అదే భూమిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించాలి:కేవీపీఎస్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ : మహబూబాబాద్‌ జిల్లా మహబూబబాబాద్‌ మండలం ముడుపుగళ్ళు గ్రామం సర్వేనెంబర్‌ 283లో సొసైటీ భూమిలో నిరుపేద దళితులు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం అమానుషమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ఖండించింది. గురువారం ఈమేరకు కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్‌, తప్పెట్ల స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ అధికారులు పోలీస్‌ బందోబస్తు వచ్చి గుడిసెలను కూల్చారని విమర్శించారు 1976 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ముడుపుగళ్ళు సొసైటీ పేరా నాటి వరంగల్‌ కలెక్టర్‌ కాకి మాధవరావు దళితులకు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. అభివద్ధి పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కోవడం సరైందికాదని పేర్కొన్నారు. ముడుపుగళ్లు గ్రామంలో దళితుల ఇండ్లు చెరువు కట్ట కింద ఉండడం వల్ల నీరు చేరి ఇండ్లు అధ్వానంగా మారిపోయాయనీ, అలాంటి పరిస్థితుల్లో గత్యంతరంలేని స్థితిలో ఆనాడు ఇచ్చిన సొసైటీ భూమిలో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇండ్లు లేని పేదలందరికీ డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని తెలిపారు. గత ప్రభుత్వాలిచ్చిన భూములను గుంజుకుని పేదల ఇండ్లను కూల్చడం హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకున్న స్థలంలోనే డబల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ భూమికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు లేనట్లయితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.