రెడ్డి శంకరరావు

టీవల తరచూ ‘మాన్సాస్‌’ పేరు వినబడుతోంది. సంస్థ కింద వున్న భూముల వివాదాలు, భూ హరణాలు, ఆస్తుల దుర్వినియోగాలు అందుకు కారణంగా వున్నాయి.

‘మహారాజ అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ (మాన్సాస్‌)ను 1958లో ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ కింద 14 విద్యా సంస్థలతో పాటు 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రైతుల వద్ద సాగులోను, కొన్ని వివా దాల్లోనూ ఉన్నాయి. ప్రధానంగా సింహాచలం దేవ స్థానం పరిధిలోనూ, కోటిపల్లిలో ఉన్న భూములు రైతులకు మాన్సాస్‌ ట్రస్టుకి మధ్య వివాదం నడుస్తున్నాయి.

రికార్డుల ట్యాంపరింగ్‌
విద్యా సంస్థల నిర్వహణ నిమిత్తం విశాఖ జిల్లా లోనే సుమారు 2000 ఎకరాల భూమిని మాన్సాస్‌ ట్రస్టుకు కేటాయించారు. అందులో 378 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు ట్యాంపరింగ్‌ అయ్యాయి. భూములు కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు వివరాలు నమోదు చేశారు. అయితే ట్రస్టు భూములను ప్రయివేటు వ్యక్తులకు ఎవరు అమ్మారు? రికార్డులు ఎలా ట్యాంపరింగ్‌ చేశారన్నది పెద్ద ప్రశ్న. ఏమైనా ట్రస్టు భూములు గోల్‌మాల్‌ అయ్యాయన్నది వాస్తవం. ఈ భూములు విలువ సుమారు రూ.400 కోట్లు పైబడి ఉంటుంది.

మెడికల్‌ కాలేజి పేరిట భూములు స్వాహా
2015లో అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రి అయ్యాక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు బదులు మాన్సాస్‌ వైద్య కళాశాల నిర్మిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారు. 2015 జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. దీంతో మాన్సాస్‌ మెడికల్‌ కళాశాల నిర్మాణం పేరుతో 490 ఎకరాలను సంస్థ అమ్మకానికి పెట్టింది. ఆ బాధ్యతను ‘ఉడా’కి అప్పజెప్పారు. కాని ‘ఉడా’ని పక్కనపెట్టి తమ అనుచరగణంతో కొంతమంది పెద్దలు తక్కువ ధరకే భూములు కొట్టేశారనే అభియోగం వచ్చింది. విశాఖ జిల్లాలో భీమిలి మండలం చిప్పాడలో 84 ఎకరాలు, బాకూరపాలెం వద్ద 30 ఎకరాలు…మొత్తంగా 114 ఎకరాలు విక్రయించారు. ఇందులో 11 ఎకరాలు భూమిని ఎకరా రూ. 1.1 కోట్ల చొప్పున…మిగతా 103 ఎకరాలు రూ. 40 నుండి రూ. 45 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి ఇక్కడ ఎకరా కనీసం రూ.6 కోట్లు వరకు మార్కెట్‌ విలువ ఉంది. ఇక విజయనగరం సంతపేట వార్డు రామానాయుడు రోడ్‌లో 1400 చదరపు గజాలు…గజం రూ. 30,200 చొప్పున విక్రయించారు. ఇలా సుమారు రూ. 400 కోట్ల వరకు భూములు విక్రయించగా వచ్చిన సొమ్ము ఏమైందనేది కోటి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అంతా అయ్యాక మాన్సాస్‌ వైద్య కళాశాలను నిర్మించలేమని ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు గారు ప్రకటించారు. మెడికల్‌ కళాశాల పేరుతో ట్యాంక్‌బండ్‌ కింద ఉన్న 48 ఎకరాలకు సంబంధించిన కోర్టు లిటిగేషన్లు క్లియర్‌ చేసుకున్నారు. ఒకవైపు భూమలను నేతల అనుచరగణం నొక్కేస్తుండగా, మరొకవైపు వందల ఎకరాల భూమి ట్యాంపరింగ్‌ అవుతోంది. ఇంకొకవైపు భూముల అమ్మకం పేరుతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి… దేవాదాయ శాఖను పక్కనపెట్టి తమ ఇష్టారాజ్యంగా మాన్సాస్‌ ఆస్తులు బొక్కేశారు.

కనీస వేతనాలు లేవు
మాన్సాస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న 14 విద్యా సంస్థలలోనూ కొన్ని దశాబ్దాలుగా కనీస వేతనాలు అమలు కావడం లేదు. నేటికీ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కి రూ.6 నుండి రూ.10 వేలు లోపే వేతనాలు చెల్లిస్తున్నారు. వాస్తవానికి వారి కేటగిరీలను బట్టి రూ.18 వేలు నుండి రూ.25 వేలు వరకు జీతాలివ్వాలి. అలాగే పి.జి కాలేజిలో యుజిసి నియమ నిబంధనల ప్రకారం 20 సంవత్సరాలు పని చేసిన ఒక ప్రొఫెసర్‌కు నెలకి రూ.1.5 లక్షలు చెల్లించాలి. కాని కేవలం రూ.25 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని అడిగితే అక్రమంగా తొలగించడం… లేదంటే భయపెట్టడం చేస్తున్నారు.

పోరుబాట పట్టిన ఉద్యోగులు
ఎంతో ప్రతిష్ట కల్గిన మాన్సాస్‌ విద్యా సంస్థలలో 2020 మార్చి నుండి ఆగష్టు వరకు ఆరు నెలల పాటు జీతాలు చెల్లించలేదు. ఒకవైపు కరోనా… మరొకవైపు ఆకలి. ఇంటి అద్దెలు, బ్యాంక్‌ ఇఎంఐ లు చెల్లించేందుకు అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు మాన్సాస్‌ ఉద్యోగులు. మరోవైపు ఛైర్మన్‌ సంచయితా గజపతిరాజు తమకు అనుకూలమైన ముగ్గురిని సలహాదార్లుగా నియమించుకొని నెలకి లక్షల్లో జీతం, కార్లు, అలవెన్సులు సకల భోగాలు కల్పిస్తున్నారు. మాన్సాస్‌ సంస్థకు రూ.140 కోట్లు ఎఫ్‌.డి.ఆర్‌లున్నాయి. గతంలో భూములు అమ్మిన రూ. 400 కోట్లు ఉన్నాయి. అయినా సంస్థ ఉద్యోగుల్ని ఆకలితో అలమటించేలా చేశారు. దీంతో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆగష్టు 15న భిక్షాటన కార్యక్ర మంతో ప్రభుత్వం దిగి వచ్చి రూ.3 కోట్ల 10 లక్షలను జీతాల నిమిత్తం విడుదల చేయాల్సి వచ్చింది. ఇది పట్టణ పౌర సంక్షేమ సంఘం, మాన్సాస్‌ ఉద్యోగుల పోరాట విజయం.

ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ల్యాండ్‌ సీలింగ్‌ను ఎదుర్కొనేందుకు మాన్సాస్‌కి, దేవాలయాలకి 14,800 ఎకరాల భూమిని అతుకుబడి చేశారు పివిజి రాజు గారు. నేడు ఆ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ట్యాంపరింగ్‌కి గురౌతు న్నాయి. మరోవైపు మాన్సాస్‌ వ్యాపార సంస్థలకీ లీజుకి ఇస్తున్నారు. విజయనగరం ట్యాంక్‌బండ్‌ కిందన ఉన్న 48 ఎకరాలను జయభేరి మోటార్స్‌కి, ఇతర ప్రైవేటు సంస్థలకి లీజుకిచ్చారు. రైతుల వద్ద దశాబ్దాలుగా ఉన్న భూమిని కౌలు రైతులకు చట్టబద్ధంగా ఇచ్చి వారికి న్యాయం చేయాలన్నా…సింహాద్రి అప్పన్న భూములను కాపాడాలన్నా… మహారాజ కళాశాలలో ఉద్యోగులకు కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలన్నా.. మరిన్ని విద్యా సంస్థ లు నిర్మించి ఉచిత విద్య అందించాలన్నా…మాన్సాస్‌ ట్రస్ట్‌ ను, ఎం.ఆర్‌.కళాశాల, విద్యా సంస్థలును ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆ దిశగా నేటి ప్రభు త్వం ఆలోచించాలి. అందుకు ప్రజలే ఒత్తిడి చేయాలి.

( వ్యాసకర్త విజయనగరం నగర సిపిఎం కార్యదర్శి )