లూదియానా: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, బడుగులు అష్టకష్టాలు పడుతున్నారు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. వలసలు పోయిన కార్మికులు స్వస్థలాలకు వచ్చే వీలు లేక విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ నిరుపేద హృదయ విదారక గాథ పంజాబ్‌లోని లుథియానాలో వెలుగు చూసింది. ప్రమాదంలో గాయపడిన భార్యను తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడం ఓ వ్యక్తి 12 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. క్షతగాత్రురాలైన భార్యను సైకిల్‌పై కూర్చోపెట్టుకుని కాలినడకన ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో మార్చి 20న ప్రమాదానికి గురై బాధితురాలు గాయపడింది. సహచర సిబ్బంది ఆమెను భరత్‌నగర్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కంగన్వాల్‌ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. ‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమెను తీసుకెళ్లేందుకు వాహనదారులు ఎవరూ ముందు రాలేదు. అంబులెన్స్‌ డ్రైవర్‌ 2 వేల రూపాయలు అడిగాడు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. చేసేది లేక సైకిల్‌పై నా భార్యను కాలినడకన కంగన్వాల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చాను’ అని బాధితురాలి భర్త దేవదుత్‌ రామ్‌ తెలిపాడు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న నిరుపేదలు కాలినడక వందల కిలోమీటర్లు నడిచి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.