-పనిదినాలు…వేతనాన్ని పెంచితే పేదలకు మేలు
– జీడీపీలో 1శాతం…రూ.2లక్షల కోట్లు కేటాయించాలి : ఆర్థిక నిపుణులు
– గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది..
– ఆర్థిక సంక్షోభాన్ని అరికడుతుంది..

న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌ డిమాండ్‌ ఏర్పడుతుందన్నది అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేంత నగదు ప్రజల వద్ద లేదు. ‘ఉపాధి హామీ చట్టాన్ని’ పక్కాగా అమలుజేస్తే, ఓ 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోకి వస్తుందనీ కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచటంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ గొప్పగా పనిచేస్తుందని వారు అంటున్నారు.
కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 691 జిల్లాల్లో ఉన్న 2,62,637 గ్రామ పంచాయితీల్లోని 26కోట్లమందికిపైగా కార్మికులకు ‘నరేగా కార్డులు’ (ఉపాధి హామీ ) జారీచేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7.7కోట్లమందికి మాత్రమే పని కల్పించగలిగారు. సగటు పనిదినాలు కూడా 50కన్నా తక్కువగా ఉన్నాయి. వీరికి సగటున అందిన దినసరి వేతనం రూ.180కన్నా తక్కువగా ఉంది. మోడీ సర్కార్‌ ఉపాధి హామీ చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందనీ, పేదల ఆదాయాన్ని పెంచే ఒక మంచి చట్టాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారనీ ఈ గణాంకాలే చెబుతున్నాయి.

జీడీపీలో 1శాతం చాలు..!
మనదేశ వార్షిక జీడీపీ సుమారుగా 2.50 లక్షల కోట్లు దాటిందని మోడీ సర్కార్‌ చెప్పుకుంటోంది. అయితే ఇందులో కనీసం 1శాతం…అంటే సుమారుగా 2 లక్షల కోట్లు ఉపాధి హామీ చట్టంపై వ్యయం చేస్తే, ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టే గొప్ప చర్య అవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సగటు దినసరి వేతనం రూ.180 నుంచి 360కి పెంచాల్సిన అవసరం ఉందనీ, గ్రామీణ భారతంలో మంచి ఫలితాలు ఇస్తుందనీ వారు అన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లోనూ అమలుజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల డబ్బు ప్రజల చేతుల్లోకి..
ఆర్థిక సంక్షోభం పరిష్కరించడానికి మోడీ సర్కార్‌ ఎంచుకున్న మార్గం, బడా కార్పొరేట్‌ వర్గానికి లక్షల కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు ప్రకటించటం. ఫలితంగా కేంద్ర ఖజానాకు లక్షల కోట్లు రాకుండా పోయాయి. దీంతో కోట్లాదిమంది ప్రజలకు సంబంధించిన సామాజిక, సంక్షేమ పథకాలకు నిధుల సమస్య ఏర్పడనుంది. కేవలం కొద్ది మంది బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థల కోసం ఈ నిర్ణయం చేశారన్నది సుస్పష్టం. ఇప్పటికైనా కేంద్రం మేలుకొని, బ్యాంకుల నుంచి అప్పులు చేసైనా ‘ఉపాధి హామీ చట్టం’పై నిధుల వ్యయం పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వార్షిక జీడీపీలో 1శాతంగా చెప్పుకుంటున్న రూ.2లక్షల కోట్లు వ్యయం చేస్తే…అదంతా దేశంలోని పేదల చేతుల్లోకే వెళ్లే అవకాశం ఉంది. ఉపాధి హామీ 1.4 రేట్లు ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సగటున 5గురు సభ్యులున్న 8 కోట్ల పేద కుటుంబాలు ప్రభావితమవుతాయనుకుంటే, 40 కోట్లమంది చేతుల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది.
ప్రభుత్వ వ్యయం తగ్గితే సంక్షోభం మరింత ముదురుతుంది. సేవారంగం, తయారీ రంగంలో ఉద్యోగాలు పోతాయి. ఆర్థిక పరిభాషలో దీనిని ‘డిమాండ్‌ నిర్బంధిత’ పరిస్థితిగా పేర్కొంటారు. దీనివల్ల జాతీయ ఆదాయమూ, వార్షిక జీడీపీ..ఏదీ పెరగదు. ద్రవ్యలోటు నియంత్రణ కోసం ప్రభుత్వ వ్యయంలో కోతలు విధించరాదు. కేవలం కార్పొరేట్‌ పన్ను ప్రయోజనాలు కల్పించినంత మాత్రాన ఫలితాలు రావు. ద్రవ్యలోటును పక్కకుపెట్టి మరీ ప్రభుత్వ వ్యయం పెరగాల్సిందే. అదంతా మళ్లీ సేవా పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.

Courtesy Nava Telangana..