విపత్తు, ఆరోగ్య అత్యయిక ఆర్డినెన్స్‌ను ఖండిస్తున్నామన్న సీఎల్పీ నేత
దొడ్డిదారి ఆర్డినెన్సు.. సీఎం రాజీనామా చేయాలి: వంశీచంద్‌
రాజ్యాంగ విరుద్ధం.. దుర్మార్గం: తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్లలో కోత విధించేలా సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన విపత్తు, ఆరోగ్య అత్యయిక ఆర్డినెన్సును ఖండిస్తున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, చేతులెత్తేసిందని ఆరోపించారు. దీన్నే గడిచిన రెండు బడ్జెట్‌ సమావేశాల్లోనూ తాను చెప్పానని, ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలను శాసనసభలోను, బయటా వివరించానని పేర్కొన్నారు. ఆర్డినెన్సును తీసుకురావడం ద్వారా అది నిజం అని సీఎం కేసీఆర్‌ తేల్చారని బుధవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. కేసీఆర్‌ చేసిన నిరర్థక పనుల వల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, తెచ్చిన అప్పులు, ప్రభుత్వ విచ్చలవిడి ఖర్చులపై తెలంగాణ సమాజం చర్చించాలని భట్టి విక్రమార్క కోరారు.

రాష్ట్రంలోని లక్షలాదిమంది ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించడానికి ఆర్ధరాత్రి దొడ్డిదారిన ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఆర్డినెన్సును కాంగ్రెస్‌ ఖండిస్తోందని గాంధీభవన్‌లో ఆయన పేర్కొన్నారు. వేతనాల్లో కోతలు చట్ట వ్యతిరేకమంటూ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించి దొడ్డిదారిన ఈ ఆర్డినెన్సును ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చర్యను సమర్థించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాత్రికి రాత్రి తీసుకురావడం దుర్మార్గమని, దీన్ని తక్షణం ఉపసంహరించుకుని పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు.

Courtesy Andhrajyothy