• భార్యాపిల్లలపై కసితో ఉన్మాది ఘాతుకం
  • భార్య పుట్టింటికి వెళ్లి.. తలుపులు బద్దలు
  • థిన్నర్‌ చల్లి.. సుతిలి బాంబులు వేసి పరార్‌
  • నిద్రిస్తున్న ఐదుగురికి మంటలు.. భార్య మృతి
  • కూతురు, భార్య సోదరి, అన్నావదినలు విషమం
  • సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో ఘోరం

భార్యతో గొడవపడి ఉన్మాదిగా మారాడా వ్యక్తి! పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్యపై, ఆమె తరఫువారిపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి పూట ఆదమరిచి నిద్రిస్తున్న తన భార్య, కూతురు.. బావమరిది కుటుంబసభ్యులపై టర్పంటైన్‌ (థిన్నర్‌) పోసి నిప్పు పెట్టాడు. భార్య, కూతురు సహా ఐదుగురికి మంటలు అంటుకున్నాయి. ఆ బాధకు తాళలేక వారంతా హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో నిందితుడి భార్య మృతిచెందగా.. ఆమె 12ఏళ్ల కూతురు సహా నలుగురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ దారుణానికి తెగబడిన ఉన్మాది లక్ష్మీరాజం! పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మీరాజం స్వస్థలం కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నెమలికొండ. అతడికి 2007లో ఖమ్మంపల్లికి చెందిన విమల (38)తో పెళ్లి జరిగింది. వీరికి పవిత్ర (12) జైపాల్‌ (10) పిల్లలు.

వ్యసనాలకు బానిసైన లక్ష్మీరాజం పనీపాటా లేకుండా జులాయిగా తిరిగేవాడు. పైగా భార్యతో తరచూ గొడవపడేవాడు. పెద్దలు ఎప్పటికప్పుడు సర్దిచెపుతూ వస్తున్నా.. లక్ష్మీరాజంలో మార్పురాలేదు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన విమల ఏడాది క్రితం అతడిపై కేసు పెట్టింది. ఆరునెలల క్రితం జడ్జి ఎదుట భార్యాపిల్లలను మంచిగా చూసుకుంటానని చెప్పి, సిద్దిపేట భారత్‌నగర్‌లో అద్దె ఇంట్లో లక్ష్మీరాజం కాపురం పెట్టాడు. గురువారం విమల తన పిల్లలతో కలిసి ఖమ్మంపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అదేరోజు సాయంత్రమే సిద్దిపేటకు తిరిగి వెళ్దామనుకున్నా.. అప్పటికే తన అక్క సునీత పుట్టింటికి రావడంతో అక్కడే ఉండిపోయింది. ఆ రోజు రాత్రి విమలతో పాటు ఆమె కూతురు పవిత్ర, సోదరుడు జాన్‌రాజు, ఆయన భార్య రాజేశ్వరి, సోదరి సునీత కలిసి ఒకచోట నిద్రకు ఉపక్రమించారు. మరోగదిలో విమల కుమారుడు జైపాల్‌, ఆమె సోదరులు సంజీవ్‌, అనిల్‌ పడుకున్నారు.

కట్టె మొద్దుతో తలుపులు బద్దలు కొట్టి..అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు రెండుగంటల ప్రాంతంలో లక్ష్మీరాజం.. ఖమ్మంపల్లిలోని ఇంటికి వచ్చాడు. అక్కడున్న ఓ పెద్ద కట్టె మొద్దుతో ఇంటి తలుపులను బద్దలు కొట్టాడు. అనంతరం లోపలికి చొరబడి వెంట తెచ్చుకున్న టర్పన్‌టైన్‌ను నిద్రిస్తున్న భార్య విమల, కూతురు పవిత్ర, జాన్‌రాజు, సునీత, రాజేశ్వరిలపై పోశాడు. వారంతా నిద్రలేచి ఆప్రమత్తమయ్యేలోపే.. సుతిలి బాంబులు అంటించి వారిపై వేసి పారిపోయాడు. బాంబుల శబ్దానికి మరోగదిలో నిద్రిస్తున్న సంజీవ్‌, అనిల్‌ లేచి బయటకు రాగా.. అప్పటికే బాధితులంతా మంటలకు తాళలేక హాహాకారాలు చేశారు. బాధితులను తొలుత సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి, అనంతరం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విమల మృతిచెందింది. పవిత్ర, సునీత, జాన్‌రాజు, ఆయన భార్య రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. విమల కుమారుడు జైపాల్‌ మరోగదిలో పడుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. నిందితుడు లక్ష్మీరాజం కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. తొగుట సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా ఘటనపై మంత్రి హరీశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

వాడిని చంపేయండి…విమల-లక్ష్మీరాజం మధ్య గొడవలున్నాయి. మంచిగా బతకండంటూ ఎన్నోసార్లు చెప్పాం. కొద్దిరోజుల క్రితం భార్యాపిల్లలు కావాలని వస్తే.. మేమే సిద్దిపేటలో ఓ అద్దె ఇల్లును చూసి ఉంచాం. ఆ అద్దె కూడా మేమే చెల్లిస్తున్నాం. గురువారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరపడ్డాడు. దొంగలు పడ్డారేమోనని అనుకుంటుండగానే అందరిపై ఏదో ద్రావణం చల్లాడు. మేం తేరుకునేలోపే మా అందరికీ నిప్పు పెట్టాడు. వాడిని నడిరోడ్డుపైన చంపేయండి. లేదంటే మాకు అప్పగించండి. వాడిని చంపేందుకు ఐదు నిమిషాలు చాలు

                                                      – ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విమల సోదరి సునీత.

Courtesy Andhrajyothy…