న్యూఢిల్లీ : పౌరసత్వ (సవరణ)బిల్లు-2019కి నిరసనగా మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజి) అబ్దుర్‌ రహమాన్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మత సామరస్యానికి చేసిన కృషికి గాను 2008లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్నారు. ”ప్రభుత్వ చర్య పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ఉద్యోగంలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. రేపటి నుండి కార్యాలయానికి హాజరు కాను. ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నదనడం విస్పష్టం. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. చట్టం ఎదుట అందరూ సమానమే అన్న దానికి వ్యతిరేకంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25లను ఉల్లంఘిస్తోంది.” అని రహమాన్‌ పేర్కొన్నారు. ఆయన ఐజిగా ఈ ఏడాది ఆరంభంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి (ఐఐటి) నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు. 1997వ బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి. స్టేట్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (ఎస్‌ఆర్‌పిఎఫ్‌) కమాండెంట్‌గా సేవలు అందించారు. యవత్‌మాల్‌ అదనపు ఎస్‌పిగా ఘర్షణల నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహరించారు.
రహమాన్‌ రెండు పుస్తకాలను కూడా రచించారు. ”నిరాకరణ, అణిచివేత -సచార్‌ కమిటి, రంగనాధ్‌ మిశ్రా కమిషన్‌ తరువాత”అని తాజాగా ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
”పౌరసత్వ (సవరణ) బిల్లును ఎన్‌ఆర్‌సితో పాటు అమలు చేయనున్నట్లు పదేపదే వింటున్నాం. అస్సాంలో ఎన్‌ఆర్‌సి ఫలితాలను ఇప్పటికే మనం చూశాం. దాదాపు 19 లక్షల మంది ప్రజలు ఎన్‌ఆర్‌సిలో నమోదు కాలేదు. వీరిలో 14 నుండి 15 లక్షల మంది దాకా హిందువులు ఉన్నారు” అని రహమాన్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ”సమాజంలో అణిచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ,ఓబిసి, ముస్లిం వర్గాలు ప్రజాస్వామిక విధానంలో బిల్లును వ్యతిరేకించాలి” అని ఆయన పిలుపునిచ్చారు. సహనాన్ని, లౌకికతత్వాన్ని, న్యాయాన్ని ప్రేమించే హిందూ సోదరులు కూడా బిల్లును వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Courtesy Prajashakthi..

ఈ వివక్షను వ్యతిరేకించండి

(పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మహారాష్ట్ర
ఐపీఎస్‌ అధికారి అబ్దుర్‌ రహ్మాన్‌ రాసిన బహిరంగ లేఖ పూర్తిపాఠం)
ప్రియమైన సోదర సోదరీమణులారా,

చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చిన శరణార్థుల్లో ముస్లిమేతరులైన హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ మతస్థులకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ(సవరణ)బిల్లు, 201౯, ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని స్పష్టంగానే తెలుస్తున్నది. చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ ప్రాథమిక భావనకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగపు 14, 15, 25 అధికరణలను ఇది ఉల్లంఘిస్తున్నది. రాజ్యాంగ ఆత్మ, మౌలికతకే ఇది వ్యతిరేకం. ఒక వ్యక్తికి పౌరసత్వం కల్పించడం లేదా తిరస్కరించడానికి మతాన్ని అధారంగా తీసుకోవడం సహేతుకం కాదు.

మతం ఆధారంగా దేశాన్ని విభజించాలనేదే ఈ బిల్లు ప్రధానోద్దేశంగా ఉంది. ఇది ముస్లింలలో అనేక భయాందోళనలు రేకెత్తించింది. పౌరసత్వం కాపాడుకోవడం కోసం ముస్లింలు తమ మతవిశ్వాసాలను వీడి అన్యమతంలోకి మారేలా ఇది నిర్బంధ పెడుతుంది. ఇది వేర్పాటువాద, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు.

ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌)తో పాటే దీన్ని అమలు చేస్తారని మనం చాలాసార్లు విన్నాం. అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలు తీరును, ఫలితాన్ని చూశాం. అక్కడ 19 లక్షల మంది ఎన్‌ఆర్‌సీలో నమోదు కాలేదు. వీరిలో 14–15 లక్షల మంది హిందువులే. ఆందోళనకరమైన దీని అమలు వల్ల నష్టపోయిన వారిలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు, ముస్లింలతో పాటు అన్ని మతాలకు చెందిన పేదలే ఎక్కువగా ఉన్నారు. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలు సమర్పించడానికి వీరు అత్యధికంగా వ్యయం చేసి, ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల వెంట పరుగులు తీశారు. వారి కాళ్లావేళ్లాబడ్డారు.

ఎన్‌ఆర్‌సీ, క్యాబ్‌ (సిటిజన్‌షిప్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు) సంయుక్తంగా అమలు చేస్తే, ముస్లిమేతరులు అవసరమైన పత్రాలు సమర్పించకపోయినా వారిని శరణార్థులుగా ప్రకటించి భారతీయ పౌరసత్వాన్ని కట్టబెడతారు. అంటే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత, భారం ముస్లింలపైనే పడుతుంది. వేల సంవత్సరాలుగా భారత దేశంలో నివసిస్తున్న ముస్లింలు అనేక గందరగోళాలు, కనాకష్టాలు అనుభవించవలసి ఉంటుంది. వీరిలో మెజారిటీ ప్రజలు ఈ దేశంలో జన్మించిన వారే. భారత దేశపు ఆత్మ అయిన మత బహుళత్వం, సహనశీలతలకు ఈ బిల్లు పూర్తి వ్యతిరేకం. దీని అమలు దేశ ప్రజల మధ్యనున్న సౌభ్రాతృత్వాన్ని, సత్సంబంధాలను నాశనం చేస్తుంది.

ఈ బిల్లును నేను ఖండిస్తున్నాను. సహాయ నిరాకరణగా ప్రభుత్వ సర్వీసులో కొనసాగవద్దనీ, రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లకూడదనీ నిర్ణయించుకున్నాను. అందుకే, నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నేను సర్వీసులో కొనసాగుతూ పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్న వారికి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.

ఈ బిల్లు వల్ల భారీగా నష్టపోతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, తదితర అణగారిన, పేద ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో దీనికి తమ వ్యతిరేకతను ప్రకటించాలని వినమ్ర పూర్వకంగా కోరుతున్నాను. అదే విధంగా, దీన్ని వ్యతిరేకించాలంటూ సుసంపన్న, సమైక్య భారత్‌ ఆదర్శంగా గల సహనశీలురు, సెక్యులర్లు, న్యాయ ప్రేమికులైన హిందూ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలంటూ పౌర, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలను కోరుతున్నాను.

అబ్దుర్‌ రహ్మాన్‌