హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు భద్రతపై చట్ట బద్ధమైన విచారణను గురువారం చేపట్టారు. బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌ కార్యాలయంలో నిర్వహించిన విచారణలో న్యూ ఢిల్లీ నుంచి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ నుంచి జేకే గార్గ్‌తోపాటు ప్రతినిధి, ఎల్‌ అండ్‌ టీ మెట్రో, హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ పెచ్చు ఊడిపోయి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ప్రత్యేకంగా మెట్రో రైలు ప్రాజెక్టు భద్రతపై కేంద్ర ప్రభుత్వం పరిధిలోని మినిస్ర్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నగరవాసులు మెట్రోలో భద్రత పరంగా ఉన్న లోపాలను, నిర్వహణలో కనిపించిన అంశాలను వారి ముందుంచారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. అయితే.. భద్రత పరంగా ప్రమాణాలు సరిగా పాటించడం లేదని పలువురు విచారణకు వచ్చిన ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో.. మెట్రో అధికారుల బహిరంగ విచారణపై అక్కడికి వచ్చిన నగరవాసులు పెదవి విరిచారు. తమ వాదనను సరిగా వినిపించుకోకుండా తమనే ఎదురు ప్రశ్నలు అడిగారని వాపోయారు. హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో ప్రయాణం ఎంతో కీలకంగా మారింది. అయితే… దాని నిర్వహణ విషయంలో మెట్రో ప్రయాణికులుగా తమ అనుభవాలను చెప్పేందుకు వస్తే, తమ వాదనలను వారు సరిగా వినిపించుకోలేదని ఒకరు తెలిపారు. కాగా ఎంతో కీలకమైన ఈ సమావేశానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా సమావేశం జరిగిన విధానం, అందులో పాల్గొన్న వారు చెప్పిన అభిప్రాయాలను బయటకు వెల్లడించలేదు. ప్రయాణికుల భద్రతే కాదు మొత్తంగా నగర వాసులందరి భద్రతకు సంబంధించిన అంశంపై మెట్రో అధికారులు వ్యవహరించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు.

నాణ్యతపై 2018లోనే ఫిర్యాదు చేశాం… : హైదరాబాద్‌ మెట్రో రైలు నాణ్యతపై 2018 జూన్‌ 28న తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశాం. మెట్రో స్టేషన్ల వద్ద చాలా చోట్ల నీటి లీకేజీ ఉంది. దీనివల్ల నిర్మాణాలు దెబ్బతింటాయని ఫిర్యాదులో పేర్కొన్నాం. అయినా.. అప్పటి నుంచి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతలోనే అమీర్‌పేటలో ప్రమాదం జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అధికారులు స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలోనైనా నగరవాసుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాటిని అమలు చేస్తే భద్రతకు ఇబ్బంది ఉండదు. లేదంటే మెట్రో రైలు అంటేనే భయపడాల్సి వస్తుంది. పూర్తిగా నడి రోడ్డు మీద చేపట్టిన మెట్రో ప్రాజెక్టు విషయంలో భద్రతతో పాటు దాని నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వెల్‌టెక్‌ ఫౌండేషన్‌ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైలు సేఫ్టీ ప్రతినిధికి జనక్‌ కుమార్‌ గార్గ్‌కు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చాం.

సీహెచ్‌ వీరాచారి, వెల్‌టెక్‌ ఫౌండేషన్‌

నాలుగు గోడల మధ్య విచారణ చేస్తున్నారు… : ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన అతి పెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు. అలాంటి ప్రాజెక్టు భద్రత విషయంలో మెట్రో అధికారులు చేపట్టిన విచారణ సంతృప్తికరంగా జరగలేదు. విచారణ సందర్భంగా వచ్చిన వారిని మీకు ఏం సంబంఽధం ఉందని అడిగారు. మమ్మల్నే ఎదురు ప్రశ్నలు అడిగారు. బహిరంగ విచారణలా కాకుండా ఎంతో గోప్యంగా చేస్తున్నారు. మెట్రో భద్రత, నిర్వహణ విషయంలో పలు సూచనలు చేశారు. ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను మెట్రో భద్రతపై అధ్యయనం చేసేందుకు నియమించాలి. ప్రస్తుతం వర్షాకాలంలో రైళ్ల వేగాన్ని కొంత మేర తగ్గించాలి. దీనివల్ల రైళ్లకు సడన్‌గా బ్రేకులు వేస్తే మెట్రో కారిడార్‌ వయాడక్డుల్లో కదలికలు వచ్చి గోడలకు పెచ్చులూడే ప్రమాదం ఉంది. 56 కి.మీ. మేర రాకపోకలు సాగిస్తున్న మెట్రోలో భద్రత పరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పాం. మెట్రో స్టేషన్‌ల కింద సేఫ్టీ నెట్స్‌ పెట్టాలి. పై నుంచి తలల మీద ఏవైనా పడే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎల్‌ అండ్‌టీ మెట్రోపైనే ఉంది.

పీఎస్‌ రెడ్డి, న్యాయవాది, సివిల్‌ ఇంజనీర్‌

Courtesy Andhrajyothyi…

Tags-Telangana ,KCR, government, metro, accident, women, died, Delhi, team, investigation, secret