మన చంద్రన్న డిసెంబర్ 12న రాత్రి గుండెపోటు మూలంగా మరణించారు. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చంద్రన్నను కుటుంబ సభ్యులు హాస్పటల్ కి తీసుకెళ్ళారు. కాని అప్పటికే శ్వాస ఆగిపోయింది. చంద్రన్న మరణం దేశంలోని ప్రజాస్వామిక ఉద్యమానికి తీరని లోటు.

చంద్రన్నది పీడిత వర్గ, కుల పునాది. 1945, మే 5న ఇప్పటి యాదాద్రి జిల్లాలోని టంగుటూరు గ్రామంలో పేద, దళిత కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోనే సాగింది. 6వ తరగతి నుండి 11వ తరగతి దాకా జనగాంలో ఎస్సీ హాస్టల్లో వుంటూ చదివాడు. ఆ కాలంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అతి  దారుణంగా వుండేది. మెరుగైన సదుపాయాల కొరకు, పండగ రోజుల్లో ప్రత్యేక ఆహారంకై చంద్రన్న విద్యార్థులని సమీకరించారు, కదిలించారు. పిన్న వయస్సులోనే ప్రశ్నించడం, ధిక్కరించటం మొదలైనది. దసరా పండుగ వస్తే గ్రామంలో జమ్మి చెట్టు వద్ద  పోగయ్యేవారు గ్రామస్తులు. అయితే జమ్మి ఆకులు తెంపే హక్కు దళితులకు లేదు. రెడ్డి దొరలు పడవేసిన ఆ బంగారాన్నే దళితులు ఏరుకోవాలి. కుల పీడనకి ఇదో రూపం. దీన్ని ధిక్కరించి చంద్రన్న ఓ మారు చెట్టెక్కాడు. ఆ దొరలు చంద్రన్న కుటుంబాన్ని బెదిరించారు..

1964లో చంద్రన్న హైదరాబాదుకు వచ్చారు. రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం నుండి వచ్చిన చంద్రన్న, రోజు కూలిగా రైల్వేలోని పార్శిల్ సర్వీసులో చేరాడు. నెలకు 25 రూపాయల కూలిగా పనిచేశాడు. లాలాపేట శాంతినగర్ బస్తీలో వుండేవారు. 1969 నుండి 1971 వరకు టెలిఫోన్స్ శాఖలో రోజు కూలీగా పనిచేశారు. భూమిని తవ్వటం, స్థంభాలు పాతటం వంటి పనులు చేశారు. ఇదే కాలంలో ఇళ్ళ స్థలాలకు జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. సున్నం చెరువు బస్తీలో గుడిసెలు వేశారు. 1976లో వీటికి పట్టా హక్కులు రావటంలో చంద్రన్న పాత్ర ముఖ్యమైనది. ఈ పోరాటంలో చంద్రన్నను అరెస్టు చేసి కేసు బనాయించి జైలు పాల్టేశారు. జైలులో మెరుగైన సదుపాయాల కొరకు చంద్రన్న నిరాహార దీక్ష చేశారు.

ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో చంద్రన్న మార్కిస్టు-లెనినిస్టు రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ కాలంలోనే సి.పి. గారి నాయకత్వాన వున్న పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటికీ హైదరాబాదు నగరంలో కొంత పునాది వున్న పార్టీ. 1978లో చంద్రన్న ఐడీపీఎల్ కంపెనీలో హెల్పర్ గా చేరారు. చంద్రన్న ట్రేడ్ యూనియన్ జీవితం ఇక్కడ నుండి ప్రారంభమైనదని చెప్పుకోవచ్చును. ఇదే సంవత్సరంలో ఐఎఫ్ టీయు గౌహతిలో ఏర్పడింది. ఐడీపీఎల్ లో చంద్రన్న నాయకత్వాన ఐఎఫ్ టీయు నిర్మాణమైంది. ఏఐటీయుసీ అనుబంధ సంఘంలో పనిచేస్తూనే, ఐఎఫ్ టీయు కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించారు. కంపెనీలో జరిగిన కార్మిక పోరాటాల్లో చంద్రన్న ముఖ్యుడు. ఐఎ టీయు నాయకుడిగా చంద్రన్నకి నగరంలో గుర్తింపు రావటమే గాక, రాష్ట్ర బాధ్యతలు కూడా చేపట్టారు. నగర పార్టీ నిర్మాణంలో కార్మిక వర్గ పునాది నుండి వచ్చిన సభ్యుల్లో చంద్రన్న తొలి తరానికి చెందిన వారు.

1992లో రాష్ట్రంలో కొన్ని కార్మిక సంఘాల విలీనంతో ఏర్పడ్డ ఏఐఎఫ్ టీయుకి ముఖ్య బాధ్యతల్లో వున్నారు. నగర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 2005 సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చల్లో జనశక్తి పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో అనేక సంఘాలను ఏర్పాటు చేశారు. గత పది సంవత్సరాలు ఏ రాజకీయ నిర్మాణంలో లేక పోయినప్పటికి విప్లవ భావాలకి దూరంగా లేడు. విప్లవోద్యమంలో తలెత్తిన అనేక చీలికలని ప్రశ్నించిన వారిలో చంద్రన్న ఒకడు. ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకి జవాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. స్వతంత్రంగా అసంఘటిత రంగ కార్మికులని సమీకరించే ప్రయత్నం చేశారు.

చంద్రన్న స్వాభావికంగానే సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి. అదే సమయంలో అనేక విషయాలలో నిశ్కర్మగా వుండేవారు. చంద్రన్న ఒక సాదా, సీదా మనిషి. కుట్రలు, కుయుక్తులు తెలియని మనిషి. వాటి నుండి దూరంగా వున్న వ్యక్తి. మంచి కలలు గన్న మనిషి. దోపిడి, పీడనలు లేని సమాజానికై పోరాడిన మనిషి. ఆ కలలని సాకల్యం చేసే మార్గంలో పయనిద్దాం. ఇదే చంద్రన్నకు అసలైన నివాళులు అర్పించటం.

తేది: 22.12.2019 ఉదయం : 10 గం.ల నుండి..
స్థలం : లలితా నగర్ కమ్యూనిటి హాల్, హైదరాబాద్

చంద్రన్న బంధు మిత్రులు,
ప్రచురణకర్త : ప్రసాద్