దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో సీఎం ఫడణవీస్‌కు బలపరీక్షపై మరో 24 గంటల ఊరట లభించినట్లయింది.

వాదనలు సాగిన తీరిలా..
లేఖల ఆధారంగానే గవర్నర్‌ ఆహ్వానం..
తొలుత కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్పు చేశారు. ఆ తర్వాత నవంబరు 22న ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్‌ పవార్‌ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ను కోరారు. ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ మద్దతు లేఖల ఆధారంగా గవర్నర్‌ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు’ అని తుషార్‌ మెహతా తెలిపారు. ఇందుకు సంబంధించిన రెండు లేఖలను కోర్టుకు సమర్పించారు.

ఒక పవార్‌ మావైపు.. మరో పవార్‌ వారివైపు..
అనంతరం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘ఎన్నికల ముందు మాతో ఉన్న శివసేన తప్పుకోవడం వల్లే రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత మద్దతు ఇచ్చేందుకు అజిత్‌ పవార్‌ ముందుకొచ్చారు. ఒక పవార్‌ మా వైపు ఉన్నారు. ఒక పవార్ వారివైపు ఉన్నారు. వారి మధ్య ఉన్న కుటుంబ కలహాలతో మాకు సంబంధం లేదు. భాజపాకు మద్దతిస్తున్నట్లు అజిత్‌ పవార్‌ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను సమర్పించారు. దాని ఆధారంగానే గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సంతకాలు ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు చెప్పట్లేదు. బలపరీక్షకు సమయం ఇవ్వడం అనేది గవర్నర్‌ విచక్షణాధికారం. దాన్ని ఎలా ప్రశ్నిస్తారు. ఇంత సమయంలోనే బలపరీక్షకు ఆదేశించాలని కోర్టు చెబుతుందా? గవర్నర్‌ నిర్ణయం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు’ అని రోహత్గీ వాదించారు.

మా జాబితా చట్టబద్ధంగా ఉంది..
ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తరఫు న్యాయవాది మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ‘మా జాబితా చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా, వాస్తవికంగా సరైంది. భాజపాకు మద్దతివ్వాలనే అధికారం పార్టీ అజిత్‌ పవార్‌కు కల్పించింది. ఎన్సీపీ శాసనసభాపక్ష అధినేతగా అజిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మా లేఖ ఆధారంగానే గవర్నర్‌ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారు’ అని తెలిపారు.

రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలా..
ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ‘తెల్లవారుజామున 5.27గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిన అవసరమేంటీ? మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారు. అత్యవసర నిర్ణయాలకు కారణాలు కూడా చూపించలేదు. భాజపా-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టింది. దాంతో కాంగ్రెస్‌, ఎన్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ అంటున్నారు. కానీ ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ ప్రాతినిధ్యం వహించట్లేదని తెలిపే అఫిడవిట్లు కోర్టుకు సమర్పించాం. ఆయనను శాసనసభా పక్ష పదవి నుంచి తొలగించారు. భాజపాకు సంఖ్యా బలం ఉంటే 24 గంటల్లోగా మెజార్టీ నిరూపించుకోవాలి. తక్షణమే బలపరీక్ష జరిపేలా ఆదేశాలివ్వాలి’ అని కోర్టును కోరారు.

భాజపాకు ఆందోళన ఎందుకు..?
అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘ఇది చాలా మోసపూరిత చర్య. భాజపాకు మద్దతిస్తామని ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే అయినా అజిత్‌ పవార్‌కు చెప్పారా? అజిత్ పవార్‌ సమర్పించిన లేఖలో భాజపాకు మద్దతిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమే. శాసనసభలో బలాన్ని నిరూపించుకునేందుకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మెజార్టీ ఉందని భాజపా కూడా చెబుతోంది. అలాంటప్పుడు బలపరీక్షపై ఆందోళన ఎందుకు? దాన్ని ఎందుకు వాయిదా వేయాలనుకుంటున్నారు. తక్షణమే బలపరీక్ష జరపాలి’ అని సింఘ్వీ వాదించారు.

Courtesy Eenadu..