భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 10వ స్థానంలో భారత్‌ నిలిచింది.

న్యూఢిల్లీ, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కరోనా విజృంభణ తారాస్థాయిలో ఉంది. ముంబై ఎక్కువగా నమోదవుతున్న కేసులతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 50 దాటేసింది. 50,231 కరోనా కేసులతో మహారాష్ట్రలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ముంబైలోనే కరోనా కేసులు 30 వేలు దాటగా, 988 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలోని మరో పెద్ద నగరం పుణెలో కోవిడ్‌ కేసులు 5 వేలు దాటాయి. అటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై తర్వాత తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. చెన్నైలో కరోనా పాజిటివ్‌ కేసులు 10 వేలు దాటేశాయి. తమిళనాడులో 1,003 మంది పిల్లలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పదో స్థానంలో భారత్‌
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి 1,38,845కి చేరింది. తాజాగా 154 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. వరుసగా మూడో రోజూ 6 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం గమనార్హం. 55 వేల మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి శాతం 41.28గా నమోదైంది. 77,000 మంది చికిత్స పొందుతున్నట్టు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, దేశంలోని కరోనా కేసుల్లో 67 శాతం వాటా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలదే కావడం గమనార్హం. తమిళనాడులో 16,277, గుజరాత్‌లో 14,056, ఢిల్లీలో 13418 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌(7028), మధ్యప్రదేశ్‌(6665), ఉత్తరప్రదేశ్‌(6268) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో 10వ స్థానంలో భారత్‌ నిలిచింది.

పైకి ఎగిరిన దేశీయ విమానాలు