• సూర్యాపేట ఎస్పీపై బదిలీ వేటు
  • హుజూర్‌నగర్‌పై ఈసీ నిర్ణయం
  • బీజేపీ ఫిర్యాదుపై తక్షణ స్పందన
  • వ్యయ పరిశీలకుడిగా బాలకృష్ణన్‌
  • నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరు
  • ‘శివకుమార్‌’ను పట్టింది ఆయనే

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాల ముందు ఎన్నికల సంఘం టీఆర్‌ఎ్‌సకు రెండు షాక్‌లు ఇచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన్ను హుజూర్‌నగర్‌ ఎన్నికల విధుల నుంచి తప్పిండచమే కాకుండా ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసింది. వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్‌ను(2012 బ్యాచ్‌ ఐపీఎస్‌) ఎంపిక చేసి, సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది. రెండో షాక్‌గా… ఆదాయ పన్ను శాఖలో ‘సింగం’గా పేరుగాంచిన బి.ఆర్‌.బాలకృష్ణన్‌ను హుజూర్‌నగర్‌కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా నియమించింది. ఆయన ఎన్నికల్లో డబ్బు పంపిణీని అడ్డుకోవడంలో కడు సమర్థుడు. ఆయన ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా రెండు శాసనసభ ఎన్నికల్లో భారీఎత్తున డబ్బులు పట్టుకొని ఏకంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. 1983 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన బాలకృష్ణన్‌ పెద్దనోట్ల రద్దు సమయంలో కర్ణాటక, గోవాల్లో 4300 కోట్ల రూపాయల నల్లధనాన్ని కక్కించారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ప్రస్తుతం రిటైరయినా ఎన్నికల సంఘానికి సేవలు అందిస్తున్నారు. వెంకటేశ్వర్లును తప్పించడం, బాలకృష్ణన్‌ను నియమించడం… ఈ రెండు పరిణామాలతో అధికారపక్షానికి ఉప ఎన్నికల్లో ఉండే అడ్వాంటేజీకి గండిపడినట్లేనని భావిస్తున్నారు.

ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షించడం, ఇంటెలిజెన్స్‌ అందించే వివరాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవడం, వ్యక్తులు, పార్టీలు ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర బహుమతులు ఇస్తున్నారని సీవిజిల్‌, హెల్ప్‌లైన్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం వ్యయ పరిశీలకుల బాధ్యత. ఇలాంటి చోట్ల గట్టి అధికారులను వేస్తే రాజకీయ పార్టీలకు ఉక్కపోత తప్పదు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మురళీధర్‌రావు, వివేక్‌తో కూడిన బృందం సీఈసీ సునీల్‌ ఆరోరాను కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే ఎన్నికల సంఘం స్పందించి రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఈ రెండు నిర్ణయాల ద్వారా ఈసీ ఎన్నికలు తన అదుపాజ్ఞల్లోనే జరుగుతున్నాయని నిరూపించింది. హుజూర్‌నగర్‌లో నియమించిన ఇద్దరు అధికారులూ తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్ణయంపై లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

భూమన్న అరెస్టే కారణం?: సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ నేతృత్వంలో సర్పంచులు నామినేషన్లు వేయడానికి హుజూర్‌నగర్‌కు రాగా, నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా వారిని పట్టణ పరిసరాల్లో పోలీసులు అడ్డుకున్నారని, భూమన్నను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించారని బీజేపీ ఆరోపించింది. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని, అందుకే భూమన్నను అరెస్టు చేశారని విమర్శించింది. పోలీసుల సహకారంతో టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎస్పీని బదిలీ చేసినట్లు తెలిసింది. జిల్లా అధికార యంత్రాంగం వ్యవహార శైలిపై గత నెలలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మర్రి శశిధర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

 ప్రభుత్వానికి ఎదురుదెబ్బే? : పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డి స్వయంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హుజూర్‌నగర్‌లో గెలుపొందాలని పట్టుదలతో ఉంది. సీనియర్‌ నేతలను ఇన్‌చార్జులుగా నియమించారు. ఎస్పీతో పాటు కోదాడ డీఎస్పీ, హుజూర్‌నగర్‌ సీఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యహరిస్తూ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉత్తమ్‌ ఇటీవల బాహాటంగా విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీపైనే బదిలీ వేటు పడటం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

Courtesy Andhrajyothi…