పాక్‌ సరికొత్త నాటకం

ఇస్లామాబాద్‌: జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు కనిపించడంలేదని పాకిస్థాన్‌ ప్రకటించింది. గతేడాదిమే1న మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్టు ఐరాస భద్రతా మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని పాక్‌ సరికొత్త నాటకానికి తెరలేపింది. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ అటు ప్రపంచ దేశాల నుంచి వస్తోన్న ఒత్తిళ్లతో పాటు స్వదేశంలోనూ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాక్‌ సరికొత్తగా బుకాయింపు ధోరణి అనుసరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఉగ్రసంస్థలకు నిధులు సమాకూర్చిన కేసుల్లో ముంబయి పేలుళ్ల మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయీద్‌కు గతవారం పాక్‌ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించిన కొద్దిరోజుల్లోనే మరో సంచలన ప్రకటన చేసింది. దేశ భద్రత బలగాల రాడార్‌ నుంచి తప్పించుకున్నాడని, ఎక్కడికెళ్లాడో తెలియట్లేదనే విషయాన్ని పాక్‌ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (పీఏటీఎఫ్‌)కు అధికారికంగా లేఖ రాసింది. తాము మసూద్‌ అజర్‌, అతని కుటుంబ సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు వెల్లడించింది. కొద్దిరోజుల నుంచి మసూద్‌ అజర్‌ గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ కనిపించట్లేదని స్పష్టం చేసింది.

మసూద్‌ అజర్‌ను గాలించడానికి ప్రత్యేక బలగాలను నియమించినట్టు పేర్కొంది. జైషె మహ్మద్‌ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా భావిస్తోన్న ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ సహా పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో అతని కోసం గాలిస్తున్నట్టు ఇమ్రాన్‌ సర్కార్‌ తెలిపింది. ఈ విషయమై సైనిక సాయం కోరినట్టు తెలిపింది. పాక్‌ చేసిన ప్రకటన పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌, ప్రపంచ దేశాల కండ్లు గప్పడానికి పాక్‌ ప్రభుత్వం అతణ్ని దాచి పెట్టిందని, కనిపించట్లేదంటూ బుకాయిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు ఉన్న మసూద్‌ అజర్‌ సహా అతని కుటుంబ సభ్యులు కనిపించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Courtesy Nava Telangana