– గుడిపాటి

భావప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. దానికి భంగం కలిగినప్పుడు పత్రికలు స్పందించాలి. భావస్వేచ్ఛపై దాడిని నిరసించాలి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికల విధి, కర్తవ్యమిది. ఇందుకు భిన్నంగా పత్రికలే భావస్వేచ్ఛ హననానికి పాల్పడటం వైచిత్రి. ప్రజాస్వామ్యంలో ఏదయినా పారదర్శకంగా ఉండాలని చెప్పే పత్రికల యాజమాన్యాలు హక్కుల హననాన్ని చాలా పకడ్బందీగా హరించడానికి ప్రయత్నించే ధోరణి మొదలయింది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, నిబద్ధత ఇనుమడింపజేయడం లక్ష్యమన్నట్టుగా చెబుతాయి. కానీ అంతిమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడితే ఉద్యోగులపై కఠినచర్యలు తప్పవని బెదిరిస్తాయి. అవసరమైతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరిస్తాయి. ఇటీవలి కాలాన కొన్ని పత్రికల్లోని పరిణామమిది. హద్దుల్లో ఉండాలని మౌఖికంగా కాదు, లిఖితపూర్వకంగా సర్క్యులర్‌ జారీ చేయడం విడ్డూరం.

అభిప్రాయాలకు కత్తెర
పత్రిక విధివిధానాలకు అనుగుణంగా జర్నలిస్టులు పని చేయాలని కోరడం ఆక్షేపణీయం కాదు. తమ విధానానికి అనువు కాని వార్తల్నీ, కథనాలనీ ఎడిట్‌ చేయాలనుకోడం తప్పు కాదు. విధానానికి అనుగుణంగా పని చేయాల్సిందిగా ఉద్యోగులని కోరడం సహజమే. కానీ వారు సోషల్‌ మీడియాలో కూడా ఏం రాయకూడదని, కామెంట్లు చేయకూడదని చెప్పడం క్రూర పరిహాసం. ప్రభుత్వానికి అనుకూల విధానాన్ని అనుసరించాలని ఒక పత్రిక నిర్ణయించుకుంటే అది వారి ఇష్టం. కానీ వారి దగ్గర పనిచేసే ఉద్యోగులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండరాదని, వాటిని వ్యక్తం చేయడం సహించరాని నేరమని తలపోయడం పెత్తందారీ పోకడలకు పరాకాష్ట. ప్రభుత్వాలకి వంత పాడే కిరాయి రాతగాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వారు ఇపుడు వంత పాడటంతోనే సరిపుచ్చుకోడం లేదు. వేరెవరూ ప్రభుత్వ విధానాల మీద చిన్నపాటి వ్యాఖ్యనైనా చేయడానికి వీల్లేదని హుకుం జారీచేయడం పరమ హేయం.

భావజాలంపై దాడి
ఒకటీ రెండు పత్రికల్లో మొదలయిన ఈ ధోరణి అక్కడికే పరిమితం కాదు. జర్నలిస్టులలో సహజంగా వుండే స్వేచ్ఛాలోచన రీతికి ఇది ప్రమాదకరం. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి తెలుగునాట పత్రికా రచన, సాహిత్య వ్యాసంగం నిరంతరం ప్రశ్నల్ని కురిపించే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నది. పత్రికల యాజమాన్యాల విధానాలు ఏవైనా జర్నలిస్టులలో అధికభాగం (మొన్నమొన్నటి వరకు) వామపక్ష భావజాలంతో సన్నిహితంగా ఉండేవారు. ప్రశ్నించే ధోరణికి పట్టం కట్టేవారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి జంకేవారు కాదు. గద్దెలెక్కినవారి భజనపరులుగా వ్యవహరించేవారు స్వల్పం. పత్రికల విధానాలకు అనుగుణంగా పని చేసినా, వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడానికి వెరవలేదు. పాలకుల విధానాలని, చర్యలని అభిశంసించడానికి జంకలేదు. ఈ ప్రశ్నించే తత్వాన్ని అవసరార్థం పత్రికలు కూడా కొంతవరకు ప్రోత్సహించాయి. ఒకవైపున మీడియా బేహారులంతా కార్పొరేట్లకు సాగిలపడటం, మరోవైపున మీడియా సంస్థలన్నీ కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్ళిపోతుండటంతో భజన తప్ప ప్రశ్నలకు తావు లేని దైన్యం నెలకొన్నది.

భజనే పరమార్థమైన ధోరణి
ఇటీవల అయిదారు సంవత్సరాలుగా పాలకుల మాట జవదాటరాదన్న ధోరణితో మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తప్పుని తప్పుగా, నిజాల్ని నిజంగా చెప్పే రచనా సంవిధానం కుదించబడింది. ముఖ్యమంత్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పింది రాసుకోడమే తప్ప, నిజాల ఆధారంగా ప్రశ్నలు సంధించిన సందర్భాలు కనిపించవు. ఎవరయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించిన ముఖ్యమంత్రి ధోరణిని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు నిరసించలేదు. సమాచార శాఖ పంపిన ప్రెస్‌నోట్లు రాయడం తప్ప, వారి గణాంకాల్లోని, విధానాల్లోని, చర్యల్లోని అసంబద్ధతనీ, అబద్ధాలనీ ప్రశ్నించే సాహసం చేసిన పత్రికలు అరుదు.

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పత్రికా సమావేశాలే నిర్వహించరు. ప్రభుత్వ ప్రకటనలను యధాతథంగా జనాలకు రిపోర్టు చేయడమే తప్ప ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా చేస్తుందేమి లేదు. తానొవ్వక, నొప్పింపక చిన్నచిన్న మాటలతో చెప్పీచెప్పనట్టుగా కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. నలుగురికి వినిపించని ఆ సణుగుడు వల్ల ఉపయోగం లేదు. పార్లమెంటులో చర్చలే లేకుండా బిల్లులు ఆమోదించడంలోని నియంతృత్వ ధోరణిపై మీడియా ప్రశ్నలు కురిపించదు. ఏకపక్షంగా లాక్‌డౌన్‌ ప్రకటించి కోట్లమందిని ఇబ్బందుల పాల్జేసినా అధినేతని ‘బలమైన నాయకుడు’గా చూపించడానికే కసరత్తులు చేస్తారు. రైతుల బతుకుల్లో చిచ్చుపెట్టే వ్యవసాయ బిల్లుల్లోని కుట్రలు విప్పి చెప్పడానికి పత్రికలకీ, చానళ్ళకీ మనసురాదు. ఎవరయినా ఏదయినా చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ గొంతుని ఏదో ఓ మూలకు నెట్టేస్తారు. పాలకులకు కోపం తెప్పించని రీతిన వినయాన్ని, వినమ్రతనీ, వంగివంగి దణ్ణాలు పెట్టే నైజాన్ని పదాలకు అద్దడం కోసమే జర్నలిస్టుల రచనా కౌశలమంతా ఖర్చవుతున్న కాలమిది.

వార్తలు కాని వాటికి ప్రాధాన్యం
అసలైన వార్తల్ని తొక్కిపట్టాలంటే వార్తలు కాని వాటిని వార్తలుగా తెరమీదకు తీసుకురావాలన్న కుటిలవ్యూహం జర్నలిజంలో పెచ్చరిల్లింది. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, డిజిటల్‌ మీడియా అంతటా ఇదే ధోరణి. చిరంజీవి ఇల్లు ఎంత పెద్దగా ఉంటే ఎవరికేం పట్టింది? సిరివెన్నెల ఇంట్లో పెళ్ళయితే సామాన్య పాఠకుడికేం అవసరం? అనుష్క ప్రెగంట్‌ కావడం, కరీనా కపూర్‌ రెండో బిడ్డని కనబోవడం వంటి వార్తల సరంజామా మీడియాలో ప్రముఖంగా కనిపించడం గమనార్హం. అలాగే ఐపీఎల్‌లో ఏ జట్టు ఏ దశకు చేరిందో పదేపదే ఊదరగొట్టే వార్తలు ఎవరి మేలు కోసం? కంగనా రనౌత్‌కు ఇచ్చినంత ప్రచారం, వేలాది మంది రైతుల నిరసన ప్రదర్శనలకు ఇవ్వకపోవడం జాతీయ మీడియా సిగ్గుచేటయిన సరళికి నిదర్శనం. వార్తలు కాని వాటిని వార్తలుగా చేయడం ద్వారా అసలైన నిజాలకు, వార్తలకు పాతర వేయవచ్చన్న వ్యూహాత్మక విధానం కార్పొరేట్‌ మీడియా అనుసరిస్తున్నది. సినిమా పేజీలకో, స్పోర్ట్స్‌ పేజీలకో పరిమితం కావలసిన వార్తలు ప్రధాన వార్తలుగా చెలామణవడం విలువలకు పాతరేసిన జర్నలిజంలోని వికృతత్వం.

కరోనా కాలంలోనూ…
కరోనా విజృంభణకు సంబంధించిన అసలు వాస్తవాల్ని రాయడానికి మీడియా ప్రయత్నించలేదు. కరోనా సోకిన వారి లెక్కలు అందించడం తప్ప నిజానిజాలు తెలియజెప్పే కథనాలకి ఇచ్చిన ప్రాధాన్యం శూన్యం. చైనా మీద విషపూరితమైన దాడికి దారితీసే వార్తలకే అధిక స్థలాన్ని, కాలాన్ని కేటాయించాయి. అపార్థాలకీ, అబద్ధాలకీ, అపోహలకీ స్థానం కల్పించాయి పత్రికలు, చానళ్ళు. ఆస్పత్రుల క్రూర వాణిజ్యం మీద నోరు మెదిపింది లేదు. కరోనా పట్ల అవగాహన కల్పించడం కన్నా భయోద్వేగాల్ని ప్రేరేపించడానికి దారితీసిన వార్తలకే చోటు లభించింది.

వలసకార్మికుల వెతలు, ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల ప్రజల అవస్థలు పత్రికలకీ, చానళ్ళకీ పట్టలేదు. పాలకులు చెప్పిన మాటలు వల్లించారే తప్ప జనాల అగచాట్లని రాయలేదు, చెప్పలేదు. కోవిడ్‌-19 విపత్తులోనూ పాలకుల అడుగులకు మడుగులొత్తే వైఖరి ఎల్లెడలా కనిపించింది. ప్రజాస్వామ్యం పట్టుగొమ్మ అని చెప్పుకునే మీడియా బానిసతనం తేటతెల్లమైంది. ఈ దాస్యానికి అలవాటు పడి, పాలకులకు వినసొంపైన మాటల నగిషీలు చెక్కేందుకే జర్నలిస్టుల ప్రతిభాసామర్థ్యాలు ఉపయోగపడాలని ఆశించింది. జర్నలిస్టులు ఆలోచనలేని మరబొమ్మలుగా పరిణమించాలని, తాము ఇచ్చే కూలీడబ్బులకు మెదళ్ళు కూడా తాకట్టు పెట్టాలని మీడియా యజమానులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జర్నలిస్టుల పనితీరును పర్యవేక్షించే సూపర్‌వైజర్లుగా సంపాదకులు పరిణమించారు. ఈ క్రమాన జర్నలిస్టుల రాతల్ని ఎడిట్‌ చేయడం వరకే పరిమితం కాలేదు, వారి మీద పోలీసింగ్‌ బాధ్యతల్ని నెత్తికెత్తుకున్నారు. భారతీయ జర్నలిజంలో లొంగుబాటుతనం, నీతిమాలినతనం బాహాటంగా ప్రదర్శితమవుతున్న వైనమిది.

వ్యక్తిగతస్వేచ్ఛకు సంకెళ్ళు
అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన వారికి నిజానిజాలు రుచించవు. నిజం నిష్టురసత్యం. అయితే ఆ సత్యాన్ని చెప్పడానికి వెరవకపోవడమే జర్నలిజపు లక్షణం. ఇది ఒకనాటి విశ్వాసం. ఇప్పుడు అది గిడసబారుతున్న దృశ్యం నిత్యమూ, నిరంతరమూ చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఒక పత్రికలో పనిచేసే జర్నలిస్టులు ఎక్కడా కూడా పత్రిక విధానానికి భిన్నంగా మాట్లాడరాదని శాసిస్తున్నారు. ఒక అంశంలో ప్రభుత్వ విధానానికి విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే, దానిని క్రమశిక్షణా ఉల్లంఘనచర్యగా పాలకుల కొమ్ముగాసే యాజమాన్యం పరిగణిస్తున్నది. మొదటిసారి ఇది తగదని చెబుతుంది. రెండోసారి హెచ్చరిస్తుంది. మూడోసారయితే ఇంటికి పంపిస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమైన విధానమిది. అయితే ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి సాగనంపుతారు. ఈవిధంగా జర్నలిస్టుల భావాల నియంత్రణకు పనిగట్టుకుని దిగడం ఏ పరిణామాల ఫలితమో అర్థం చేసుకోవాలి.

సోషల్‌ మీడియా ప్రభావం అపారం
కాషాయ మూకలు, పాలకగణాల అనుకూల వ్యక్తులు, గుంపులు సోషల్‌ మీడియాని సైతం కబ్జా చేశాయి. అయినప్పటికీ దానిలో ఇతరుల అభిప్రాయాలకు కూడా చోటు లభిస్తున్నది. భిన్నాభిప్రాయాల గళాలకు లభించేది చిన్నపాటి ప్రచారమే. అది సైతం ఎంతో ప్రమాదకరమని పాలకులు, పాలక ప్రభువుల అనుయాయులైన పత్రికలు, చానళ్ళు భావిస్తున్నాయి. అందుకే తమవైపు నుంచి ‘చక్కదిద్దే’ చర్యలకు ఉపక్రమించారు. ప్రభువులకు నచ్చని అంశాలని పోస్టు చేసేవారిని అరెస్టు చేయడం, లేదా సంఘీయుల పేరిట బెదిరింపులకు దిగడం ఇప్పటికే అమలవుతున్నది. అయితే జర్నలిస్టులను నేరుగా లొంగదీయడం, వారిని కటకటాలకు వెనక్కి నెట్టడం అంత సలువు కాదు. కనుక యాజమాన్యాల వైపు నుంచి నెట్టుకు వచ్చే పనిని కొందరు బాహాటంగా, ఇంకొందరు గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. కొన్నిసార్లు నిజాల్ని మీడియా చెప్పకున్నా సోషల్‌ మీడియా చెబుతుంది. జర్నలిస్టులయితే మరింత శక్తివంతంగా చెప్పగలరు. కనుక తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి దొరికిన సోషల్‌ మీడియా వేదికల్ని నిజాయితీ గల జర్నలిస్టులు ఉపయోగించుకుంటారు. ఇలాంటి వారిని కట్టడి చేసే కుతంత్రం వర్తమాన మీడియా తెరపై నేరుగానో, దృశ్యాదృశ్యంగానే దర్శనమిస్తున్నది.

జీవనవిధానంపై దాడి
జర్నలిజం వృత్తి కాదు ప్రవృత్తి. అదొక జీవనవిధానం. నిర్ణీత పనిగంటలు సౌలభ్యం కోసమే తప్ప జర్నలిస్టులు నిరంతరం ఆన్‌డ్యూటీలో ఉంటారని ప్రసిద్ధ పత్రికావేత్తలు చెప్పేమాట. సామాజిక ధోరణులనీ, సమాజ గమనాన్ని అసంకల్పితంగానే గమనిస్తూ వార్తల్ని, వార్తాకథనాల్నీ అందించే దృష్టికోణం జర్నలిస్టులది. ఇందుకు అనుగుణంగా రూపొందే వారి జీవనవిధానంపై పెనుదాడి సరికొత్త పరిణామాల పరంపర. నిజానిజాలు రాసే, చెప్పే కలాల్నీ, గళాల్నీ మూసుకోమని చెప్పడం అసంగతం, భావస్వేచ్ఛని శిరోధార్యంగా భావించే వృత్తిగా, జీవనవిధానంగా జర్నలిజానికి ఇది మరణశాసనం.
తను చూస్తున్నది, వింటున్నది, అర్థం చేసుకొని అసలు ఉద్దేశాలను విశ్లేషించి చెప్పడానికి ప్రయత్నించే అవకాశం లేకపోతే జర్నలిస్టుగా పని చేయడం ఎందుకు? వృత్తిధర్మాన్ని అనుసరించలేనప్పుడు ఈ వృత్తిని ఎంచుకోవడం అవసరమా? మెదడునీ, మనస్సాక్షినీ, ఆలోచనలనీ తాకట్టు పెట్టడం ఆత్మవంచన కాదా? ఈపని చేయడం కన్నా ఇతరేతర వృత్తులు ఎంచుకోడం సబబేమో? ఈరకమైన ప్రశ్నలు పొడసూపితే మున్ముందు జర్నలిజం అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. అంతిమంగా నిజాలు చెప్పేవారు కరువయి వందిమాగధులు, వేనోళ్ళ పొగిడేవారే జర్నలిస్టులుగా చెలామణవుతారు. ఇంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం జర్నలిజానికి ఉంటుందా?

Courtesy Nava Telangana