లండన్‌: నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూస‌ఫ్‌ జాయ్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేసిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్‌ మలాలా’ అని రాసి ఉన్న కేక్‌ను కట్‌ చేశారు.

‘నేను ఆక్స్‌ఫర్డ్‌లో నా ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తిచేశాను. దీనిపై నా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలుపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్‌, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా పేర్కొన్నారు.

కాగా, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్‌లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే.

Courtesy Sakshi