరింగ్‌ కళాశాలలో మరో ముగ్గురు ప్రొఫెసర్లు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనివ ర్సిటీ అఽధికారులు.. ఆరుగురితో కమిటీ వేసి విచారణ చేసినట్లు తెలుస్తోంది. కాగా సదరు ప్రొఫెసర్‌ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ యాదగిరికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Courtesy Andhrajyothi