మోమిన్‌పేట : వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పచ్చి బాలింత ప్రాణం తీసింది. ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చి.. పండంటి మగబిడ్డకు జన్మినిచ్చి.. ఆపై సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. మోమిన్‌పేట మండలం, మొరంగపల్లి గ్రామానికి చెందిన మీనా (28) గురువారం పురిటి నొప్పులతో మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం విధుల్లో ఉన్న సిబ్బంది కల్పన, సంగీత.. ఆమెకు కాన్పు చేశారు. పండంటి మగబిడ్డ జన్మించాడు. ప్రసవమైన కాసేపటికే మీనాకు తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఆందోళన చెందిన ఆసుపత్రి సిబ్బంది.. పీహెచ్‌సీ డాక్టర్‌ కృష్ణకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఆయన.. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. 108 వాహనంలో సంగారెడ్డికి తరలించేసరికే.. అధిక రక్తస్రావంతో మీనా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన ఆమె భర్త, బంధువులు.. మృతదేహంతో మోమిన్‌పేట్‌ పీహెచ్‌సీ ఎదుట ఆందోళనకు దిగారు. మీనా మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరికి మద్దతుగా అఖిల పక్ష నాయకులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎస్పీ సంజీవరావు, మోమిన్‌పేట్‌ సీఐ, ఎస్‌ఐలు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాన్ని శాంతింపజేశారు.తక్షణ సాయం కింద రూ. 50 వేలు ప్రకటించారు.

Courtesy Andhrajyothi