సంచిలోంచి పిల్లి బయటకు వస్తున్నది బీజేపీ నాయకత్వం ముసుగు తొలగుతున్నది. టీఎస్‌ ఆర్టీసీలో కేంద్రం వాటా గురించీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలకు కేంద్రం అనుమతి విషయంలోనూ, కేంద్రం చేసిన చట్టమే అమలు చేస్తున్నానన్న కేసీఆర్‌ ప్రకటన విషయంలోనూ కేంద్రం వివరణ ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు హైకోర్టులో విచారణ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ చట్టపరంగా విభజన జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. టీఎస్‌ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1950, సెక్షన్‌ 47(ఎ) ప్రకారం ఆర్టీసీని పునర్నిర్మించాలన్నా, విభజించాలన్నా కేంద్రం అనుమతి పొందాలన్నది. ఇంతవరకు అనుమతి పొందలేదని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కేంద్రం వాటా కూడా ఆటోమేటిక్‌గా టీఎస్‌ ఆర్టీసీకి బదిలీ జరగదని తేల్చింది. 2016 ఏప్రిల్‌ 22 నుంచి టీఎస్‌ఆర్టీసీ రంగంలోకి వచ్చింది. గత 35రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాదనలు బహిరంగంగానే చేస్తున్నారు. ఏకపక్షంగానే ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తున్నారు. అయినా.. ఇంత కాలం మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది? కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా టీఎస్‌ ఆర్టీసీని తాము చట్టపరంగా గుర్తించటం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయం రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజరు లేఖ రాసేంతవరకూ గడ్కరీకి గుర్తుకు రాలేదా? ఈ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ అదుపులో ఉన్నంత కాలం చూసీ చూడనట్టు ఉన్నారన్నది స్పష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కేంద్రాన్ని నిలదీయటం, కోర్టులో సమాధానం చెప్పక తప్పని స్థితి ఏర్పడటంతో ఇప్పుడు నోరు విప్పారు. సాగినంత కాలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామన్న ధోరణి తప్ప ప్రజల ప్రయోజనం కేంద్రానికి కూడా ఏమాత్రం పట్టలేదు.
ఇంకా దాపరికం కొనసాగిస్తూనే ఉన్నది. రెండు మాసాల కింద కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారువాహనాల సవరణ చట్టం గురించి ఇప్పటికీ నోరు మెదపలేదు. ఆ సవరణే చేయకపోతే.. సగం ఆర్టీసీని ప్రయివేటీకరిస్తానని ఇంత బాహాటంగా మాట్లాడే అవకాశమే ఈ ముఖ్యమంత్రికి ఉండేది కాదు. కేసీఆర్‌ చేతికి ఆయుధమిచ్చి కేంద్రం తమాషా చూస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం దాగుడు మూతలాడుతున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము మద్దతు ఇస్తున్నామని మభ్యపెడుతున్నారు. కేంద్ర చట్టం గురించి నిలదీస్తే… ”కేంద్రం నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదా?” అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము కేంద్రంలో చట్టం చేయకపోతే ఇక్కడ పాలకులకు ఆయుధం దొరికేది కాదు కదా! కేసీఆర్‌ ధోరణి మీద విమర్శలే తప్ప ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో బీజేపీ వైఖరి చెప్పటం లేదు. బీజేపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర చట్టాన్ని పక్కనబెట్టే విధంగా తమ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఈ పని చేయకపోగా, అసలు సమస్యను పక్కదారులు పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు ఆ పనిలోనే నిమగమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు చర్చనీయాంశం కాకుండా, ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టకుండా, తనకూ.. పోలీసులకూ మధ్య సమస్యగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కేంద్రాన్ని మరో విషయంలో నిలదీసింది. చట్టప్రకారం ఆర్టీసీని విభజించేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. దీనికి మోడీ ప్రభుత్వం జవాబు చెప్పాలి. హైకోర్టు మరో అంశం ముందుకు తెచ్చింది. ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేస్తే ఆర్టీసీ విభజన అంశమే తెరమీదకు రాదని న్యాయస్థానం లేవనెత్తింది. ఏపీఎస్‌ ఆర్టీసీ ఆస్తులూ, అప్పులతో సంబంధం లేదు కదా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర పాలకులు సమాధానం చెప్పాలి.

మరోవైపు కేంద్రం ఇక్కడ గవర్నర్‌ కార్యాలయాన్ని ప్రగతి భవన్‌కు సమాంతర రాజకీయ కేంద్రంగా మలిచే ప్రయత్నంలో ఉన్నది. క్యాబ్‌ డ్రైవర్లు సమ్మెనోటీసు ఇచ్చిన సందర్భంగా గవర్నర్‌ జోక్యం చేసుకున్న తీరే ఇందుకు నిదర్శనం. ఆర్టీసీ సమ్మెను కూడా ఇందుకోసం వాడుకుంటున్నారు. సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించనప్పుడు గవర్నర్‌కు వినతిపత్రాలివ్వటం ఆనవాయితీ. క్యాబ్‌ డ్రైవర్లు సమ్మె ప్రారంభించనే లేదు. సమ్మె నోటీసును అవకాశంగా తీసుకుని, యూనియన్‌ నాయకులను పిలిపించుకుని గవర్నర్‌ సర్దిచెప్పారు. ఆర్టీసీ సమ్మె సమయంలో క్యాబ్‌ డ్రైవర్లు కూడా సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారనీ, సమస్యల పరిష్కారానికి తాను తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రయత్నం ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం చేయలేదు. మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వ ధోరణి, బీజేపీ నాయకత్వం ధోరణీ తమ రాజకీయ ప్రయోజనం చుట్టే తిరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు చేయనిచ్చి, ప్రజలలో అప్రతిష్టపాలు కానిచ్చి, రాజకీయంగా లాభపడాలన్న ధోరణే తప్ప, కార్మికుల సమస్యలు పరిష్కరించే లక్ష్యం లేదు. ప్రజలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించే ప్రయత్నం లేదు.

Courtesy Navatelangana..