• మెడికల్‌ కాలేజీల సీట్లు అమ్మేసుకున్నారు..
  • అలా రూ.100 కోట్లకుపైగా ఆర్జించారు
  • కర్ణాటక స్కాంలో వెలుగులోకి!

మెరిట్‌ అభ్యర్థులకు కేటాయించాల్సిన సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాగా మార్చేసి ఒక్కో సీటును రూ.60 లక్షలకు అమ్మేసుకున్నారు. కర్ణాటక మెడికల్‌ కాలేజీల అడ్మిషన్ల కుంభకోణంలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని శ్రీ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, శ్రీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, శ్రీ దేవరాజ్‌ ఉర్స్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, ఆర్‌ఎల్‌ జలప్ప ఆస్పత్రి మరియు పరిశోధన కేంద్రాల్లో ఈనెల 9 నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిలో మొదటి రెండు సంస్థలు శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ ట్రస్ట్‌కు ప్రధాన ట్రస్టీగా మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్‌ వ్యవహరిస్తున్నారు.

తర్వాతి రెండు కాలేజీలు కేంద్ర మాజీ మంత్రి ఆర్‌ఎల్‌ జలప్పకు చెందినవి. వీరిద్దరూ కాంగ్రెస్‌ నాయకులే. మెడికల్‌ సీట్ల అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఇంటెలిజెన్స్‌ నుంచి నివేదికలు అందడంతో కర్ణాటక, రాజస్థాన్‌లలోని 32 చోట్ల సోదాలు జరిపినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) ద్వారా మెరిట్‌ అభ్యర్థులకు కేటాయించాల్సిన సీట్లను మోసపూరితంగా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లుగా మార్చేసి డ్రాపౌట్‌ విధానం ద్వారా కేటాయించినట్టు సోదాల్లో గుర్తించాం’ అని ఈ నెల 10న ఓ ప్రకటనలో ఐటీ విభాగం వెల్లడించింది. ఒక్కో ఎంబీబీఎస్‌ సీటును అనర్హులకు రూ.50-60 లక్షలకు అమ్మేసుకున్నట్టు నిరూపించే పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈ సోదాలను పర్యవేక్షించిన సీనియర్‌ అధికారి ఓ ఆంగ్ల టీవీ చానల్‌కు వివరించారు. ఈ స్కాంలో మెడికల్‌ కాలేజీలు, బ్రోకర్లతో కూడి ఓ పెద్ద నెట్‌వర్క్‌ పాత్ర ఉందన్నారు.

ఇందులో పాత్రధారులైన విద్యార్థుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ అక్రమాల రాకెట్‌ ఎలా జరిగిందో వెల్లడైంది. సీట్లు అమ్ముకోడానికి సహకరించామని ఏజెంట్లు ఒప్పుకున్నారు. సాక్ష్యులుగా మారేందుకు బ్రోకర్లు కూడా అంగీకరించారు. 185 సీట్లు అమ్ముకోవడం ద్వారా లభించిన సుమారు రూ.100 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని గుర్తించాం. రూ.8.82 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం. ఆ పత్రాలు, ఎలక్ర్టానిక్‌ ఆధారాలను పరిశీలిసున్నాం. త్వరలోనే సీబీడీటీ(ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు)కు నివేదిక సమర్పిస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం సీబీఐ తదితర సంస్థలకు సీబీడీటీ పంపుతుంది’ అని ఆ అధికారి చెప్పారు.

Courtesy Andhrajyothi..