– కొత్త సచివాలయాలతో మీసేవను అనుసంధానించా  సచివాలయ నోటిఫికేషన్‌తో సర్వీసు తగ్గే అవకాశం 

ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లు, వార్డు, సచివాలయాల నోటిఫికేషన్‌తో ఉద్యోగుల సంఖ్య, సర్వీసు తగ్గే అవకాశం ఉందని అర్బన్‌ మీసేవా కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు అన్యాయం చేయకుండా కొత్తగా ఏరాటు చేసే సచివాలయలకు అర్బన్‌ మీసేవ సెంటర్లను అనుసంధానం చేయాలని, దీంతో వాటి పనితీరూ మెరుగుపడుతుందని, తమకు ఉద్యోగ భద్రతా ఉంటుందని మీసేవా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పదహారేళ్లుగా పనిచేస్తున్న అర్బన్‌ మీసేవా కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం మేనేజరుకు రూ.9600, ఆపరేటర్లకు రూ.6400 ఇస్తున్నారని వాపోయారు. ప్రజలకు అన్ని రకాల సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో 2003లో ప్రారంభమైన అర్బన్‌ ఇ మీసేవా కేంద్రాల్లో దాదాపు 1500 మంది పనిచేస్తున్నారు. వీరి ద్వారా 367 ప్రభుత్వ సేవలు, 30 ప్రయివేటు సేవలు నెలకు దాదాపు కోటి మంది ప్రజలకు అందిస్తుండడంతో ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం చేకూరుతోంది. అలాంటి సేవలను ప్రభుత్వం ప్రయివేటు పరం చేసింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు వచ్చే అరకొర జీతమూ సక్రమంగా చేతికి అందని పరిస్థితి. ఎవరైనా ఉద్యోగి చనిపోతే దహన సంస్కార ఖర్చులూ పొందలేని దుస్థితి నెలకొంది. కనీస వేతనాలూ, ఉద్యోగ భద్రతా, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యాలూ లేవని, వాటిని కల్పించాలని కోరుతున్నారు.
ప్రసూతి సెలవులు కరువు
80 శాతం మంది మహిళా ఆపరేటరు ్లపనిచేస్తున్నా, ఎక్కువ మీసేవా కేంద్రాల్లో కనీస మౌలిక వసతులైన టాయిలెట్లు, ఫర్నిచరు సౌకర్యాలు లేవనీ, ప్రసూతి సెలవు కోసం కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందనీ మహిళా మీసేవా కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని, వివిధ శాఖల ద్వారా ఇఎస్‌డికి వచ్చే కమీషన్‌ ఛార్జీలతోనే ఉద్యోగుల కనీస వేతనాలు ప్రభుత్వ అధికారుల ద్వారా చెల్లించవచ్చని, దీంతో ప్రభుత్వం పై భారం పడబోదని మీసేవా ఉద్యోగులు కోరుతున్నారు. వీరికి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో జీతం పెంచారని, తర్వాత మారిన ప్రభుత్వాలు తమపట్ల నిర్లక్ష వైఖరితో వ్యవహరించాయని, ప్రస్తుత సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అయినా తమ పరిస్థితుల గురించి మానవీయ కోణంలో ఆలోచించి ఉద్యోగభద్రత కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వమే నడపాలి
‘గ్రామ, వార్డు సచివాలయలకు మీసేవా కేంద్రాలను అనుసంధానం చేస్తే వాటి పనితీరూ మెరుగవుతుంది. మా ఉద్యోగాలు పోకుండా ఉంటాయి. ఇంత ఆదాయం వచ్చే మీసేవా కేంద్రాలను ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకోవాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.’
సిహెచ్‌.నాగేశ్వరరావు, అర్బన్‌ మీసేవ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి

కనీస వసతుల్లేవు
‘మహిళా ఆపరేటర్లు పనిచేస్తున్న మీ సేవా కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రసూతి సెలవుల కోసం కాంట్రాక్టర్ల చుట్లూ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుత సిఎం అయినా మా పరిస్థితిని అర్ధం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాను.’
వై.శ్యామల మీసేవా ఉద్యోగి

కనీస వేతనమివ్వాలి
‘పదహారేళ్లుగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలు ఇస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషను వచ్చిన నేపథ్యంలో మీసేవా కేంద్రాల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. మాకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలివ్వాలని సిఎంను కోరుతున్నాను’.
శ్రీకాంత్‌ , మీసేవా ఉద్యోగీ

COURTESY PRAJASAKTI