న్యూఢిల్లీ: ఓ మహిళను వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు సుబ్బయ్య షణ్ముగంను.. మధురైలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) బోర్డు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, గతంలో తనను వేధించాడంటూ చెన్నైలోని ఓ మహిళ షణ్ముగంపై ఫిర్యాదు చేసింది. తనను అసభ్య పదజాలంతో దూషించాడనీ, తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడంతో పాటు వాడిన మాస్కులు విసిరాడని ఆమె పేర్కొంది. అయితే తొలుత పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారు. దీంతో ఆ చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు కొన్ని ఫొటోలను అందించడంతో జులై 11న ఆడంబక్కం పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. తాజాగా మహిళపై వేధింపులకు గురిచేసిన వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ బోర్డులో సభ్యులుగా నియమించడం పలువురు ప్రతిపక్ష నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

”మహిళపై వేధింపుల కేసులో నిందితుడిని నియమించడం, మహిళలను అవమానించడం కాదా? అంటూ వీకేసీ నేత, తమిళనాడు ఎంపీ డి.రవికుమార్‌ ట్విట్‌ చేశారు. అలాగే, కాంగ్రెస్‌ ఎంపీ మణికం ఠాగూర్‌ సైతం సుబ్బయ్య షణ్ముగం నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వేధింపుల కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండగా ఆయన నియామకాన్ని ఎలా సమర్థిస్తారు అంటూ కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ను ప్రశ్నించారు. ”ఈ చర్య అసభ్య ప్రవర్తను ఆమోదం. ఇతర బీజేపీ కార్యకర్తలు కూడా ఈ విధంగా అనుసరించేందుకు ప్రొత్సాహమా?” అంటూ డీఎంకే ఎంపీ కనిమోళి ట్విట్‌ చేశారు.

Courtesy Nava Telangana