ఉపాధి హామీకి పెరిగిన డిమాండ్‌
గతేడాదితో పోల్చితే 88 శాతం ఎక్కువ
కరోనా..లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డ కోట్లాది శ్రామికజనం

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో అనేక మంది పని కోల్పోవడంతో కోట్లాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధారపడాల్సి వచ్చింది. అనేక మంది వలస కూలీలు తమ సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోవడంతో ప్రస్తుత ఏడాది మే, జూన్‌ మాసాల్లో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌)కు భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో పోల్చితే అక్టోబర్‌లో కొంత తగ్గినప్పటికీ.. ఇప్పటికీ దీనిపై ఆధారపడే వారి సంఖ్య పెద్ద మొత్తంలోనే ఉంది. అయితే వారందరికీ ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలంలో ఈ పథకంలో ఉపాధి కోరిన వారిలో 80 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2.43 కోట్ల మంది ఉపాధిని డిమాండ్‌ చేశారు. ఇందులో కేవలం 1.63 కోట్ల మందికి మాత్రమే ఉపాధి దొరికింది. మిగితా 81 లక్షల కుటుంబాలకు ఉపాధి కరువైంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వెబ్‌సైట్‌ గణంకాల ప్రకారం.. గడిచిన అక్టోబర్‌లో 2.43 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ కోసం ఆర్జి పెట్టుకున్నాయి. గతేడాది ఇదే నెల ఉపాధి ఆర్జించిన వారితో పోల్చితే 88.37 శాతం, 2018 అక్టోబర్‌ మాసంతో పోల్చితే 52.50 శాతం ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆగస్టు నుంచి అక్టోబర్‌ కాలంలో పంటల సీజన్‌.. కూలీలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ ఈ ఏడాది అవకాశాలు లేకపోవడంతో ఉపాధి హామీపై ఆధారపడటం ఆందోళన కలిగించే అంశం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉపాధి హామీకి భారీ డిమాండ్‌ పెరిగిందని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సంఘర్ష్‌ మోర్చా ప్రతినిధి డెబ్‌మాల్యా నండి పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కనీసం కోటి కుటుంబాలు ఈ పనికి డిమాండ్‌ చేశాయి. లాక్‌డౌన్‌ కాలంలోని తమ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రజలకు నగదు అవసరం అవుతుండటంతో ఉపాధికి డిమాండ్‌ పెరిగిందన్నారు. అయినప్పటికీ ఈ పథకంలో సరైన అవకాశాలు కల్పించడం లేదన్నారు. పరిమితులు ఎందుకు విధిస్తున్నారో కారణాలు తెలియడం లేదన్నారు. 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కు రూ.61,500 కేటాయింపులు చేసింది. 2019-20 నాటి కేటాయింపులతో పోల్చితే 13.3 శాతం తక్కువ. లాక్‌డౌన్‌ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఉపాధి హామీకి డిమాండ్‌ పెరిగింది. దీంతో కేంద్రం మరో రూ.40వేల కోట్లు ప్రకటించింది. కానీ ఉపాధి కల్పించడంలో, వ్యయం చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయనే విమర్శలు భారీగా వస్తున్నాయి.

Courtesy Nava Telangana