– వారితో మాట్లాడితే రూ.25 వేల జరిమానా
– పనులకు పిలవద్దు, ఆటోల్లో ఎక్కించుకోవద్దని తీర్మానం
– సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి: కేవీపీఎస్‌

మెదక్‌/పెద్ద శంకరంపేట : అంబేద్కర్‌ విగ్రహాన్ని గ్రామంలో పెట్టాలన్నందుకు సుమారు 45 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. వారితో మాట్లాడితే రూ. 25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట్‌ మండలం బూరుగుపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దళితులు ఊర్లో అంబేద్కర్‌ విగ్రహం పెట్టాలనుకున్నారు. వ్యతిరేకించిన గ్రామస్తులు దళితుల కాలనీలోనే పెట్టుకోవాలని మండిపడ్డారు. దానికి దళితులు ససేమిరా అనడంతో ఆదివారం గ్రామస్తులంతా కలిసి దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. అంతేకాకుండా వారిని పనులకూ పిలవకూడదనీ, ఆటోల్లో ఎక్కించోకూడదని నిర్ణయం చేశారు. వీటిని దిక్కరించి వారితో ఎవరైనా మాట్లాడితే రూ.25 వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. విషయం తెలుసుకున్న కేవీపీఎస్‌, దళిత సంఘాల నాయకులు మంగళవారం బూరుగుపల్లిని సందర్శించారు.

ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ఠ్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌ మల్లేశంతో కలిసి గ్రామస్తులు దళితుల గ్రామ బహిష్కరణపై తీర్మానం చేయడం దారుణమన్నారు. ఎస్‌ఐ అగ్రవర్ణాలతో కుమ్మకై దళితులపై మండిపడుతున్నాడని ఆరోపించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సదరు విషయంపై వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా అదికారులు గ్రామాన్ని సందర్శించి బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల ఛలో బూరుగుపల్లి నిర్వహిస్తామని హెచ్చరించారు. డీబీహెచ్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సంగమేశ్వర్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు తుకారాం, రాష్ఠ్ర కమిటీ సభ్యులు కోటారి నర్సింహులు, జిల్లా నాయకులు బస్వరాజ్‌, ఎంఆర్పీఎస్‌, టీఎంఆర్పీఎస్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.