తడిసి మోపెడవుతున్న వివాహ ఖర్చులు
ప్రపంచంలో భారత్‌కు రెండో స్థానం
ఏటా రూ.3 లక్షల 50 వేల కోట్లు
ఏడాదిలో పెరిగిన వెడ్డింగ్‌ అప్పులు 30 శాతం
మెట్రో నగరాల్లో అధికం

న్యూఢిల్లీ: సంప్రదాయాలు పాటించేవారైనా, పాటించనివారైనా ఆధునిక యువత తమ పెండ్లిళ్ల విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. తమ ఆశలకు తగినట్టుగా పెండ్లి వేదిక నుంచి ఇతర ఏర్పాట్ల వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. సంప్రదాయిక పెండ్లిళ్లలో పలు కార్యక్రమాలు కొన్ని రోజులపాటు జరిగినా, ప్రధాన వేడుక ఒక్క రోజే.. కానీ, ఆ ఒక్కరోజు కోసం వధువు లేదా వరుడు, వారి బంధువులు, స్నేహితులు చేయాల్సిన ఏర్పాట్ల కోసం కానున్న ఖర్చులు, వగైరా ముందస్తుగానే సిద్ధం చేసుకుంటారు.

కొన్ని సందర్భాల్లో తాహతుకు(ఆర్థిక స్థోమతకు) మించి ఖర్చు చేయొద్దన్న పెద్దల మాటల్ని కూడా నేటి యువతరం పట్టించుకోవడం లేదు. దాంతో, అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా పెండ్లి వేడుకలు జరుగుతున్నాయి. పట్టణాలు,నగరాల్లో పెండ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్న యువకుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాల్లో వెల్లడైంది. ప్రపంచంలోనే పెండ్లిళ్ల కోసం అతిగా ఖర్చు చేసే రెండో దేశంగా భారత్‌ ఘనకీర్తినందుకుంటోంది. ఏటా భారత సమాజం పెండ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చు 5000 కోట్ల డాలర్లు(రూ.3,50,000 కోట్లు)గా అంచనా. అమెరికాలో ఈ ఖర్చు 7200 కోట్ల డాలర్లు(రూ.5,04,000 కోట్లు) అని అంచనా. డబ్బుకు కొరతలేని ధనవంతులు తమ అభిరుచికి తగినట్టుగా ఖర్చు చేస్తున్నారు. యువకులు ప్రయివేట్‌ లేదా ప్రభుత్వ ఉద్యోగులైతే తల్లిదండ్రులపై ఆధారపడకుండా అప్పులు చేసైనా తమ ఆలోచనలకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండియా లెండ్స్‌ నివేదిక ప్రకారం 2018-19తో పోలిస్తే 2019-20లో పెండ్లిళ్ల కోసం అప్పులు చేసినవారి సంఖ్య 30 శాతం పెరిగింది.

ఢిల్లీ, ముంబయి,బెంగళూరులాంటి మహానగరాల్లో పెండ్లిళ్ల కోసం అప్పులు చేసినవారి సంఖ్య 46 శాతం పెరగగా, చిన్న పట్టణాల్లో 18 శాతం పెరిగింది. ఇందులోనూ లింగ వ్యత్యాసముండటం గమనార్హం. 2019-20లో పెండ్లిళ్ల కోసం అప్పులు చేసినవారిలో పురుషులు 58 శాతం కాగా, మహిళలు 42 శాతం. వెడ్డింగ్‌ లోన్స్‌ ఏడాదిలో పెరుగుదల రేట్‌ మెట్రో నగరాల్లో ఇలా ఉన్నది: జాతీయ రాజధాని ప్రాంతం(ఢిల్లీ) 98 శాతం, కోల్‌కతా 67, ముంబయి 51, బెంగళూరు 44, చెన్పై 17 శాతంగా నమోదైంది. టూటైర్‌ నగరాల్లో చూస్తే: లక్నో 39 శాతం, విశాఖపటట్నం 39, ఇండోర్‌ 28 శాతం, జైపూర్‌ 18 శాతం, అహ్మదాబాద్‌ 14 శాతంగా నమోదైంది. అప్పులు లక్షల్లో తీసుకుంటున్నారు. నెలసరి వేతనం కాస్త ఎక్కువగా ఉండేవారు రూ.30 లక్షల వరకూ అప్పులు చేస్తున్నారు. ఏటేటా పెండ్లి ఖర్చులు పెరిగిపోవడమే ఇందుకు కారణం.

సంప్రదాయిక కార్యక్రమాల కోసం చేసే తప్పనిసరి ఖర్చులతోపాటు వారివారి ఆకాంక్షలకనుగుణంగా చేసే ఖర్చులు అదనం. ఆభరణాలు, ఖరీదైన దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వగైరా కోసం చేసే ఖర్చులు తడిసి మోపెడైనట్టుగా పెండ్లి ఖర్చుల్ని పెంచేస్తున్నాయి. పెండ్లిళ్ల కోసం అయ్యే కనీస ఖర్చులు సైతం మధ్య తరగతి, పేద కుటుంబాలవారికి, ముఖ్యంగా ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితే. ఎంత పేద కుటుంబమైనా కొన్ని సంప్రదాయిక ఖర్చులతోపాటు అతిథులకు భోజన ఏర్పాట్లు చేయాల్సిందే..తెలుగు రాష్ట్రాల్లో చూస్తే శాకాహారులు తక్కువే. పెండ్లి అంటే మాంసాహారం ఉండాల్సిందే. ప్రస్తుతం మాంసం ధర కిలో రూ.600కు పైమాటే. అనుకున్నరీతిలో భోజన ఏర్పాట్లు చేయాలన్నా లక్షల్లో ఖర్చు చేయాల్సిందే..

Courtesy Nava Telangana