• హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ
  • యూజీ, పీజీ కోర్సుల పరీక్షలపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశం

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎంసెట్‌ సహా తెలంగాణలో జరిగే అన్ని ప్రవేశ పరీక్షల(సెట్ల)ను వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హామీ ఇచ్చింది. బుధవారం నుంచి నిర్వహించాల్సిన పాలిసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎంసెట్‌, పీఈడీ సెట్‌లను వాయిదా వేస్తున్నామని, షెడ్యూలును జులై 1న ప్రకటిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌, ఇతర డిప్లమో కోర్సుల పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ కోర్సుల పరీక్షలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ఉన్నత విద్యాశాఖ, ఉస్మానియా యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు జులై 9కి వాయిదా వేసింది.  జులై 1 నుంచి సెట్లతో పాటు 4, 11, 12 తేదీల్లో టైప్‌రైటింగ్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ కోర్సుల పరీక్షలు నిర్వహించడాన్ని సవాలుచేస్తూ హైదరాబాద్‌కు చెందిన బి.వి.నర్సింగ్‌రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కరోనా సమయంలో పరీక్షలు రద్దుచేసి ప్రమోట్‌ చేయాలని కోరారు.

ధర్మాసనం స్పందిస్తూ మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్న విషయాన్ని పత్రికల్లో చూశామని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుని 75శాతం ప్రాంతంలో అమలుచేస్తే పరీక్షలు ఎలా సాధ్యమవుతాయని అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రశ్నించింది. రెండు విడతల్లో పరీక్షలు సాధ్యం కాదంటూ పదో తరగతి పరీక్షలను రద్దుచేశారని, అలాగే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించింది. ఏజీ సమాధానమిస్తూ లాక్‌డౌన్‌పై ఒకటిరెండు రోజుల్లో మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని, మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరారు. జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి ప్రతిపాదనను ఉన్నత విద్యామండలికి పంపామన్నారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

యూజీలో 7 సెమిస్టర్‌ల మార్కులు, 8వ సెమిస్టర్‌ను కలిపి సగటు మార్కులు లెక్కించి గ్రేడ్‌లు కేటాయిస్తామని ప్రతిపాదించామని, విద్యార్థులు అంగీకరించకుంటే రాతపరీక్ష నిర్వహిస్తామని చెప్పామన్నారు. డిగ్రీ పరీక్షలపై ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉందని ఉన్నత విద్యాశాఖ తరఫు న్యాయవాది చెప్పారు. డిగ్రీలో మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకుందని, చివరి సంవత్సరానికి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ..ఆ వివరాలను అందజేశారు.

* తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Courtesy Eenadu