గతంలో తనకు జూనియర్‌గా ఉన్న బీజేపీని ఇప్పుడు తప్ప లొంగదీయలేమని శివసేనకు బాగా తెలుసు. పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న తండ్రి కలను అటుంచితే, పదిహేను రోజుల పాటు ఉద్ధవ్‌ ఇంత గట్టిగా నిలబడతారని ఎవరూ అనుకోలేదు. పదవుల కోసం బెట్టుచేస్తున్నారనీ, త్వరలోనే సర్దుకుపోతారనుకున్న కథ పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి కొద్దిగంటల ముందు రాజీనామా చేసిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ తన స్వభావానికి విరుద్ధంగా శివసేన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫలితాలు ఎలా ఉన్నా అధికారం మాత్రం ఫిఫ్టీ ఫిప్టీ అని ఎన్నికల ముందు చెప్పిన బీజేపీ, ఇప్పుడు మాట మార్చేసినందుకు శివసేన మండిపడుతున్నది.

అధికారం చెరి సగం అన్న ప్రతిపాదన ఎన్నడూ లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం తేల్చేస్తే, ఐదేళ్ళూ నేనే ముఖ్యమంత్రిని అని బల్లగుద్దుతున్న ఫడ్నవీస్‌ కూడా అవే మాటలు వల్లెవేస్తూ శివసేనపై ఎదురుదాడిచేయడంతో ఇద్దరి మధ్యా వ్యవహారం పూర్తిగా బెడిసికొట్టినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిలేని బీజేపీని మొదట ఆహ్వానించి రాజకీయ బేరసారాలకు గవర్నర్‌ తెరదీస్తారో, లేదా కాస్తోకూస్తో బలం చేకూర్చుకోగలిగే అవకాశాలున్న శివసేనకే ఈ అవకాశం ముందు దక్కుతుందో చూడాలి.

అతిపెద్ద పార్టీ బీజేపీకి అవసరపడే మరో 40మంది ఎమ్మెల్యేలు ఎక్కడనుంచి వస్తారో తెలియదు. దానినే ముందు పిలిస్తే, కొందరు బీజేపీ నాయకులు సగర్వంగా ప్రకటిస్తున్నట్టు తమ పార్టీ సగం ఖాళీ అవుతుందన్న భయాలు శివసేనకు ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మొఖం చాటేస్తున్నట్టు కనిపిస్తున్నా, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించినపక్షంలో వాటిని కూడగట్టుకోలనన్న నమ్మకం శివసేనది. పవార్‌, రాహుల్‌ చేతులు కలిపితే అసెంబ్లీలో ఠాక్రేల బలం సరిపడినంత ఉంటుంది.

ఫడ్నవీస్‌ తన రాజీనామా ప్రసంగంలో ప్రవచించిన విలువలను ఎద్దేవా చేస్తూ, కశ్మీర్‌లో బీజేపీ–పీడీపీ చేతులు కలపగా లేనిది తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేమిటని ఉద్ధవ్‌ ప్రశ్నిస్తున్నారు. మీరూ మీరూ ఎప్పటికీ ఒక్కటే, మేము విపక్షంలోనే కూర్చుంటామని పవార్‌ చెబుతున్నా శివసేన ఆయన వెంటపడుతూనే ఉన్నది. యువఠాక్రేని ముఖ్యమంత్రిని చేసి, పవార్‌కు ప్రధాన వాటా పదవులు కొన్ని పోగా మిగిలిన ఓ నాలిగింటికోసం పరువు పోగొట్టుకోవడం దేనికన్నది సోనియా ఆలోచన. ఈ మూడుపార్టీల కూటమి మూణ్ణాళ్లు కూడా మనలేదన్న అనుమానమూ ఆమెకు ఉండివుండవచ్చు. ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని స్థానాలు సంపాదించుకొని, బీజేపీ శివసేనలు అధికార పంపకాల దగ్గర ఇలా రోడ్డున పడటం విచిత్రం. అధికారాన్ని చెరిసగం పంచుకుందామన్న ప్రతిపాదనే లేదని బీజేపీ కొట్టిపారేస్తున్నప్పటికీ, ఎదుటి ముందు అధికారంలోకి వచ్చినా, ఆ తరువాత మరొకరికి కుర్చీ దక్కదన్న పరస్పర అవిశ్వాసమే పరిస్థితిని విమర్శలు దాటించి రిసార్టు రాజకీయాల వరకూ తెచ్చింది. మిత్రద్రోహులు మీరేనంటూ ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. తాము పవిత్రులమే కానీ, ఎదుటివారి కారణంగానే అపవిత్రులైమనట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి, శివసేన, బీజేపీలు కాస్తంత వేడి తగ్గించుకొని, మనసులు మార్చుకొని ఏదో ఒక రాజీకి వచ్చేవరకూ రాష్ట్రపతిపాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

తమను లొంగదీయడానికి బీజేపీ ఈ అస్త్రాన్ని కూడా సిద్ధం చేసిందని శివసేన ఇటీవలే వ్యాఖ్యానించింది. పెద్దాయన బాల్‌ఠాక్రే ఎన్నిస్థానాలు ఇస్తే అన్ని మారుమాట్లాడకుండా పుచ్చుకుని జూనియర్‌గా బతుక్కొచ్చిన బీజేపీ క్రమంగా తనను శాసించే స్థాయికి ఎదగడం శివసేన జీర్ణించుకోలేకపోతున్నది. షరతులకు రాజీపడుతూ, దానికంటే తక్కువస్థానాలకు పోటీచేస్తూ, అప్రాధాన్య పదవులతో కాషాయ సంకీర్ణంలో జూనియర్‌ భాగస్వామిగా మిగిలిపోవడం శివసేనకు నచ్చడం లేదు. శివసేనకు కంచుకోట అనుకున్న ముంబైలో బీజేపీ మునిసిపల్‌ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సంపాదించి, దాని భవిష్యత్తు ఏమిటో తెలియచెప్పింది. దీనితో, బాల్‌ఠాక్రే కాలం నుంచీ అనుసరిస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఆదిత్య ఠాక్రేని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించి, ఇప్పుడు బీజేపీ నిస్సహాయస్థితిని తన అధికారసోపానానికి వాడుకుంటున్నది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు తాము అధికారంలోకి రావడం కంటే, బీజేపీ భ్రష్టుపట్టిపోవడం ముఖ్యం. మహారాష్ట్ర రాజకీయం ఏ విధంగా ముగుస్తుందో తెలియదు కానీ, ముప్పయ్యేళ్ళనాటి మిత్రుడే ఇంతగా వేధిస్తున్న తరువాత మిగతా బీజేపీ మిత్రపక్షాలకు ఎక్కడలేని ధైర్యమూ రాకుండా ఉండదు.

Courtesy Andhrajyothy..