సీఏఏ, ఎన్నార్సీని తిరస్కరిస్తూ తీర్మానం చేసిన తొలి గ్రామం

ముంబయి : ఓ పెద్ద రాష్ట్రం.. అది మహారాష్ట్ర. దేశంలోనే ఇక్కడి రాజకీయం వేరుగా ఉంటుంది. అలాంటి రాష్ట్ల్రంలో.. ఓ చిన్న గ్రామం. అయినా పెద్ద నిర్ణయం తీసుకున్నది. సీఏఏను తమ గ్రామంలో అనుమతించబోమని తీర్మానం చేసింది… సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన గ్రామంగా రికార్డు సృష్టించింది. జాతీయ మీడియాలో ఆ గ్రామం ప్రధానవార్తల్లో నిలిచింది. అదే మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌ శివార్లలోని ఇస్లాక్‌ గ్రామం. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ అమలుకు తమ గ్రామం సహకరించబోదని తీర్మానం పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే… ఆ గ్రామంలోని రెండు వేల జనాభా ఉంటే…వారిలో ఒక్క ముస్లిం వాసి కూడా లేకపోవటం గమనార్హం. ఇస్లాక్‌ గ్రామంలో గిరిజన ప్రాబల్యం ఉన్నది. గ్రామస్తుల వద్ద రుజువులకు ఎలాంటి పత్రాలూ లేవు. స్థానికుల ఆందోళన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఈ తీర్మానంచేసింది. ‘గణతంత్ర దినోత్సవం జనవరి 26న మా గ్రామవాసి ఒకరు ఈ ప్రతిపాదన చేశారు. తమ వద్ద బర్త్‌ సర్టిఫికెట్లే లేవు.. ఇక తల్లిదండ్రులు.. తాతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎక్కడి నుంచి తెస్తాం. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు వారు ఏ పత్రాలనూ అందించలేరు. వారి వద్ద పత్రాలు లేనందున… ప్రభుత్వ పథకాల నుంచీ మా గ్రామస్తులు ఎలాంటి లబ్ది పొందటంలేదు’ అని గ్రామాధికారి అమోల్‌ షిండే అన్నారు. ‘గత మూడు నాలుగేండ్లుగా డాక్యుమెంట్ల కోసం ప్రభుత్వానికి మేం విన్నవించుకుంటూనే ఉన్నాం. కానీ, అవి మాకు రాలేదు. పౌరసత్వం నిరూపించుకోవటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి వారికి ఇప్పుడు పత్రాలు కావాలి. ప్రభుత్వమే ఇవ్వనప్పుడు… వాటిని ఇప్పుడు ఎక్కడినుంచి తెస్తారు. అందుకే మా గ్రామం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించి.. ఏకగ్రీవంగా ఆమోదించింది’ అని షిండే చెప్పారు. ‘రెండు వేల మంది జనాభా కలిగిన చిన్న గ్రామమిది. అందులో 700 నుంచి 800 మంది ఆదివాసీలుంటారు. తరతరాలుగా వారు ఇక్కడ నివసిస్తున్నారు. డాక్యుమెంట్లు లేవన్న కారణంతో భారతీయులు కాదంటారా?’ అని గ్రామ పంచాయతీ సభ్యుడు మహాదేవ్‌ గవాలి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు సహకరించకూడదని తాము నిర్ణయించుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ‘ఎన్పీఆర్‌, ఎన్నార్సీ విషయంపై ఏం చేయాలో మేం నిర్ణయించుకున్నాం. పత్రాల ఆధారంగా పౌరసత్వం ఇవ్వాలనుకుంటే… వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయమే జరుగుతుంది. పత్రాలు తేవటం వారికి అసాధ్యమే అవుతుంది. జిల్లా యంత్రాంగం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేం మా నిర్ణయాన్ని పంపాం..’ అని గ్రామ పంచాయతీ సభ్యుడు యోగేశ్‌ గార్గే విలేకరులకు చెప్పారు.

దేశం మొఘల్స్‌ పాలనలోకి..
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు హౌరెత్తుతుంటే.. వాటిని అణచివేయడానికి బీజేపీ నేతలు తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. దేశంలో విద్వేషాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”దేశంలో మెజారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుంటే దేశ పాలన తిరిగి మొఘల్స్‌ చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది” అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. బుధవారం లోక్‌సభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌ బాగ్‌ వద్ద జరుగుతున్న నిరసనలను ఆయన వ్యతిరేకించారు. మెజారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, దేశ పరిపాలన మొఘల్‌ రాజుల చేతుల్లోకి తిరిగి వెళ్తుందనీ, నిరసనలు ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. దేశంలో అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు క్లిష్టమైన సమస్యలను బీజేపీ పరిష్కరించిందని తెలిపారు. దేశవిభజన సమయంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో సీఏఏ ను తీసుకొచ్చామనీ, గత ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. గత సమస్యలను పరిష్కరించినప్పుడే.. నూతన భారతాన్ని ఆవిష్కరించబడుతుందని తెలిపారు.

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ..బీజేపీ హయంలోనే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందనీ, దేశ యువత ఉపాధి అవకాశాల్లేక రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈ సమయంలోనే న్యాయవ్యవస్థలో వెనుకబడిన సమాజానికి ప్రాతినిధ్యం వహించేలా అఖిల భారత న్యాయ సేవల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అనుప్రియా పటేల్‌ (అప్నా దళ్‌) డిమాండ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కేంద్రం నిధులు అందించలేదని ఖగెన్‌ ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా పోరాటం చేసే వారిని దేశద్రోహులు చిత్రీకరించడాన్ని ఏఐయూడీఎఫ్‌ నేత బద్రుద్దీన్‌ అజ్మల్‌ తప్పుబట్టారు. పౌర చట్టాలకు వ్యతిరేకంగా షాహీన్‌ బాగ్‌, ఇతర ప్రదేశాలలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలతో ప్రభుత్వం మాట్లాడాలనీ, వారికి నియమ నిబంధనలను వివరించాలని ఆయన అన్నారు.

Courtesy Nava telagnana