తీవ్ర ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రియలు
తండ్రి కడసారి చూపునకు నోచుకోని అమృత
శ్మశాన వాటికలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు
అమ్మ దగ్గరకు వెళ్లలేను.. నా వద్దకొస్తే వదులుకోను
ఆస్తిపై ఆశ లేదు.. అమ్మకు బాబాయితో హాని: అమృత
ఆస్తి కోసమే అమృత నాటకాలు: బాబాయి శ్రవణ్‌

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 9: ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు.. తిరునగరు మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరిగాయి. మారుతీరావు పార్థివదేహాన్ని కడసారిగా చూసేందుకు వెళ్తానని, తనకు రక్షణ కల్పించాలని ఆయన కుమార్తె అమృత పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమెను బందోబస్తు మధ్య శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అమృతను.. ఆమె బాబాయి కూతుళ్లు, బంధువులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్‌ అమృత’ అంటూ నినాదాలు చేశారు. తోపులాటలో కింద పడిపోబోతున్న అమృతను మహిళా పోలీస్‌ సిబ్బంది పట్టుకున్నారు.

మారుతీరావు అనుచరులు, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో..  అమృతను పోలీస్‌ వాహనంలో ప్రణయ్‌ ఇంటికి చేర్చారు. అనంతరం ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు.  తండ్రి ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూతురిగా బాధపడుతున్నానని.. కడసారి చూపు కోసం వెళితే బాబాయి శ్రవణ్‌ కుమార్తెలు తనను గెంటేశారని తెలిపారు. ‘ఒంటరైన అమ్మ వద్దకు వెళ్లలేను.. నావద్దకొస్తే వదులుకోను’ అని పేర్కొన్నారు. తన తండ్రి ఆత్మహత్యపై ప్రశ్నించగా.. మనిషిని చంపించేంత ఽధైర్యం ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు.

హత్య కేసు వాదించేందుకు సరైన న్యాయవాది దొరక్కపోవడం, ఆస్తి పంపకాలు, డబ్బుల సమస్య, కూతురు దూరమైందన్న బాధ, సుపారీ హంతకుల ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  అభిప్రాయపడ్డారు. ప్రణయ్‌ని చంపినందుకు చట్టబద్ధంగా శిక్షపడితే సంతోషించేదాన్నని, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కోరుకోలేదని చెప్పారు. ప్రణయ్‌ మృతినే తట్టుకున్న తాను తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేనా అని అమృత ప్రశ్నించారు. తనకు అండగా నిలిచిన ప్రణయ్‌ కుటుంబాన్ని వీడి వారితో (మారుతిరావు కుటుంబం)కలిసి ఉండనని తేల్చిచెప్పారు. భర్తను కోల్పోయి తనలాగే ఒంటరైన తల్లి తన వద్దకు వస్తానంటే ఆమెతో కలిసి వేరే చోట ఉండి సూసైడ్‌నోట్‌లో రాసిన తండ్రి చివరి కోరిక తీరుస్తానన్నారు.

తన బాబాయి ముఖంలో అన్నను పోగొట్టుకున్న బాధ కనిపించలేదని.. ఆయనతో తన తల్లి ప్రాణానికి ముప్పు ఉండొచ్చని ఆందోళన వెలిబుచ్చారు. మారుతీరావు ఆస్తులపై ఆశ లేదని స్పష్టం చేశారు. ప్రణయ్‌ హత్య తర్వాత తల్లి తనతో బాబు పుట్టాక మాట్లాడారని.. బాబును చూపించాలని కోరితే నిరాకరించానని, ఆ తర్వాత మళ్లీ తాము మాట్లాడుకోలేదని తెలిపారు. ఇక.. తండ్రి ఆస్తి కోసమే అమృత కొత్త నాటకాలు మొదలుపెట్టిందని ఆయన బాబాయి శ్రవణ్‌ ఆరోపించారు. నిన్నటి వరకు తండ్రి చావును కోరుకున్న అమృతకు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.

తన వల్ల ఎవరికైనా అపాయముందంటే కోర్టు విధించే ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైసా కూడా తనకు అవసరం లేదని, ఎవరైనా అప్పున్నట్లు కాగితాలు చూపిస్తే తీరుస్తానని పేర్కొన్నారు. దశదిన కర్మలు పూర్తయ్యాక వచ్చి ఆస్తి, లెక్క చూసుకోవచ్చన్నారు. కాగా.. మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా డ్రైవర్‌ను, మారుతీరావు కుటుంబసభ్యులను విచారించేందుకు సిద్ధమయ్యారు.

అమృతకు స్వల్ప అస్వస్థత
మిర్యాలగూడ అర్బన్‌: తండ్రి పార్థివదేహాన్ని చూసేందుకు శ్మశానవాటిక వద్దకు వెళ్లొచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడే క్రమంలో అమృత అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆమె స్పృహతప్పింది. వెంటనే ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నాక వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. సోమవారం ఏకధాటిగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె లోబీపీకి గురైనట్టు సమాచారం.

Courtesy Andhrajyothi